Yuva katha
-
ఈ వారం కథ:: సుందరరామయ్య@ 70
‘తాతగారూ!’ఆ పిలుపు విన్న సుందరరామయ్యకు వొళ్లు మండి వెనక్కి తిరిగి చూశాడు!సందేహం లేదు. పిలిచింది తననే. పిల్చిన శాల్తీ చిన్న పిల్లేంకాదు, సుమారు నలభై యేళ్ల ఆవిడే. ఆ పిలుపుకు మనసు కలుక్కుమన్న సుందరరామయ్య ఆమెకేసి గుర్రుగా చూశాడు. ఆమెకి తను తాతగారా? ఆవిడగారి వయసు తన కూతురు కంటే ఎక్కువే ఉంటుంది. తీరా తిరగబడి ఆవిడ వయసడిగి దులిపేద్దామనుకునేలోగా తిరిగి ఆమే నోరువిప్పింది. ‘తాతగారూ, ఒరిజనల్స్ తీసుకోవడం మర్చిపోయారు’ అంటూ! తాటాకు మంటలాంటి సుందరరామయ్య కోపం చటుక్కున చల్లారిపోయింది. జెరాక్స్ కాపీలు మాత్రం తీసుకొని ఒరిజనల్సే మర్చిపోయి, నెట్‌సెంటర్ నుంచి బయటకొస్తున్న సుందర రామయ్య నాలుక కరచుకొని వెనక్కువెళ్లి ఆవిడకు‘థాంక్స్’ చెప్పి మరీ అవి తీసుకున్నాడు.తనకిష్టం లేని పదం ‘తాతగారు’. తానంత ముసిలోడిలా కనిపిస్తున్నాడా? ఆంగ్లంలో అందరికీ అన్వయించే ‘అంకుల్’ అనే పదముందిగా? తనను అంకుల్ అనో, మాస్టారూ అనో, పోనీ తెలుగులోనే పిలవాలనుకుంటే ‘బాబాయి’అనో పిలవకుండా ఈ దిక్కుమాలిన పదాన్నే ఉపయోగించాలా? మనసు కించిత్ గాయపడగా షాపు మెట్టుదిగి తను పార్క్ చేసిన స్కూటర్ దగ్గరకొచ్చాడు.çస్కూటర్ ‘సెల్ఫ్‌స్టార్ట్’ కాక అవస్థలు పడుతూ నిట్టూరుస్తుండగా, నెట్సెంటర్కి వెళ్తున్న ఓ బట్టతల ఆసామీ ఆగి ‘మాష్టారూ, మెయిన్ స్టాండ్ వేసి ‘కిక్’ కొట్టండి అని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ స్టాండ్ వెయ్యడానికి శక్తి చాలని సుందరరామయ్య ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడి ‘అలవాటు లేదు’ అంటూ సాయం చేయ్యమన్నట్టు చూశాడు. విషయం అర్థమైన ఆ మనిషి అవలీలగా మెయిన్ స్టాండ్ వేసి, స్కూటర్ స్టార్ట్ చేసి ఇచ్చాడు. ‘«థాంక్సండి’ అంటున్న సుందరరామయ్యను ‘అండి’ అనకండి గురువుగారూ, నేను మీ స్టూడెంట్‌నే, గుర్తుపట్టలేదా?’ అన్నాడు నవ్వుతూ. అంతటితో ఊరుకోకుండా! ‘మాష్టారూ, మీరు కింగ్‌లా వుండేవారు, ఇప్పుడు బాగా లొంగిపోయారు!’ అని కామెంట్ చేసి వెళ్ళడంతో అసలే నెట్ సెంటర్ నిర్వాహకురాలి పిలుపుతో కుంగిపోతున్న సుందరరామయ్యకు పుండుమీద కారం చల్లినట్టయింది. ‘తమ వయసు లోపాలు కప్పిపుచ్చుకోడానికి కొందరు ఇలాగే విమర్శలు, ఎదురుదాడి చేస్తుంటారు. తన శిష్యుణ్ణని చెప్పుకున్న ఆ మనిషికి నెత్తిమీద నాలుగు పుంజీలు వెంట్రుకలు కూడా లేవు. తను రంగేసున్నా నిక్షేపంలాంటి జుట్టు వుంది. అది చూసి అసూయపడి తన శరీర పటుత్వం గురించి వాగి వుండొచ్చు’ అని సరిపెట్టుకొని సుందరరామయ్య స్కూటరెక్కాడు. ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఇల్లు చేరిన సుందరరామయ్య మనసును ఎవరికీ చెప్పుకోలేని అశాంతి, అలజడి మెలిపెడుతున్నాయి. తనకిష్టం లేని వయసు ప్రసక్తి తెచ్చిన నెట్‌సెంటర్ నిర్వాహకురాలి మీద, తన శిష్యుడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఇటీవల ఇలాంటి ‘షాకు’లు రాళ్లలా ఒకదాని వెంట ఒకటి తగులుతుంటే మనసు చితికిపోతోంది. ఒక్కొక్కటిగా ఎదురవుతున్న చేదు అనుభవాలు గుర్తొచ్చి మనసు తట్టుకోలేకపోతోంది. ఆ మధ్య పూర్వవిద్యార్థులు తారసపడితే ‘మాష్టారూ మీలో మార్పులేదు. అప్పుడెలా వుండేవారో ఇప్పుడూ అలాగే వున్నారు’ అని పొగుడుతుంటే చొక్కా బిగువయ్యేది. అలాంటిది డెబ్బైయవ ఏటలో అడుగుపెట్టిన తర్వాత వయసును దాచుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎదురయిన వాళ్లు పలకరించి మరీ మనసును కష్టపెట్టేలా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయాలు అడక్కుండానే– ‘íపిడుగులా వుండేవారు మాష్టారు, బాగా పాడయిపోయారు. నడకలో తేడా వచ్చింది. చేతులు వణుకుతున్నాయి. మీరు రిటైరయి ఎన్నేళ్లయింది? ఏ సంవత్సరంలో రిటైరయ్యారు? అని వివరాల్లోకి వెళుతుంటే వాళ్ల దాడి నుంచి తప్పించుకోడానికి తల ప్రాణం తోకకొస్తోంది!వారం క్రితం గుమ్మం దగ్గర నిల్చుని వుండగా ఆ దారిన వెళ్తున్న ఓ అమ్మాయి ఆగి ‘‘తాతగారూ, అబద్ధాల సత్యవతిగారి ఇల్లెక్కడ?’’ అని అడిగింది. అంతే ఆ అమ్మాయి మీద ఒంటి కాలి మీద లేచి, ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’’ అని హెచ్చరించాడు. ఆ అమ్మాయి కంగారుపడుతూ, ‘‘అబద్ధాలనేది ఆవిణ్ణి కించపరిచేది కాదండి, ఇంటిపేరు’’ అని సమర్థించుకునేలోగా, ‘‘నువ్వింకా చిన్నకూచిననుకుంటున్నావా? పెళ్లయితే ఇద్దరు పిల్లలకు తల్లయేదానివి. నీకు నేను తాతలా కనిపిస్తున్నానా?’’ అని చిర్రుబుర్రులాడుతూ గొంతు పెంచాడు. దాంతో బిత్తరపోయిన ఆ అమ్మాయి, నలుగురూ చేరి గొడవయ్యేలోగా వెటకారంగా ‘సారీ తాతగారూ’ అంటూల్లగా అక్కణ్నుంచి జారుకుంది. అక్కడ మూగిన జనం తన వింత కోపానికి ముక్కున వేలే సుకున్నారు!పై సంఘటన జరిగిన రెండ్రోజులకే మార్కెట్ నుంచి వస్తుండగా టైరు రాయి మీదకెక్కి స్కూటర్ ‘స్కిడ్’ అయి కింద పడిపోయాడు. చుట్టుపక్కల వున్న షాపుల వాళ్లు పరుగెత్తుకొని వచ్చి స్కూటర్‌నీ, తనను లేవదీశారు. స్కూటర్ తగిలించిన సంచిలోని కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోతే వాటిని జాగ్రత్తగా పోగుచేసి ఎత్తారు. తను సిగ్గుపడుతూ లేచి, బట్టలకు పట్టిన దుమ్ము దులుపుకొని బండి స్టార్ట్ చెయ్యబోతే వాళ్లు వారించి మంచినీళ్లు తాగించి కూర్చోబెట్టారు. ఆ తరువాత తను వెళ్లడానికి తొందరపడుతుంటే– ‘‘పెద్దవయసు కదా మాష్టారూ, ఇక మీరు స్కూటర్ మానెయ్యాలి, మీరు వెనక కూర్చుంటే మీ యింటి దగ్గర మా వాడు దింపి వస్తాడు’’ అని వాళ్లు తన పెద్దరికాన్ని గుర్తుచేస్తూ, సానుభూతిలో సహాయం చేస్తామంటే, తనకు మాత్రం వాళ్లు తన వయసును వెక్కిరిస్తున్నట్టనిపించి ‘‘సింగినాదం! వయసుదేముంది? బండిరాయి మీదకెక్కితే ఏ వయసు వాళ్లైనా పడకతప్పదు! అని పడ్డం తన వయసువల్ల కాదని వాళ్లను మారుమాట్లాడకుండా చేసి మొండిగా బండెక్కాడు. ఇంటికెళ్లిన తరువాత తన ఘనకార్యం విని– ‘పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందనడం మీలాంటి వాళ్లను చూసే..’ అని యిల్లాలు నెత్తి వాచేలా చీవాట్లు పెట్టింది!ఆ సాయంత్రం ఒంటరిగా కూర్చొని టీవీలో వస్తున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ తన అభిమాన క్రికెటర్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ ఫోర్లు, సిక్స్‌లూ దంచేస్తుంటే ఆనంద పారవశ్యంతో చప్పట్లు కొడుతున్నాడు. ఆ మైకానికి అంతరాయం కలిగిస్తూ అయిదారుగురు వాకర్స్ క్లబ్ సభ్యులు కలిసికట్టుగా ఇంటికొచ్చారు. వస్తూనే ‘‘మీ ఆనందానికి విఘ్నం కలిగిస్తున్నాం’’ అంటూ నొచ్చుకుంటూనే కుర్చీల్లో సెటిలయ్యారు. కుశల ప్రశ్నల అనంతరం వాళ్లు వచ్చిన పని చెప్పారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగే క్లబ్ మీటింగ్‌లో ఒక ‘సీనియర్ సిటిజన్’ను సన్మానించాలని నిర్ణయించుకున్నామని, ఆ సన్మానానికి అర్హునిగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మీ పేరు ప్రతిపాదించారనీ, మీ అనుమతి, బయోడేటాల కోసం వచ్చామనీ విన్నవించారు. వాళ్ల ప్రతిపాదన విన్న తరువాత తనకు కోపం ముంచుకొచ్చింది. అయినా బయటపడకుండా తన కోపాన్ని అదిమిపెట్టి చిరునవ్వుతో వాళ్లకు క్లాస్ తీసుకున్నాడు. ‘‘నేను మీకంత వృద్ధుడిలా కనిపిస్తున్నానా? నేను చాలామందిలా నా వయసును తగ్గించుకోవడంలేదు. కానీ డెబ్బయ్యేళ్ల వయసు కూడా ఓ వయసేనా? నా వయసున్న సినిమా హీరోలు, రాజకీయ నాయకులు ఎంతమంది లేరు? ఆ మాటకొస్తే డెబ్బయ్యేళ్ల హీరోలు మనవరాళ్ల వయసున్న కుర్ర హీరోయిన్లతో కలిసి డాన్సులు చేస్తుంటే మనమంతా చూడ్డం లేదూ? అందుచేత వయసు కొలబద్దగా అందరినీ ఒకే గాటన కట్టెయ్యకూడదు. పరీక్షల్లో అరవయ్యేళ్ల వృద్ధుడు అని రాస్తుంటారు. అది అందరికీ అన్వయిస్తుందా? నా మట్టుకు నేను కృష్ణశాస్త్రి కవితలోలా వార్ధక్యాన్ని అంగీకరించను. ‘శీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు’ అని నిత్యయవ్వనాన్నే కోరుకుంటాను. ‘‘మీరు వచ్చేసరికి నేను చూస్తున్న 20–20 క్రికెట్ పడుచుతనంలాంటిది. వన్డే క్రికెట్ మధ్యవయసులాంటిది. ఇక టెస్ట్‌మ్యాచ్ వార్ధక్యం లాంటిది. వీటిని బట్టి నేనేమిటో మీకర్థమైంది కదా! నేను నడకలో కాని, ఆటల్లో కాని, మీకెవరికీ తీసిపోను. నా సత్తా చూడాలంటే మీరు నడక పందెం పెట్టండి. అంతేగాని, సీనియర్ సిటిజన్‌గా నన్ను సన్మానిస్తామనడం నా ఫిట్నెస్ను అవమానించడమే! దయచేసి మీరు చెయ్యదలచుకున్న సన్మానానికి ఇంకెవరినైనా ఎంచుకోండి. కావాలంటే మీలో ఒకడిగా నేను కూడా ఒక దండ తీసుకొనివస్తాను’’.తన వాగ్ధాటికి, ఆత్మవిశ్వాసానికి ఎదురాడలేని క్లబ్ సభ్యులు ‘«థాంక్స్’ చెప్పి వెళ్లిపోయారు. ఆ క్లబ్ సభ్యులలో ఒకరైన డా.ధన్వంతరి దగ్గరకు వారం తిరక్కుండా తను వెళ్లవలసి వచ్చి ఆయనకు అడ్డంగా దొరికి పోయాడు.‘‘రండి, రండి, దయచేయండి ఓల్డ్ యంగ్‌మెన్ గారూ, ఊరక రారు మహాత్ములు’’ అంటూ కుర్చీ చూపిస్తూ ఆహ్వానించాడు డాక్టర్. ఆయన నవ్వుతూ ఆహ్వానించినా దాని మాటున ఎత్తి పొడుపు ధ్వనించింది.‘‘నేను పక్కింటాయనతో పందెం కాసి వంద కొబ్బరి కాయలు వొల్చాను. ఆ శ్రమకి ఒళ్లంతా పులిసిపోయింది. ఆపైన జ్వరం కూడా. ఎందుకైనా మంచిదని మీకు చూపించుకుందామని.’‘‘మాష్టారూ, మీరెంతటి ఐర¯Œ మ్యాన్ అయినా ఈ వయసులో ఇలాంటి సాహసాలు చెయ్యకూడదు’’ అంటూ చెయ్యి, బీపీ చూశాడు. ‘‘అంతా నార్మల్‌గానే వుంది, ఒంటి నొప్పులు తగ్గడానికి బిళ్లలు రాసిస్తాను, అవి వాడి రెస్ట్ తీసుకోండి. ఇరవైలోలా ఇప్పుడు దూకుడు పనులు చేస్తే మాత్రం వయసు వూరుకోదు’’ అంటూ మెత్తగా చురకవేసి పంపించాడు డాక్టర్. ఆ హెచ్చరిక చెవికి శూలంలా గుచ్చుకొని ఇక డాక్టరు ముఖం చూడకూడదు అనుకున్నాడు తను!‘‘ఇలా ఎంత తప్పించుకుందామనుకున్నా, తన కిష్టంలేని వయసును గుర్తుచేసే హెచ్చరికలు అడుగడుగునా ఎదురై బాధపెడుతూనే వున్నాయి. కథల్లోనూ, సినిమాల్లోనూ తాతలకూ, తండ్రులకూ పెట్టే ‘అయ్యా’తో అంతమయ్యే పేరు కూడా తన నందరూ పెద్దవాళ్లతో జమకట్టడానికి ఒక కారణమేమో! చిన్నప్పుడే తన పేరును మార్చుకుంటానంటే అది తాతగారి పేరని, మార్చడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. తన ఏకైక కుమార్తెకు పెళ్లి చేస్తే అరవయ్యేళ్లకే తాతా అని పిలిపించుకోవలసి వస్తుందని ఆ పిల్ల పెళ్లిని వీలయినంత ఆలస్యం చేశాడు. చివరకు బంధువర్గం పోరు పడలేక అమెరికా సంబంధం చేసి, వాళ్లు తరచుగా రారు, అలా తాత అనే పిలుపుకు దూరంగా వుండొచ్చు అనుకున్నాడు. ఆఖరికి స్థూలకాయం, ఎగుబట్ట వంటి తలతో ఆనందంగా ‘బామ్మగారూ’ అని పిలిపించుకొనే అర్ధాంగి సుబ్బమ్మను కూడా వెంటపెట్టుకొని తిరిగితే తన వయసు బయటపడుతుందని ఆమెను ఎక్కడకూ తీసుకెళ్లడం లేదు.ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా, అడ్డమైన వాళ్లు తన వయసు గురించి వాగి మూడ్‌ను పాడు చేస్తున్నారు. ఇంకా తలనెరిసిన ఇద్దరు, ముగ్గురు తను ‘యాక్టివ్’గా వుండడం చూసి ఓర్వలేక ఏడిపించడానికి తన వయసుకు అయిదారేళ్లు కలిపి ‘అలా కనిపిస్తున్నావు మరి’ అంటున్నారు. ఇలాంటి వాళ్లందరి తెగులు కుదర్చాలంటే తను గ్లామరు పెంచుకోవాలి. మరింత స్మార్ట్‌గా తయారయి ‘మాష్టారూ, మీకు డెబ్బయ్యేళ్లంటే ఎవరూ నమ్మరు. యాబైలలోనో, అరవైలలోనో వున్నట్లు కనిపిస్తున్నారు’ అనిపించుకోవాలి. అందుకు ముందుగా డ్రెస్ మార్చాలి అనుకొని హుటాహుటిన క్లాత్షాపుకు వెళ్లాడు. ఇటీవల చాలామంది పెద్దవాళ్లు వయసు దాచుకోడానికి టీషర్ట్లు వేసుకుంటున్నారు గనుక తాను కూడా ఆ మార్గం అనుసరించాలని ఒకేసారి అరడజను టీషర్ట్లు తీసుకున్నాడు. అక్కడ ‘జీన్స్’ చూసి వాటిమీద కూడా మోజుపడ్డాడు. కానీ మోకాళ్ల దగ్గర చిరుగులు వగైరాలున్న అవి మీకు బావుండవని ‘సేల్స్ బాయ్స్’ నిరుత్సాహపరిస్తే వాటి జోలికి వెళ్లలేదు. ఆనాటి నుంచి నిగనిగలాడే నల్లజుట్టు, డైలీ షేవ్, మోడరన్ డ్రెస్‌లు వగైరా మార్పులతో కనీసం పదేళ్ల వయసు తగ్గినట్టు కనిపిస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నాడు. మార్పు మహిమ వల్ల ఇంకెవరూ తన వయసు గురించి కామెంట్స్ చేయ్యకపోవడంతో బెంగ తప్పింది. కొస మెరుపు: ‘‘నన్ను కొట్టినా, తిట్టినా పడతాను కాని వయసు గురించి వంకరగా మాట్లాడితే మాత్రం సహించను’ అని తెగేసి చెప్పే సుందరరామయ్య డెబ్బై దాటి ఏడాది గడవకుండానే వాకర్ సహాయంతో నడుస్తూ ఎదురు పడిన వాళ్లు సానుభూతి చూపిస్తుంటే–‘ ఎంత రాయిలాంటి వాడయినా వయసును, వార్ధక్యాన్ని ఒప్పుకోకతప్పదు. నాకూ డెబ్బయ్యేళ్లు నిండాయి మరి!’’అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూమ్లో జారిపడితే అతనికి కాలు విరిగింది. -
యువ కథ: ఎంత ధైర్యం నీకు?
‘‘ఎంత ధైర్యం నీకు? మా వాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? నేను తలచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కొట్టిందే కాక ప్రిన్సిపాల్‌కు కంప్లయింట్ చేస్తావా’’ కోపంతో చంద్రిక మీద విరుచుకు పడింది శ్యామల.‘‘మేడం! నా తప్పేమీ లేదు. సిద్ధార్థ్..’’అని ఏదో చెప్పబోయింది చంద్రిక.‘‘నోర్ముయ్యి! మర్యాదగా వచ్చి వాడికి సారీ చెప్పు. కంప్లయింట్ వెనక్కి తీసుకో..’’ బెదిరిస్తూ అంది సిద్ధార్థ్ తల్లి శ్యామల.‘‘అవును మేడం, మీరు ఏమైనా చేయగలరు!. అన్యాయానికి కొమ్ము కాయగలరు, నిజాన్ని సమాధి చేయగలరు. మీ అబ్బాయి మత్తు పదార్థాలకు బానిసై పాశవికంగా ప్రవర్తించినందుకు కొట్టాను’’ ధారగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది చంద్రిక.ఆ మాట విన్న శ్యామల నెమ్మదించింది.‘‘ఏమిటి సిద్ధార్థ్ మత్తు పదార్థాలు వాడుతున్నాడా! నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు’’ నిజాన్ని జీర్ణించుకోలేక అంది.‘‘నిజం మేడం. మీ అబ్బాయి మీద నింద వేయాల్సిన అవసరం నాకేంటి? మావి పేద బతుకులు మేడం. బాగా చదువుకుంటే మా బతుకులు కాస్తయినా బాగుపడతాయని మెరిట్లో ఈ కార్పొరేట్ కాలేజీలో సీటు సంపాదించుకున్నాను. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి’’ అంది చంద్రిక.ఆ అమ్మాయిని చూస్తుంటే చిన్నప్పుడు చదువు కోసం తాను పడ్డ కష్టం గుర్తుకు వచ్చింది. చంద్రిక మాటల్లోఎటువంటి తడబాటు లేదు. ధైర్యంగా ఆత్మాభిమానంతో మాట్లాడుతోంది. ఆమె మాటల్లో నిజం ఉందనిపిస్తోంది. శ్యామల మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుతిరిగింది.తన కొడుకుని పది రోజులు సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ మీద ఆమెకు కోపంగా ఉంది. తన పవర్ చూపించాలని వెంటనే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసింది. వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, వాళ్ళు ఫోన్ ఎత్తక పోవడంతో విసుగొచ్చి, తానే స్వయంగా వెళ్లి ప్రిన్సిపాల్‌ను కలవాలనుకుంది.మరుసటి రోజు కాలేజీకి వెళ్ళింది.శ్యామల పలుకుబడి వున్న వ్యక్తి కావడంతో అటెండర్ ఆమెను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టాడు.‘‘ఎవరా ప్రిన్సిపాల్, మా వాడిని సస్పెండ్ చేసింది?’’ కోపంతో అడిగింది ఎదురుగా వచ్చిన అటెండర్ వైపు చూస్తూ.‘‘మేడమ్, ఆయన కొత్తగా వచ్చారు. రావడానికి ఆలస్యం అవుతుంది. మీరు కూర్చోండి మేడం. ఆయన వచ్చేస్తారు’’ అని ప్రిన్సిపాల్ రూమ్ చూపిస్తూ చెప్పాడు అటెండర్.ప్రిన్సిపాల్ రూమ్ లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ చైర్ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.తాను అంతకు ముందు వచ్చినప్పటికి, ఇçప్పటికి ఆ రూమ్‌లో చిన్న మార్పులు జరగడం గమనించింది. ప్రిన్సిపాల్ చైర్ వెనుకగా వున్న గోడకు వేలాడుతున్న వివేకుని సూక్తి ఆమెను ఆకర్షించింది, ‘కెరటం నా ఆదర్శం. పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు’ అన్న సూక్తి చదువుకుంది.ఇంతలో అక్కడకు వచ్చాడు ప్రిన్సిపాల్ వివేకానంద. అతన్ని చూసిన శ్యామల ఏమీ అనకుండా అతని వైపు ఉరుముతూ చూస్తూ వుంది. ఆమె గురించి అటెండర్ చెప్పడంతో తన సీట్లో కూర్చొని, ‘‘నమస్తే మేడం! మీ అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చారా?’’ అడిగాడు వివేకానంద.‘‘మాట్లాడడానికి ఏమీ లేదు. వాడిని సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ వాడిని కాలేజీకి వచ్చేలా చేయండి’’ దర్పం ప్రదర్శించింది.‘‘మేడం, అది జరగని పని. మీ వాడు చెడు వ్యసనాలకు లోనవడమే కాకుండా, అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించాడు. ఇది అతనికి వేసిన శిక్ష. అతను తన ప్రవర్తనను మార్చుకోకపోతే, అతన్ని ఈ కాలేజీ నుంచి శాశ్వతంగా తొలగించాల్సి వస్తుంది’’ స్థిరంగా చెప్పాడు వివేకానంద.