
‘తాతగారూ!’ఆ పిలుపు విన్న సుందరరామయ్యకు వొళ్లు మండి వెనక్కి తిరిగి చూశాడు!సందేహం లేదు. పిలిచింది తననే. పిల్చిన శాల్తీ చిన్న పిల్లేంకాదు, సుమారు నలభై యేళ్ల ఆవిడే. ఆ పిలుపుకు మనసు కలుక్కుమన్న సుందరరామయ్య ఆమెకేసి గుర్రుగా చూశాడు. ఆమెకి తను తాతగారా? ఆవిడగారి వయసు తన కూతురు కంటే ఎక్కువే ఉంటుంది. తీరా తిరగబడి ఆవిడ వయసడిగి దులిపేద్దామనుకునేలోగా తిరిగి ఆమే నోరువిప్పింది. ‘తాతగారూ, ఒరిజనల్స్ తీసుకోవడం మర్చిపోయారు’ అంటూ! తాటాకు మంటలాంటి సుందరరామయ్య కోపం చటుక్కున చల్లారిపోయింది. జెరాక్స్ కాపీలు మాత్రం తీసుకొని ఒరిజనల్సే మర్చిపోయి, నెట్‌సెంటర్ నుంచి బయటకొస్తున్న సుందర రామయ్య నాలుక కరచుకొని వెనక్కువెళ్లి ఆవిడకు‘థాంక్స్’ చెప్పి మరీ అవి తీసుకున్నాడు.
తనకిష్టం లేని పదం ‘తాతగారు’. తానంత ముసిలోడిలా కనిపిస్తున్నాడా? ఆంగ్లంలో అందరికీ అన్వయించే ‘అంకుల్’ అనే పదముందిగా? తనను అంకుల్ అనో, మాస్టారూ అనో, పోనీ తెలుగులోనే పిలవాలనుకుంటే ‘బాబాయి’అనో పిలవకుండా ఈ దిక్కుమాలిన పదాన్నే ఉపయోగించాలా? మనసు కించిత్ గాయపడగా షాపు మెట్టుదిగి తను పార్క్ చేసిన స్కూటర్ దగ్గరకొచ్చాడు.
çస్కూటర్ ‘సెల్ఫ్‌స్టార్ట్’ కాక అవస్థలు పడుతూ నిట్టూరుస్తుండగా, నెట్‌సెంటర్‌కి వెళ్తున్న ఓ బట్టతల ఆసామీ ఆగి ‘మాష్టారూ, మెయిన్ స్టాండ్ వేసి ‘కిక్’ కొట్టండి అని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ స్టాండ్ వెయ్యడానికి శక్తి చాలని సుందరరామయ్య ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడి ‘అలవాటు లేదు’ అంటూ సాయం చేయ్యమన్నట్టు చూశాడు.
విషయం అర్థమైన ఆ మనిషి అవలీలగా మెయిన్ స్టాండ్ వేసి, స్కూటర్ స్టార్ట్ చేసి ఇచ్చాడు. ‘«థాంక్సండి’ అంటున్న సుందరరామయ్యను ‘అండి’ అనకండి గురువుగారూ, నేను మీ స్టూడెంట్‌నే, గుర్తుపట్టలేదా?’ అన్నాడు నవ్వుతూ. అంతటితో ఊరుకోకుండా! ‘మాష్టారూ, మీరు కింగ్‌లా వుండేవారు, ఇప్పుడు బాగా లొంగిపోయారు!’ అని కామెంట్ చేసి వెళ్ళడంతో అసలే నెట్ సెంటర్ నిర్వాహకురాలి పిలుపుతో కుంగిపోతున్న సుందరరామయ్యకు పుండుమీద కారం చల్లినట్టయింది. ‘తమ వయసు లోపాలు కప్పిపుచ్చుకోడానికి కొందరు ఇలాగే విమర్శలు, ఎదురుదాడి చేస్తుంటారు. తన శిష్యుణ్ణని చెప్పుకున్న ఆ మనిషికి నెత్తిమీద నాలుగు పుంజీలు వెంట్రుకలు కూడా లేవు. తను రంగేసున్నా నిక్షేపంలాంటి జుట్టు వుంది. అది చూసి అసూయపడి తన శరీర పటుత్వం గురించి వాగి వుండొచ్చు’ అని సరిపెట్టుకొని సుందరరామయ్య స్కూటరెక్కాడు.
ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఇల్లు చేరిన సుందరరామయ్య మనసును ఎవరికీ చెప్పుకోలేని అశాంతి, అలజడి మెలిపెడుతున్నాయి. తనకిష్టం లేని వయసు ప్రసక్తి తెచ్చిన నెట్‌సెంటర్ నిర్వాహకురాలి మీద, తన శిష్యుడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఇటీవల ఇలాంటి ‘షాకు’లు రాళ్లలా ఒకదాని వెంట ఒకటి తగులుతుంటే మనసు చితికిపోతోంది. ఒక్కొక్కటిగా ఎదురవుతున్న చేదు అనుభవాలు గుర్తొచ్చి మనసు తట్టుకోలేకపోతోంది. ఆ మధ్య పూర్వవిద్యార్థులు తారసపడితే ‘మాష్టారూ మీలో మార్పులేదు. అప్పుడెలా వుండేవారో ఇప్పుడూ అలాగే వున్నారు’ అని పొగుడుతుంటే చొక్కా బిగువయ్యేది. అలాంటిది డెబ్బైయవ ఏటలో అడుగుపెట్టిన తర్వాత వయసును దాచుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎదురయిన వాళ్లు పలకరించి మరీ మనసును కష్టపెట్టేలా కామెంట్లు చేస్తున్నారు.
వాళ్ల అభిప్రాయాలు అడక్కుండానే– ‘íపిడుగులా వుండేవారు మాష్టారు, బాగా పాడయిపోయారు. నడకలో తేడా వచ్చింది. చేతులు వణుకుతున్నాయి. మీరు రిటైరయి ఎన్నేళ్లయింది? ఏ సంవత్సరంలో రిటైరయ్యారు? అని వివరాల్లోకి వెళుతుంటే వాళ్ల దాడి నుంచి తప్పించుకోడానికి తల ప్రాణం తోకకొస్తోంది!వారం క్రితం గుమ్మం దగ్గర నిల్చుని వుండగా ఆ దారిన వెళ్తున్న ఓ అమ్మాయి ఆగి ‘‘తాతగారూ, అబద్ధాల సత్యవతిగారి ఇల్లెక్కడ?’’ అని అడిగింది. అంతే ఆ అమ్మాయి మీద ఒంటి కాలి మీద లేచి, ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’’ అని హెచ్చరించాడు. ఆ అమ్మాయి కంగారుపడుతూ, ‘‘అబద్ధాలనేది ఆవిణ్ణి కించపరిచేది కాదండి, ఇంటిపేరు’’ అని సమర్థించుకునేలోగా, ‘‘నువ్వింకా చిన్నకూచిననుకుంటున్నావా? పెళ్లయితే ఇద్దరు పిల్లలకు తల్లయేదానివి. నీకు నేను తాతలా కనిపిస్తున్నానా?’’ అని చిర్రుబుర్రులాడుతూ గొంతు పెంచాడు. దాంతో బిత్తరపోయిన ఆ అమ్మాయి, నలుగురూ చేరి గొడవయ్యేలోగా వెటకారంగా ‘సారీ తాతగారూ’ అంటూల్లగా అక్కణ్నుంచి జారుకుంది. అక్కడ మూగిన జనం తన వింత కోపానికి ముక్కున వేలే సుకున్నారు!
