
మనిషికి జీవనాధారమైన భూమిని ఆహ్లాదంగా ఉండేలా ప్రయత్నిస్తే.. ఆటోమేటిగ్గా అన్ని బాగుంటాయి. అందుకోసమే ప్రంపచవ్యాప్తంగా ఉన్న మానవళి ప్రయోజనార్థమే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సామాజికవేత్తలు. అలా ఏర్పాటైనవే ప్రకృతికి సంబధించిన దినోత్సవాలు. ఆ విధంగా వచ్చిన వాటిలో ఒకటి ఈ ఎర్త్ అవర్. అసలేంటిది..? ఆ ఒక్క రోజు.. ఒక్క గంటపాటు పాటించేస్తే నిజంగానే భూమిని కాపాడేసినట్లేనా..? అంటే..?. .
ఎర్త్ అవర్ అంటే.. పర్యావరణం కోసం ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఒక కార్యక్రమం. ప్రతి ఏడాది మార్చి నెలలో చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల మధ్య జరుగుతుంది. ఈపాటికే ఇరు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు మార్చి 22 శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపేయాలని అధికారికంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేసింది కూడా. అలాగే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందురూ స్వచ్ఛందంగా భాగం కావాలని కోరాయి ఇరు ప్రభుత్వాలు.
ఎలా ప్రారంభమైందంటే?
2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. WWF (World Wildlife Fund) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడటమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం.
ప్రాముఖ్యత ఎందుకు..
మన ప్రపంచానికి మన సహాయం కావాలి. మనం తినే ఆహారం నుంచి పీల్చే గాలి వరకు ప్రకృతి మనకు చాలా ఇస్తుంది. అది మనల్ని ఆరోగ్యంగా, అభివృద్ధి చెందేలా చేస్తుంది. డబ్ల్యూబడ్యూఎఫ్(WWF) ఎర్త్ అవర్ అనేది స్విచ్ ఆఫ్ చేసి మనం నివశించే గ్రహానికి(భూమి) తిరిగి ఇవ్వడానికి సరైన సమయం. ఎందుకంటే మనం ప్రకృతిని పునరుద్ధరించినప్పుడే అది మనల్ని పునరుద్ధరిస్తుంది.
'స్విచ్ ఆఫ్'లో ఉన్న ఆంతర్యం..
ఎర్త్ అవర్ అంటే కేవలం లైట్లు ఆర్పేయడం మాత్రమే కాదు - మానసికంగా "స్విచ్ ఆఫ్" చేసి అంతర్ముఖులం కావడమే. అంటే ఇది వరకు చూడండి కరెంట్ పోతే చాలు అంతా బయటకు వచ్చి ముచ్చటలు ఆడుకునేవాళ్లు. ఆ వసంతకాలం వెన్నెలను వీక్షిస్తూ భోజనాలు చేస్తూ..హాయిగా గడిపేవాళ్లం గుర్తుందా..?. అచ్చం అలాగన్నమాట. ప్రకృతితో గడపటం అంటే ఏ అడువులో, ట్రెక్కింగ్‌లే అక్కర్లేదు..మన చుట్టు ఉన్న వాతావరణంతో కాసేపు సేదతీరుదాం.
చిన్న పెద్ద అనే తారతమ్య లేకుండా ఫోన్ స్క్రీన్‌లతో గడిపే మనందరం కాసేపు అన్నింటికి స్విచ్ ఆఫ్ చెప్పేసి.. మనుషులతోనే కాదు మనతో మనమే కనెక్ట్ అవుదాం. తద్వారా గొప్ప మానసిక ఆనందాన్ని పొందుతాం కూడా. ఎందుకంటే సెల్‌ఫోన్ లేకుండా ప్రాణామే లేదన్నట్లుగా హైరానా పడుతున్న మనకు ఆ ఒక్క గంట అమూల్యమైన విషయాలెన్నింటినో నేర్పిస్తుందంటున్నారు మానసిక నిపుణులు.
మరి అంత గొప్ప ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొందామా..!. ఇది కేవలం భవిష్యతరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడమే గాక మనకు ఈ ఒక్క గంట లైట్స్ ఆపి చీకటిలో గడిపే చిన్నపాటి విరామంలో అయినా మనలో ఆరోగ్యం, ప్రకృతిని రక్షించుకోవాలనే మార్పు వస్తుందేమోనని ఆశిద్దాం.
(చదవండి: ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్‌లో ఇంత మోసమా..? వైరల్‌గా హర్ష గోయెంకా పోస్ట్)