ప్రిన్సిపాల్ మాటలకు ఒక్కసారిగా శ్యామలకు కోపం తలకెక్కి, ‘‘అసలు నీకెవరు ఇచ్చారు ఈ అధికారం?నేను తలచుకుంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది’’ గట్టిగా అరుస్తూ అంది శ్యామల.‘‘చూడండి మేడమ్, నేను చెప్పదలచుకున్నది చెప్పాను. మీ బెదిరింపులకు భయపడను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’’ అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు.‘ఇంత అవమానమా! ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. వీడి సంగతి తర్వాత చూస్తాను’ అని అనుకుంటూ కోపంతో అతని వైపు చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.ఇంటికి వెళ్ళేసరికి శ్యామల తల్లి ఇందిరమ్మ ముభావంగా కనిపించింది.‘‘అమ్మ! ఏమైంది? ఆరోగ్యం బాగాలేదు?’’ అని అడిగింది.‘‘శ్యామలా! సిద్ధు ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు.మాటల్లో తత్తరబాటు.. ఇవన్నీ చూస్తుంటే, అప్పుడు మీ అన్నయ్య మనకు దూరం అయిన రోజులు గుర్తుకు వస్తున్నాయి’’ దిగులుగా అంది ఇందిరమ్మ.ఒక్కసారి తన అన్నయ్య మత్తు పదార్థాలకు బానిసై జీవితం పోగొట్టుకొని, జీవచ్ఛవం అయి తమకు దూరమైన రోజులు గుర్తుకు వచ్చాయి. తనను తాను సముదాయించుకుంటూ,‘‘అమ్మా! భయపడకు ఈ విషయం నాకు తెలిసింది. నా అనుమానం ప్రకారం ఆ అమ్మాయి కారణంగానే సిద్ధు వాటికి బానిస అయ్యాడు అనిపిస్తోంది. భయపడకు వాడికి కౌన్సెలింగ్ ఇప్పిద్దాం’’ అని తల్లికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది.‘‘రేయ్ సిద్ధు! నీకేం తక్కువ చేశానురా? ఎందుకు ఇలాంటి వాటి జోలికి వెళ్తున్నావు?’’అని కొడుకును నిలదీసింది.‘‘అమ్మా! అది.. అది..’’ అంటూ మాటలు మారుస్తూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.శ్యామలకు కొడుకు పరిస్థితి అర్థమైంది. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి అని అనుకుంది. కొడుకును తనకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళింది.మొత్తం పరీక్షలు చేసిన డాక్టర్, ‘‘శ్యామలగారు! చూస్తుంటే మీ అబ్బాయికి ఎప్పటి నుంచో ఈ అలవాటు ఉన్నట్లుంది. దీని నుంచి బయట పడటానికి అవకాశాలు ఉన్నాయి కాని, మీరు చాలా కేర్ చూపించాలి. లేదంటే మీ అబ్బాయి మీకు దక్కడు. నా ప్రయత్నం నేను చేస్తాను’’అని కౌన్సెలింగ్ ఇచ్చి. మెడిసి రాసి ఇచ్చాడు. డాక్టర్ మాటలకు శ్యామల కంగారు పడింది. ‘‘లేదు డాక్టర్, నేను చూసుకుంటాను.’’ అని డాక్టర్‌తో చెప్పి కొడుకుతో ఇంటికి చేరుకుంది. ప్రతి క్షణంకొడుకును కనిపెట్టుకొని ఉంది. అయినా, అతను దొంగతనంగా వాటిని తీసుకుంటూనే ఉన్నాడు. ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా కొడుకులో మార్పు రాకపోవడం ఆమెలో కంగారు పెంచింది.అక్కడికి వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ఆ కాలేజ్ చైర్మన్ వీరభద్రం శ్యామలకు ఫోన్ చేశాడు.శ్యామలకు వీరభద్రం బాగా తెలిసిన వ్యక్తి కావడంతో తన సమస్యను ఏకరవు పెట్టింది.‘‘శ్యామలగారు! మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, నేను క్యాంపులో ఉండటం వల్ల మీ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ విద్యార్థుల మెరుగుదల కోసం తపించే వ్యక్తి. క్రమశిక్షణ వల్ల విద్యార్థులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తారని అతన్ని అపాయింట్ చేశాం. అతను ఇంకెవరోకాదు, ఒకప్పటి ఉత్తమ గురువు అవార్డు పొందిన పరమేశంగారి అబ్బాయి’’ అని చెప్పాడు. ఒక్కసారిగా శ్యామల గొంతు తడారిపోయింది. మాటలు పెగలడం లేదు. అప్పటి వరకు ఆమెలో ఉన్న కోపం పోయింది.‘‘నే.. నేను మళ్ళీ మాట్లాడతాను’’ అని ఫోన్ పెట్టేసింది.ఒక్కసారిగా తనలో ఏదో తెలియని అపరాధ భావం కలిగింది. ‘అంటే అతను గురువుగారి అబ్బాయా! ఎంత పని చేశాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గురువుగారు. అలాంటిది వాళ్ళ అబ్బాయిని అవమానించానా? ఎంత పాపం చేశాను? కొడుకు మీద ప్రేమతో ఇంత పాపానికి ఒడిగట్టానా’ అని అనుకుంటూ దిగులుతో ఒక్కసారిగా హాల్లోకి వెళ్ళి అక్కడే వున్న సోఫాలో కూర్చుండి పోయింది. ఏవేవో ఆలోచనలు ఆమెను సతమతం చేస్తున్నాయి.అప్పుడే తన భర్త వచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కొడుకు మొబైల్ చూస్తూ పక్కనే ఉన్నాడు. ‘శ్రీరామ రామ రామేతి’ అని జపిస్తూ ఇందిరమ్మ దేవుని దగ్గర దీపం వెలిగించింది. శ్యామల దృష్టి ఆ దీపం వైపుకు మళ్ళింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం గమనించింది. రెండు నిమిషాలు ఆలోచించిన తర్వాత,‘గురువుగారు, నన్ను క్షమించండి. ఆస్తి, అధికార దర్పంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తించాను. కొడుకును క్రమశిక్షణలో పెంచలేకపోయాను. పిల్లలు తప్పు చేస్తే, ఆ తప్పు తల్లితండ్రులదే కదా! గురువు మాటను జవదాటిన శిష్యురాలిది తప్పే కదా! ఈ తప్పుకు నాకు శిక్ష పడాలి కదా! పడాలి కదా!’ అనుకుంటూబాధాతప్త హృదయంతో సోఫా నుంచి పైకి లేచి ఆ దీపం దగ్గరకు వెళ్ళింది.ఒక్కసారిగా తన చెయ్యిని ఆ దీపంపై పెడుతూ నిల్చుంది.అది చూసిన ఇందిరమ్మ కంగారు పడుతూ,‘‘శ్యామలా! ఏమిటి నీకు పిచ్చి పట్టిందా?’’ కూతురు చేస్తున్నది చూసి అరిచింది ఇందిరమ్మ.ఇందిరమ్మ అరుపుతో అక్కడకు చేరుకున్నారు భర్త, కొడుకు.