పై సంఘటన జరిగిన రెండ్రోజులకే మార్కెట్ నుంచి వస్తుండగా టైరు రాయి మీదకెక్కి స్కూటర్ ‘స్కిడ్’ అయి కింద పడిపోయాడు. చుట్టుపక్కల వున్న షాపుల వాళ్లు పరుగెత్తుకొని వచ్చి స్కూటర్‌నీ, తనను లేవదీశారు. స్కూటర్ తగిలించిన సంచిలోని కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోతే వాటిని జాగ్రత్తగా పోగుచేసి ఎత్తారు. తను సిగ్గుపడుతూ లేచి, బట్టలకు పట్టిన దుమ్ము దులుపుకొని బండి స్టార్ట్ చెయ్యబోతే వాళ్లు వారించి మంచినీళ్లు తాగించి కూర్చోబెట్టారు. ఆ తరువాత తను వెళ్లడానికి తొందరపడుతుంటే– ‘‘పెద్దవయసు కదా మాష్టారూ, ఇక మీరు స్కూటర్ మానెయ్యాలి, మీరు వెనక కూర్చుంటే మీ యింటి దగ్గర మా వాడు దింపి వస్తాడు’’ అని వాళ్లు తన పెద్దరికాన్ని గుర్తుచేస్తూ, సానుభూతిలో సహాయం చేస్తామంటే, తనకు మాత్రం వాళ్లు తన వయసును వెక్కిరిస్తున్నట్టనిపించి ‘‘సింగినాదం! వయసుదేముంది? బండిరాయి మీదకెక్కితే ఏ వయసు వాళ్లైనా పడకతప్పదు! అని పడ్డం తన వయసువల్ల కాదని వాళ్లను మారుమాట్లాడకుండా చేసి మొండిగా బండెక్కాడు.
ఇంటికెళ్లిన తరువాత తన ఘనకార్యం విని– ‘పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందనడం మీలాంటి వాళ్లను చూసే..’ అని యిల్లాలు నెత్తి వాచేలా చీవాట్లు పెట్టింది!ఆ సాయంత్రం ఒంటరిగా కూర్చొని టీవీలో వస్తున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ తన అభిమాన క్రికెటర్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ ఫోర్‌లు, సిక్స్‌లూ దంచేస్తుంటే ఆనంద పారవశ్యంతో చప్పట్లు కొడుతున్నాడు. ఆ మైకానికి అంతరాయం కలిగిస్తూ అయిదారుగురు వాకర్స్ క్లబ్ సభ్యులు కలిసికట్టుగా ఇంటికొచ్చారు. వస్తూనే ‘‘మీ ఆనందానికి విఘ్నం కలిగిస్తున్నాం’’ అంటూ నొచ్చుకుంటూనే కుర్చీల్లో సెటిలయ్యారు. కుశల ప్రశ్నల అనంతరం వాళ్లు వచ్చిన పని చెప్పారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగే క్లబ్ మీటింగ్‌లో ఒక ‘సీనియర్ సిటిజన్’ను సన్మానించాలని నిర్ణయించుకున్నామని, ఆ సన్మానానికి అర్హునిగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మీ పేరు ప్రతిపాదించారనీ, మీ అనుమతి, బయోడేటాల కోసం వచ్చామనీ విన్నవించారు. వాళ్ల ప్రతిపాదన విన్న తరువాత తనకు కోపం ముంచుకొచ్చింది. అయినా బయటపడకుండా తన కోపాన్ని అదిమిపెట్టి చిరునవ్వుతో వాళ్లకు క్లాస్ తీసుకున్నాడు.
‘‘నేను మీకంత వృద్ధుడిలా కనిపిస్తున్నానా? నేను చాలామందిలా నా వయసును తగ్గించుకోవడంలేదు. కానీ డెబ్బయ్యేళ్ల వయసు కూడా ఓ వయసేనా? నా వయసున్న సినిమా హీరోలు, రాజకీయ నాయకులు ఎంతమంది లేరు? ఆ మాటకొస్తే డెబ్బయ్యేళ్ల హీరోలు మనవరాళ్ల వయసున్న కుర్ర హీరోయిన్లతో కలిసి డాన్సులు చేస్తుంటే మనమంతా చూడ్డం లేదూ? అందుచేత వయసు కొలబద్దగా అందరినీ ఒకే గాటన కట్టెయ్యకూడదు. పరీక్షల్లో అరవయ్యేళ్ల వృద్ధుడు అని రాస్తుంటారు. అది అందరికీ అన్వయిస్తుందా? నా మట్టుకు నేను కృష్ణశాస్త్రి కవితలోలా వార్ధక్యాన్ని అంగీకరించను. ‘శీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు’ అని నిత్యయవ్వనాన్నే కోరుకుంటాను. ‘‘మీరు వచ్చేసరికి నేను చూస్తున్న 20–20 క్రికెట్ పడుచుతనంలాంటిది. వన్‌డే క్రికెట్ మధ్యవయసులాంటిది. ఇక టెస్ట్‌మ్యాచ్ వార్ధక్యం లాంటిది.
