
మంచి ముహూర్తానికే బిడ్డ పుట్టాలన్న గర్భిణి బంధువుల ఒత్తిడి.. వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రసవ నొప్పులు భరించలేకపోవడం.. కడుపుకోసి బిడ్డను తీసేస్తే పని అయిపోతుందిలే అన్న కొంతమంది వైద్యుల ధోరణి.. ప్రసవ కేసులతోనే కాసులు కూడబెట్టుకోవాలన్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరుతో అమ్మ కడుపుపై కత్తిగాట్లు పడుతున్నాయి. సాధారణ ప్రసవాల స్థానంలో శస్త్ర చికిత్సలు అధికంగా జరుగుతున్నాయి. అమ్మను దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా మార్చుతున్నాయి. జీవితాంతం వేదనకు గురిచేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో అమ్మకు కడుపుకోత తప్పడం లేదు. కాన్పుకు వెళ్తే.. అవసరమున్నా, లేకున్నా సిజేరియన్ పేరుతో వైద్యులు ‘సుఖప్రసవం’ చేసేస్తున్నారు. దీంతో చిన్న వయస్సులోనే ‘అమ్మ’లు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొద్దిరోజులుగా ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ అనే తేడాలేకుండా సాధారణ ప్రసవాలు చేయడమే మానేశారు.
కాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2023–24లో జిల్లాలో మొత్తం 10,417 ప్రసవాలు జరగ్గా.. ఇందులో 2,746 ప్రసవాలు శస్త్ర చికిత్సలు ద్వారా చేసినవే కావడం గమనార్హం. 2024–25లో 2,839 సిజేరియన్లు చేశారు.
సిజేరియన్లకే ప్రాధాన్యం
జిల్లాలో ఏటా సగటున 10 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన వారిలో దాదాపు 60 శాతం వరకు గిరిజనులు, పేదలే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వాస్పత్రులు 44, ప్రైవేట్ ఆస్పత్రులు 20 వరకు ఉన్నాయి. దాదాపు అన్నిచోట్లా గర్భిణులకు ‘కడుపు కోత’లతో వేదన తప్పడం లేదు.
అవసరం లేని సందర్భంలో సిజేరియన్లు చేయవద్దని పలు సందర్భాల్లో జిల్లా కలెక్టర్ చెబుతున్నప్పటికీ.. వైద్యుల తీరు మాత్రం మారడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో హైరిస్క్, ఆరోగ్య సమస్యల పేరుతో గర్భిణులను తరచూ పెద్దాస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్‌లకు పంపుతున్నారు. అక్కడ శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు.
చాలా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ప్రసవాలకు వెళ్తే.. పెద్దాస్పత్రులు వెళ్లాలని పంపించేస్తున్నారు. ఈ క్రమంలో అనేక సందర్భాల్లో 108 వాహనాల్లోనే మార్గమధ్యంలో ప్రసవాలు జరిగిపోతున్నాయి. గత మూడేళ్లలో 251 ప్రసవాలు 108 వాహనాల్లోనే కావడం గమనార్హం. మరోవైపు జిల్లా ఆస్పత్రికి గర్భిణుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 10 వరకు డెలివరీలు జరుగుతున్నాయి.
ప్రైవేటుకు వెళ్తే.. కాసుల బేరమే...
జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పుకు వెళ్తే ప్యాకేజీ మాట్లాడుతున్నారు. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలా వరకు యాజమాన్యాలు గర్భిణులను సిజేరియన్లకు సంసిద్ధం చేస్తున్నాయి. ఉమ్మనీరు తక్కువ ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని.. తల్లీబిడ్డల ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేమని.. ఇలా ఏదో కారణం చెప్పి గర్భిణి కడుపు కోసి.. డెలివరీ చేస్తున్నారు. మరికొంత మంది గర్భిణులు ముహూర్తాలు, ఇతర కారణాలతో వారు కోరుకున్న సమయానికి సిజేరియన్‌తో డెలివరీ చేయించుకుంటున్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని చేస్తున్న ప్రకటనలు అక్కడి వరకే పరిమితమవుతున్నాయి. సంపాదనే లక్ష్యంగా గర్భిణుల ప్రాణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు చెందిన కొందరు వైద్యులు అక్కడకు వచ్చిన గర్భిణులకు ఏదో కారణం చెప్పి.. తమ సొంత ఆస్పత్రుల్లో చేరేలా ప్రోత్సహిస్తుండడం గమనార్హం.
(చదవండి: సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని నివారించాలంటే..?)