అందరూ దగ్గరకు వచ్చి తనని వారించడానికి ప్రయత్నం చేస్తుండటం గమనించి, కోపంగా‘‘దూరంగా వెళ్ళండి. ఎవరూ దగ్గరకు రావద్దు. ఒకవేళ వచ్చారో, నా మీద ఒట్టు! కొడుకును మంచి మార్గంలో నడిపించలేని నాకు శిక్ష పడాలి. డబ్బు అహంకారంతో ఒక అమ్మాయిని తప్పుపట్టిన నాకు, గురువుగారి అబ్బాయిని అవమానించిన నాకు పడాలి శిక్ష. గురువు మాటలు మరచి దారి తప్పి ప్రవర్తించినందుకు నాకు శిక్ష పడాలి. నైతిక విలువలు నేర్పకుండా డబ్బు చూపించి కొడుకును గారాబం చేసినందుకు నాకు శిక్ష పడాలి’’ అని తన చేతిని దీపానికి మరింత దగ్గరగా పెట్టింది.అగ్ని సెగ ఆమె చేతిని తాకి నొప్పి పెట్టడం, ఆమె కళ్ళంట నీరు కారడం, ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది.తల్లి మీద ఈగ వాలినా తట్టుకోలేని సిద్ధు– తనకు తాను శిక్ష వేసుకుంటున్న తల్లి బాధను చూసి తట్టుకోలేక పోయాడు.ఒక్కసారిగా వచ్చి తల్లి కాళ్ళ మీద పడుతూ, ‘‘అమ్మా! నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఈ క్షణం నుంచి నేను వాటి జోలికి వెళ్లను. నువ్వు చెప్పినట్లే చేస్తాను. దయచేసి నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు’’ అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు.కొడుకు కన్నీళ్ళు ఆమె కాళ్ళ మీద పడ్డాయి. కొడుకు నోటి నుండి ఈ మాట విన్న శ్యామల ఒక్కసారిగా కొడుకుని పైకి లేవదీసి, వాడిని గట్టిగా హత్తుకుంది.తాను ఎన్ని చెప్పినా, మాట వినని కొడుకులో ఈ విధంగా మార్పు రావడం చూసిన శ్యామల ఆశ్చర్యపోయింది. నిజం తెలిసి తనను తాను పశ్చాత్తాపంతో శిక్షించుకోవడంతో ఏ లోకంలోనో ఉన్న గురువుగారు నా కొడుక్కి బుద్ధి ప్రసాదించారేమో! అని తనలో అనుకుంటూ, గురువుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. కొడుకులో వచ్చిన మార్పు ఆమెకు ఆనందం ఇచ్చింది. -
యువ కథ: కనురెప్పలే సాక్షిగా
తెల్లవారుజామున సుమారుగా ఐదున్నర గంటలు– ఇండియా పాక్ సరిహద్దు ప్రాంతం. కంచెకు ఇవతల ఇండియా, అవతల పాకిస్తాన్. అక్కడి వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉంది. దట్టమైన పొగమంచు– పక్కన ఎవరున్నారో కూడా తెలుసుకోలేని విధంగా కమ్ముకుని ఉంది. సైనికులు చీమ చిటుక్కుమన్నా పసిగట్టేంత అలెర్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.కొంచెం దూరంలో ఏదో అలికిడి. మన సైనికులు ఒక్కసారిగా అప్రమత్తమై, చెవులు రిక్కించారు. రైఫిల్స్‌ను పొజిషన్లోకి తీసుకుని, అడుగులో అడుగు వేస్తూ, అలికిడి వచ్చిన దిశగా ముందుకు కదిలారు. వారికి అక్కడ ఎవరో ఉన్నట్టు అర్థమైంది. వారి దుస్తులు కొంతభాగం మాత్రం కనిపిస్తున్నాయి. వారి కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ, సైనికులు ఆ పొగమంచులో కదలకుండా ఉండిపోయారు. ఆ దుస్తులు మరింత ముందుకు వచ్చాయి. సైనికులు ముందుకు కదిలారు. అక్కడ కనిపిస్తున్న దుస్తులను చూస్తూ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. కారణం.. వారు పాక్ నుంచి నియంత్రణరేఖ ద్వారా ఇండియాలోకి చొరబడుతున్న ఉగ్రవాదులు.సైనికుల ధాటికి నిలబడలేక, తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రయోగించే సమయం లేక ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అదే సమయంలో ఇండియా సైనికులను చూసి వెనక్కు పారిపోయిన ఒక ఉగ్రవాది ఒకచోట నక్కి ఉన్నాడు. పడిపోయిన ఉగ్రవాదుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో వారి కన్నుగప్పి ఆ ఉగ్రవాది నియంత్రణరేఖ దాటి ఇండియాలోకి అడుగుపెట్టి, పొగమంచులో కలిసిపోయాడు.ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ ..నగరంలోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్. విదేశీ అతిథులు.. వివిధ దేశాల అధ్యక్షులు.. ప్రఖ్యాత పరిశ్రమల అధిపతులు.. సినీతారలు.. వ్యాపార ప్రముఖులు.. ఈ హోటల్లోనే బస చేస్తుంటారు. ఆ రోజు హోటల్ చాలా సందడిగా ఉంది. ముగ్గురు విదేశీ రాయబారులు ఇండియాకు వచ్చారు. వారికి అదే హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ అర్జున్ తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు. క్షుణ్ణంగా ఆ హోటల్ పరిసర ప్రాంతాలను తన డేగచూపుతో పరిశీలిస్తున్నాడు. హోటల్ వెనుక ప్రదేశాన్ని నిశితంగా పరిశీలిస్తూ వెనక్కు తిరిగాడు. అతడి మస్తిష్కంలో ఏదో తళుక్కుమని మెరిసింది. హోటల్ వెనుకభాగంలో రెండు మూడు అడుగుల దూరంలో మట్టి తవ్వినట్టుగా ఉంది. అది తెలియకుండా ఉండటానికి మట్టిని జాగ్రత్తగా కప్పేసి ఉంది. వెంటనే దూరంగా ఉన్న తన టీమ్‌కి సైగ చేశాడు అర్జున్. వారు తమతో పాటుగా స్నిఫర్ డాగ్‌ను అక్కడికి తీసుకొచ్చారు. అది ఆ ప్రాంతాన్ని వాసన చూసి, తన అరుపులతో హెచ్చరించింది.తక్షణమే అర్జున్ అతని టీమ్ రంగంలోకి దిగారు. అక్కడ పాతిపెట్టిన ఆర్డీఎక్స్ పేలుడు వస్తువులను కనిపెట్టారు. వాటిని పాతిపెట్టిన వారు హోటల్ లోపలకు చేరి ఉంటారేమో అనే ఆలోచన అర్జున్ను కలవరపరిచింది. వెంటనే హోటల్ లోపలకు పరుగు తీశాడు. అర్జున్ టీమ్ కొద్దిసేపటిలో అక్కడ పాతిపెట్టిన పేలుడు వస్తువులను పేలకుండా నిర్వీర్యం చేసేశారు. ఈలోపు అక్కడికి చేరుకున్న మరో టీమ్ వాళ్లు స్నిఫర్ డాగ్స్‌తో హోటల్ లోపలికి అడుగుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో... అక్కడికి చేరుకున్న ఇద్దరు ఉగ్రవాదులు ఏకే–47 తుపాకులతో కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించారు. అప్పటికే అక్కడున్న సెక్యూరిటీ పడిపోయి ఉన్నారు. వాళ్ళను తొక్కుకుంటూ లోపలికి వెళ్తున్న ఉగ్రవాదులను రిసెప్షన్లో ఉన్నవాళ్లు చూడనే చూశారు. అక్కడున్న డేంజర్ అలారం మోగిస్తూ ముందుకు కదిలారు. హోటల్లో ఉన్నవారితో పాటు ముగ్గురు విదేశీ రాయబారులు కూడా ఆ డేంజర్ అలారం విన్నారు. వెంటనే తమ గది తలుపులు తెరువబోతున్న విదేశీ రాయబారుల ఎదుట ఇన్స్పెక్టర్ అర్జున్ నిలబడి ఉన్నాడు. అతడిని చూసి వారు భయపడ్డారు. వారిని చూస్తూ అర్జున్ తన చేతి మణికట్టు మీద ఉన్న మువ్వన్నెల జెండాను చూపించాడు. అది చూసి వారు స్థిమితపడగానే, ‘ఎక్కువ సమయం లేదు. నాతో రండి’ అంటూ అక్కడి నుంచి వారిని వేగంగా పై అంతస్తుకు తీసుకెళ్లాడు. అప్పటికే కింద అంతస్తులలో తుపాకీ శబ్దాలు అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.