వీటిని బట్టి నేనేమిటో మీకర్థమైంది కదా! నేను నడకలో కాని, ఆటల్లో కాని, మీకెవరికీ తీసిపోను. నా సత్తా చూడాలంటే మీరు నడక పందెం పెట్టండి. అంతేగాని, సీనియర్ సిటిజన్‌గా నన్ను సన్మానిస్తామనడం నా ఫిట్‌నెస్‌ను అవమానించడమే! దయచేసి మీరు చెయ్యదలచుకున్న సన్మానానికి ఇంకెవరినైనా ఎంచుకోండి. కావాలంటే మీలో ఒకడిగా నేను కూడా ఒక దండ తీసుకొనివస్తాను’’.తన వాగ్ధాటికి, ఆత్మవిశ్వాసానికి ఎదురాడలేని క్లబ్ సభ్యులు ‘«థాంక్స్’ చెప్పి వెళ్లిపోయారు. ఆ క్లబ్ సభ్యులలో ఒకరైన డా.ధన్వంతరి దగ్గరకు వారం తిరక్కుండా తను వెళ్లవలసి వచ్చి ఆయనకు అడ్డంగా దొరికి పోయాడు.‘‘రండి, రండి, దయచేయండి ఓల్డ్ యంగ్‌మెన్ గారూ, ఊరక రారు మహాత్ములు’’ అంటూ కుర్చీ చూపిస్తూ ఆహ్వానించాడు డాక్టర్. ఆయన నవ్వుతూ ఆహ్వానించినా దాని మాటున ఎత్తి పొడుపు ధ్వనించింది.
‘‘నేను పక్కింటాయనతో పందెం కాసి వంద కొబ్బరి కాయలు వొల్చాను. ఆ శ్రమకి ఒళ్లంతా పులిసిపోయింది. ఆపైన జ్వరం కూడా. ఎందుకైనా మంచిదని మీకు చూపించుకుందామని.’‘‘మాష్టారూ, మీరెంతటి ఐర¯Œ మ్యాన్ అయినా ఈ వయసులో ఇలాంటి సాహసాలు చెయ్యకూడదు’’ అంటూ చెయ్యి, బీపీ చూశాడు. ‘‘అంతా నార్మల్‌గానే వుంది, ఒంటి నొప్పులు తగ్గడానికి బిళ్లలు రాసిస్తాను, అవి వాడి రెస్ట్ తీసుకోండి. ఇరవైలోలా ఇప్పుడు దూకుడు పనులు చేస్తే మాత్రం వయసు వూరుకోదు’’ అంటూ మెత్తగా చురకవేసి పంపించాడు డాక్టర్. ఆ హెచ్చరిక చెవికి శూలంలా గుచ్చుకొని ఇక డాక్టరు ముఖం చూడకూడదు అనుకున్నాడు తను!‘‘ఇలా ఎంత తప్పించుకుందామనుకున్నా, తన కిష్టంలేని వయసును గుర్తుచేసే హెచ్చరికలు అడుగడుగునా ఎదురై బాధపెడుతూనే వున్నాయి. కథల్లోనూ, సినిమాల్లోనూ తాతలకూ, తండ్రులకూ పెట్టే ‘అయ్యా’తో అంతమయ్యే పేరు కూడా తన నందరూ పెద్దవాళ్లతో జమకట్టడానికి ఒక కారణమేమో! చిన్నప్పుడే తన పేరును మార్చుకుంటానంటే అది తాతగారి పేరని, మార్చడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.