అక్కడ ఒక మూలనున్న చీకటిగది తలుపు తెరిచాడు. వారిని అందులోకి పంపించి, ‘మీరు ఇందులోంచి వెళ్తే బయటకు చేరుకుంటారు. అక్కడున్న మా వాళ్ళు మిమ్మల్ని క్షేమంగా వేరేచోటుకు చేరుస్తారు’ అని చెప్తుంటే వారు ముగ్గురు అర్జున్‌ని కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ లోపలకు నడిచారు. వెంటనే అర్జున్ అక్కడనుండి బయటకు వచ్చి, తన చేతిలోని రైఫిల్‌ను పొజిషన్లోకి తీసుకుని ముందుకు నడిచాడు. అప్పటికే ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులతో ఆ హోటల్ రణరంగంలా ఉంది. తుపాకీతో ముందుకు నడుస్తున్న అర్జున్, అక్కడి గందరగోళం చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఏదైతే అదే అవుతుంది అనుకుంటూ మెట్ల మీదుగా కిందకు పరుగుతీశాడు. చిన్నపిల్లల అరుపులు.. మహిళల ఏడుపులు.. అర్జున్‌కి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకొన్ని మెట్లు దిగితే కింద అంతస్తు వచ్చేస్తుంది అనుకుంటూ వెళ్తున్న అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం అక్కడ మెట్ల కింద భాగంలో ఒక ఉగ్రవాది ఏకే–47 రైఫిల్ పట్టుకుని తనవైపు గురిపెట్టి ఉన్నాడు. వాడిని చూసిన అర్జున్ తన రెండు చేతులు పైకెత్తి, రెండు మెట్లు దిగాడు. ఇంకో మెట్టు దిగిన అర్జున్, మెరుపువేగంతో కదిలి వాడిని ఒక్క తోపు తోశాడు. వాడు అల్లంత దూరాన ఎగిరి పడ్డాడు. వాడి చేతిలోని ఏకే–47 దూరంగా ఎగిరి పడింది.అర్జున్ గాలిలోకి డైవ్ చేస్తూ ఏకే–47 అందుకున్నాడు. అది చూసిన ఉగ్రవాది అక్కడనుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క అర్జున్ రైఫిల్ పట్టుకుని తన చుట్టూ గమనించాడు. అక్కడ అప్పటికే చాలామంది చనిపోయి పడున్నారు. ఇంకొంతమంది రక్తమోడుతూ పడి ఉన్నారు. అర్జున్ తన చేతిలో ఉన్న ఏకే–47ను ఒక్కసారిగా ఆ ఉగ్రవాది వైపు గురిపెట్టాడు. క్షణాల్లో ఆ ఉగ్రవాది శరీరం జల్లెడలా మారి, కింద పడిపోయాడు. ఆ రైఫిల్‌ను అక్కడే పడేసి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించాలని ఆలోచిస్తూ ముందుకు రెండడుగులు వేశాడు అర్జున్. సరిగ్గా అప్పుడే.. బాంబు విస్ఫోటం.. హోటల్ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి దూరంగా విసిరేయబడ్డాడు అర్జున్. కొద్దిక్షణాల తరువాత అతడి కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి. ఎదురుగా దుమ్ము .. ధూళి .. నల్లటి పొగ .. వాటిని చూస్తూ పైకి లేవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కాని, అతడికి కదలడానికి శక్తి చాలడం లేదు. ఇంతలో లీలగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. వాటిని వినాలని చెవులు రిక్కించాడు.‘సాబ్.. నేను మీ గులాం.. నసీర్ అబ్దుల్లాని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టే ఇక్కడ మొత్తం అందరినీ చంపేశాం’ చెప్తూ వికటంగా నవ్వసాగాడు.అటుపక్క నుంచి చెప్తున్నది వింటూ, ‘అలాగే సాబ్.. నేను ఇక్కడనుండి వెంటనే తప్పుకుంటాను. ఈ ఫోన్ కాలుతున్న మంటలలోకి విసిరేస్తున్నాను’ అంటూ ఫోన్ మంటలలోకి విసిరేసి, అక్కడనుండి ముందుకు నడిచాడు. ఆ వ్యక్తి ఎవరో చూడాలని ప్రయత్నిస్తున్న అర్జున్‌కి కదలడం చేతకాక అలాగే ఉండిపోయాడు. అతడి కళ్ళు మూతలు పడిపోయాయి.రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) ఆఫీస్..మూడంతస్తుల ఆ భవనంలో చివరి అంతస్తు.. హోమ్ మినిస్టర్ ఆ అంతస్తులోకి అడుగుపెట్టాడు. హోమ్ మినిస్టర్ రాక గురించి తెలియగానే ‘రా’ చీఫ్ అగస్త్య అక్కడికి వచ్చాడు.‘అగస్త్యా! ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ మీద దాడి జరిగి నలభై ఎనిమిది గంటలు దాటింది. అమాయకులైన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి ఎవరు చేశారో మనకు తొందరగా తెలియాలి’ అన్నాడు.‘సర్ .. నాకు రెండుగంటలు టైం ఇవ్వండి’ అన్నాడు అగస్త్య. ఒకపక్క ఒక విశాలమైన గది. ఆ గది నుంచి బయటకు వచ్చిన ఒక డాక్టర్ అగస్త్యను కలిశాడు.‘సారీ అగస్త్యగారు! అతడికి ఎలాంటి మందులు పని చేయడం లేదు. శరీరం మొత్తం చచ్చుబడిపోయింది’ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.అగస్త్య విచారిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అది చిన్న సైజు హాస్పిటల్‌లా ఉంది. అక్కడ ఒక మంచం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి ఆ గదిలోనే ట్రీట్మెంట్ జరగడానికి వీలుగా అన్ని పరికరాలు అమర్చారు.అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.మంచం మీదున్న ఆ వ్యక్తిని కొద్దిసేపు అలా చూస్తుండిపోయాడు. తరువాత అక్కడున్న సిస్టం ఆన్ చేశాడు. పేపర్ వెయిట్ తిప్పుతూ ఆలోచనలో మునిగిపోయాడు. అతడు పేపర్ వెయిట్ తిప్పుతూ ఉంటే సిస్టంలో స్క్రీన్ సేవర్లు మారిపోతున్నాయి. తిప్పుతున్న పేపర్ వెయిట్ కిందపడిపోతుండగా, దానిని చేతులతో పట్టుకుని పక్కన పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో సిస్టంలో స్క్రీన్ సేవర్ ఆగిపోయింది. అది ఒక ప్రముఖ వ్యక్తి ఫొటో.