తన ఏకైక కుమార్తెకు పెళ్లి చేస్తే అరవయ్యేళ్లకే తాతా అని పిలిపించుకోవలసి వస్తుందని ఆ పిల్ల పెళ్లిని వీలయినంత ఆలస్యం చేశాడు. చివరకు బంధువర్గం పోరు పడలేక అమెరికా సంబంధం చేసి, వాళ్లు తరచుగా రారు, అలా తాత అనే పిలుపుకు దూరంగా వుండొచ్చు అనుకున్నాడు. ఆఖరికి స్థూలకాయం, ఎగుబట్ట వంటి తలతో ఆనందంగా ‘బామ్మగారూ’ అని పిలిపించుకొనే అర్ధాంగి సుబ్బమ్మను కూడా వెంటపెట్టుకొని తిరిగితే తన వయసు బయటపడుతుందని ఆమెను ఎక్కడకూ తీసుకెళ్లడం లేదు.ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా, అడ్డమైన వాళ్లు తన వయసు గురించి వాగి మూడ్‌ను పాడు చేస్తున్నారు. ఇంకా తలనెరిసిన ఇద్దరు, ముగ్గురు తను ‘యాక్టివ్’గా వుండడం చూసి ఓర్వలేక ఏడిపించడానికి తన వయసుకు అయిదారేళ్లు కలిపి ‘అలా కనిపిస్తున్నావు మరి’ అంటున్నారు. ఇలాంటి వాళ్లందరి తెగులు కుదర్చాలంటే తను గ్లామరు పెంచుకోవాలి.
మరింత స్మార్ట్‌గా తయారయి ‘మాష్టారూ, మీకు డెబ్బయ్యేళ్లంటే ఎవరూ నమ్మరు. యాబైలలోనో, అరవైలలోనో వున్నట్లు కనిపిస్తున్నారు’ అనిపించుకోవాలి. అందుకు ముందుగా డ్రెస్ మార్చాలి అనుకొని హుటాహుటిన క్లాత్‌షాపుకు వెళ్లాడు. ఇటీవల చాలామంది పెద్దవాళ్లు వయసు దాచుకోడానికి టీషర్ట్‌లు వేసుకుంటున్నారు గనుక తాను కూడా ఆ మార్గం అనుసరించాలని ఒకేసారి అరడజను టీషర్ట్‌లు తీసుకున్నాడు. అక్కడ ‘జీన్స్’ చూసి వాటిమీద కూడా మోజుపడ్డాడు. కానీ మోకాళ్ల దగ్గర చిరుగులు వగైరాలున్న అవి మీకు బావుండవని ‘సేల్స్ బాయ్స్’ నిరుత్సాహపరిస్తే వాటి జోలికి వెళ్లలేదు.
ఆనాటి నుంచి నిగనిగలాడే నల్లజుట్టు, డైలీ షేవ్, మోడరన్ డ్రెస్‌లు వగైరా మార్పులతో కనీసం పదేళ్ల వయసు తగ్గినట్టు కనిపిస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నాడు. మార్పు మహిమ వల్ల ఇంకెవరూ తన వయసు గురించి కామెంట్స్ చేయ్యకపోవడంతో బెంగ తప్పింది. కొస మెరుపు: ‘‘నన్ను కొట్టినా, తిట్టినా పడతాను కాని వయసు గురించి వంకరగా మాట్లాడితే మాత్రం సహించను’ అని తెగేసి చెప్పే సుందరరామయ్య డెబ్బై దాటి ఏడాది గడవకుండానే వాకర్ సహాయంతో నడుస్తూ ఎదురు పడిన వాళ్లు సానుభూతి చూపిస్తుంటే–‘ ఎంత రాయిలాంటి వాడయినా వయసును, వార్ధక్యాన్ని ఒప్పుకోకతప్పదు. నాకూ డెబ్బయ్యేళ్లు నిండాయి మరి!’’అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్‌రూమ్‌లో జారిపడితే అతనికి కాలు విరిగింది.