కొద్దిసేపు తరువాత అక్కడనుండి వెళదామని అనుకుంటూ అగస్త్య పైకి లేచాడు. అనుకోకుండా అగస్త్య చూపు మంచం మీదున్న వ్యక్తి మీద పడింది. ఒక్కసారిగా అగస్త్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి, అగస్త్యవైపే చూస్తున్నాడు.అగస్త్య అతడిని చూస్తూ, ‘అర్జున్! బాగానే ఉన్నావా?’ అడిగాడు.అర్జున్ మాట్లాడలేకపోతున్నాడు. అతడి కళ్ళు మాత్రమే చూడగలుగుతున్నాయి.ఏదో చెప్పాలని అర్జున్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడి శరీరం ఇసుమంతైనా కదలడం లేదు. ఆ బాధ అతడి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. అతడి పరిస్థితిని ఆందోళనగా చూస్తున్నాడు అగస్త్య.‘కమాన్ .. అర్జున్ కమాన్.. నువ్వు మాట్లాడగలవు. నువ్వు తలుచుకుంటే పైకి లేచి నిలబడగలవు’ అని ధైర్యవచనాలు చెప్తూ అర్జున్‌ని ఉత్సాహపరుస్తున్నాడు అగస్త్య.అర్జున్ పైకి లేవడం కాదు కదా, కనీసం మాట్లాడలేడని అతడికి తెలుసు.‘అర్జున్.. నువ్విప్పుడు ఏదైనా చెప్పగలిగితే మనం ఆ ఉగ్రవాదులను పట్టుకోగలం. ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ దాదాపుగా ధ్వంసమైంది. నువ్వు కాపాడిన విదేశీ రాయబారులు క్షేమంగా తిరిగి వెళ్లిపోయారు.అందుకుగాను నీకు రాష్ట్రపతి ప్రశంస లభించింది. ఇప్పుడు ఆ ఉగ్రదాడి గురించి నువ్వు చెప్పే వివరాలు మాత్రమే మన దేశాన్ని కాపాడగలుగుతాయి’ అని చెప్తూ అగస్త్య అర్జున్ వంక చూశాడు. అర్జున్ కనులనుంచి నీటిచుక్కలు రాలిపడ్డాయి. అతని పక్కన కూర్చుని అగస్త్య కన్నీటిని తుడిచాడు. సరిగ్గా అదే సమయంలో.. అర్జున్ కళ్ళు అక్కడ ఆన్ చేసి ఉన్న సిస్టం మీద పడ్డాయి. సిస్టంను చూస్తూ అతడి కళ్ళు పెద్దవయ్యాయి.అర్జున్ కళ్ళలో మార్పులను గమనిస్తున్న అగస్త్య సిస్టంలో ఏముందా అని చూశాడు. అందులో.. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్– నాడీమండలం పని చేయడం ఆగిపోయి అమియోట్రోఫిక్ లాటరల్ స్కె›్లరోసిస్ వ్యాధి వలన స్టీఫెన్ హాకింగ్ కదలలేని, మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడు. అయినా, కేవలం కనురెప్పలు కదిలించడం ద్వారా ఎన్నో పుస్తకాలను రచించాడు.అది చూడగానే అర్జున్ కళ్ళలో ఏదో చెప్పాలన్న ఆరాటం కనిపిస్తోంది. అగస్త్య ఉత్సాహంగా పైకి లేచాడు. ‘అర్జున్! నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. నువ్వు ఆ ఉగ్రవాదుల గురించి ఏదో సమాచారం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కదా’ అన్నాడు అగస్త్య. ‘ఔను’ అన్నట్టుగా కనురెప్పలు ఆడించాడు అర్జున్. ‘అర్జున్ ముందు వాళ్ళ పేర్లు తెలిస్తే చెప్పు. వాళ్ళు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులో నేను కనిపెడతాను’ అన్నాడు అగస్త్య.అందుకు సమాధానంగా కనురెప్పలు కదిలించాడు అర్జున్.‘మొదలుపెడదాం’ అంటూ అగస్త్య, ‘నేను ఏబీసీడీలు చెప్తుంటాను. వాడి పేరులో మొదటి అక్షరం వచ్చినప్పుడు కనురెప్పలు కదిలించు అన్నాడు. చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఎన్’ అన్నప్పుడు కనురెప్పలు కదిలించాడు అర్జున్. ఎన్ అనే అక్షరం రాసి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు అగస్త్య. అలా ‘నసీర్ అబ్దుల్లా’ పేరు బయటకు వచ్చింది. అర్జున్ను చూసి అగస్త్యకు కళ్ళు తడిబారాయి.పేరు మోసిన ఉగ్రవాద సంస్థకు చెందిన నసీర్ అబ్దుల్లాను, మిగిలినవారిని ‘రా’ అరెస్ట్ చేసింది.కేవలం ‘కనురెప్పలే సాక్షిగా‘ భయంకరమైన ఉగ్రవాదులను కనిపెట్టినందుకు అర్జున్‌కు ప్రత్యేకమైన అవార్డు ప్రకటించారు. -
యువ కథ: మలిసంధ్య
అప్పుడప్పుడే పడమటి కొండల్లోకి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ, నిట్టూర్పుతో మరుసటి రోజు కోసం ఎదురుచూద్దాం అనుకుంటూ అటువైపుగా చూస్తూ ఉంది పెద్దావిడ అన్నపూర్ణమ్మ. ఊళ్లో వాళ్లంతా ఆమెను పెద్దమ్మ అని ప్రేమతో పిలుస్తారు. అందరికీ ప్రేమను పంచుతూ, ఒకరికి కష్టం వస్తే, అది తనకే వచ్చిందనుకుని తపనపడే దొడ్డమనసు అన్నపూర్ణమ్మ సొంతం. ఊళ్లోని సాటి ఆడవాళ్లు ‘వదినగారు’ అని, పిల్లలందరూ ‘బామ్మ’ అని ఏదో ఒక వరుస కలుపుకొని ఆమెను పిలుస్తుంటారు. ఊరి మనుషులందరి అభిమానాన్ని సంపాదించుకున్న మహానుభావురాలు అన్నపూర్ణమ్మ.ఈ రోజు ఒంటరిగా మిగిలినా, ఒకప్పుడు ఆమె కుటుంబం చాలా పెద్దది. భర్త పరంధామయ్య శ్రీరాముడంతటి మనిషి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంలో లాభాలు గడిస్తూ, పదిమందికీ పెట్టే గుణం గల దయార్ద్ర హృదయుడు పరంధామయ్య. పేరుకు తగ్గట్లే అడగకుండానే కడుపు నింపే చల్లనితల్లి అన్నపూర్ణమ్మ. ఆ దంపతుల కొడుకులు సరస్వతీపుత్రులు, కూతుళ్లు చదువుల తల్లులు. ఊళ్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ముందుగా గుర్తొచ్చేది అన్నపూర్ణమ్మనే! సజావుగా సాగిపోతున్న ఆమె జీవితంలో అనుకోని కష్టం కెరటంలా ముంచుకొచ్చి, పరంధామయ్యగారిని తీసుకుపోయింది. ఆయన మరణంతోనే అన్నపూర్ణమ్మ సంతోషం దూరమైంది.చదువులు పూర్తయ్యాక పిల్లలకు పెళ్లిళ్లు చేసేసి, బాధ్యతలన్నీ పూర్తిగా నెరవేర్చుకుంది అన్నపూర్ణమ్మ. ఊళ్లోని పెద్దల సమక్షంలో ఆస్తిని సమ భాగాలు చేసి, పిల్లలందరికీ సమానంగా పంచింది. పంపకాల తర్వాత ఉద్యోగాల పేరిట ఎవరి దారి వారు చూసుకున్నారు. మిగిలింది వైభవంగా బతికిన ఇల్లు, దేవాలయంలాంటి ఆ ఇంట్లో దేవతలాంటి అన్నపూర్ణమ్మ. ఆ రోజు అన్నపూర్ణమ్మ పనిమనిషి రంగిని తోడుగా తీసుకుని, రామాలయానికి వెళ్లింది. అక్కడ భజనలో కూర్చుని, రామాయణాన్ని ఆలకిస్తూ, రామాయణ సారంలో తన సంసారాన్ని గుర్తు తెచ్చుకుని, ఆ శ్రీరామునికి నమస్కరించి, రంగితో కలిసి ఇంటికి బయలుదేరింది.మర్నాడు తెల్లారింది. రంగి కళ్లాపి చల్లి, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న రంగి మెదడులో ఒకటే ఆలోచన– ఎప్పుడూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచే అన్నపూర్ణమ్మ ఇంకా నిద్రలేవలేదేంటా అనుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి వసారాలోకి చూస్తూ, ముగ్గు ముగించింది.‘అమ్మగారూ!.. అమ్మగారూ!’ అని పిలుస్తూ, అన్నపూర్ణమ్మను లేపడానికి వెళ్లింది. రంగి పిలుపుతో అన్నపూర్ణమ్మ నెమ్మదిగా లేచింది. ‘ఏమైందమ్మా! ఇంతసేపు ఎప్పుడూ పడుకోలేదు’.. అంటూ రంగి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.‘ఏమీ లేదే! రాత్రంతా మగత నిద్ర. తెల్లవారుతుండగా నిద్రొచ్చి, రెప్పల మీద వాలింది’ అంటూ ‘కాఫీ తెమ్మ’ని పురమాయించింది అన్నపూర్ణమ్మ. రంగి తీసుకొచ్చిన కాఫీ తాగింది. మనసులో ఏదో ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడట్లేదు.పని ముగించుకుని, రంగి ఇంటికి వెళుతుండగా, ‘రంగీ! ఒకసారి ఇలా రా!’ అని పిలిచింది. రంగి వాలుకుర్చీ పక్కనే కూర్చుని, ‘సెప్పండమ్మా!’ అంది. ‘ఏంలేదే, నీతో మాట్లాడాలి. కాసేపాగి వెళుదువుగాని’ అంది అన్నపూర్ణమ్మ. ‘అలాగే, అమ్మగారు’ అంటూ సర్దుకుని కూర్చుంది. ‘అసలు మీకేమైనాది? అంత పరాగ్గా ఉన్నారేటి అమ్మగారు? నేనే అడుగుదామను కుంటుండా. అందరికీ ఏం అక్కర ఉన్నా సాయం చేసేటోళ్లు, మనసులో బాధ కూడా సెప్పకనే తెలుసుకునేటోళ్లు– అట్టాంటిది, మీకేమైనాదమ్మా! నాతో సెప్పండమ్మా’ అని అడిగింది. ‘ఏమిటే, నీతో మాట్లాడదాం అని నిన్ను నేను పిలిస్తే, నాకు ఊరటనిస్తున్నావా?’ అంది అన్నపూర్ణమ్మ.‘సరేగాని, నీ బిడ్డడు పనిలో కుదురుకున్నాడా?’ అడిగింది.‘ఎక్కడమ్మా! ఆడికొచ్చిన అరకొర సదువుతో యాడ కుదురుకుంటాడు తల్లీ!’ నిట్టూర్చింది రంగి.‘సరేలే! అయితే, నువ్వూ నీ కొడుకు ఇద్దరే కదా, నాతో ఉంటారా?’ అడిగింది అన్నపూర్ణమ్మ.ఆ మాటకు రంగి బిగుసుకుపోయి, ‘అదేటమ్మా? మీతో మేమెలా?’ అంటూ తల గోక్కుంటూ ఇబ్బంది పడుతుంటే, ‘సామానంతా సర్దుకుని, తయారుగా ఉండండి. రేపు మొదటి బండికి మనం పట్నం బయలుదేరుతున్నాం’ అంటూ రంగి సమాధానం తెలిసినట్లుగా ఆజ్ఞాపించింది అన్నపూర్ణమ్మ. ఎందుకో, ఏమిటో అనుకుంటూ అయోమయంలో ఇంటికి బయల్దేరింది రంగి.మరుసటి రోజు పొద్దున్నే రంగి, ఆమె కొడుకు నాగ అన్నపూర్ణమ్మ ఇంటికి సామానుతో వచ్చారు. బండికి ఇంకాస్త సమయం ఉంది. ప్రయాణంలో తినడానికి కొన్ని తినుబండారాలను బ్యాగులో సర్దింది రంగి. ఈలోగా అన్నపూర్ణమ్మ తయారై, బండి తెమ్మని పురమాయించింది. ముగ్గురూ రైల్వేస్టేషన్‌కు చేరుకుని, రైలులో కూర్చున్నారు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్న అన్నపూర్ణమ్మ కళ్లు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోయాయి. నీటి తెరల వెనుక జ్ఞాపకాల అలలు ఒక్కొక్కటిగా మెదిలాయి. ఆ రోజు అన్నపూర్ణమ్మ కూతురికి డెలివరీ టైమ్ దగ్గరపడుతుండటంతో కూతురి దగ్గరకు వెళ్లింది.అన్నీ సవ్యంగా జరిగాయి. మహాలక్ష్మి రూపంలో కవలలు పుట్టారు కాని, అతుక్కుని పుట్టారు. హాస్పటిల్‌లోనే చాలా రోజులు ఉన్నాక డిశ్చార్జ్ అయ్యారు.హారతితో ఎదురువెళ్లిన అన్నపూర్ణమ్మకు బిడ్డలు కనబడలేదు. కూతురు, అల్లుడు– అంతే! ‘ఏమైంద’ని అడిగితే, ఆధునికతను అణువణువూ నింపుకున్న వాళ్లకు బిడ్డలు బరువు అనిపించి, ఆశ్రమంలో వదిలేసి వచ్చామన్నారు, ఏ బాధ లేకుండా. అన్నపూర్ణమ్మ మనసు భారమైంది. మానవత్వం, తల్లిప్రేమ ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. మర్నాడు ఆశ్రమానికి వెళ్లింది. పిల్లలను తీసుకుని, ఆస్పత్రిలో పెద్ద డాక్టర్‌ను కలిసి, వారి ఆపరేషన్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత ఆపరేషన్ మొదలైంది. వరుసగా ఐదు నుంచి ఏడుసార్లు ఆపరేషన్ చేయాలని, అంతవరకు తామే చూసుకుంటామని వారు చెప్పారు. ‘అలాగే’నని వారికి కావలసిన డబ్బును ఒకేసారి జమచేసింది అన్నపూర్ణమ్మ.ఇది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు. పిల్లలను తీసుకెళ్లమని డాక్టర్ ఫోన్ చేయడంతో అన్నపూర్ణమ్మ చూడటానికి వెళ్లింది. అక్కడ తన మనవరాళ్లలాగ ఉన్న చాలామంది నిస్సహాయులైన పిల్లలు కనిపించారు. ఒక నిర్ణయంతో ఆ ఊరికి బయలుదేరింది. ‘అమ్మగారు! మనం ఇక్కడేనా దిగాలి?’ అడిగింది రంగి. ఔనన్నట్లు లేచింది అన్నపూర్ణమ్మ.అందరూ బండి దిగారు. బయట వారికోసం కారు ఆగి ఉంది. అందరూ అందులో బయలుదేరారు. ఒక విశాలమైన పచ్చిక బయలులాంటి మైదానంలో చుట్టూ చెట్టు చేమలతో, పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదభరితంగా ఉన్న ప్రదేశంలో దేవాలయంలాంటి ఇంటి ముందు ఆగింది కారు.అన్నపూర్ణమ్మ రాగానే ‘బామ్మ! బామ్మ!’ అంటూ చేతికర్రల ఊతంతో ఉన్న పిల్లలు, చక్రాల బళ్లలో ఉన్న పిల్లలు ఆమె చుట్టూ చేరారు. వారిలో అన్నపూర్ణమ్మ మనవరాళ్లు కూడా ఉన్నారు. ఆపరేషన్ అయ్యాక పిల్లలు సరిగా నడవలేరు అనే నిజం తెలుసుకున్నాక, అన్నపూర్ణమ్మ అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించింది. వారందరికీ తానే భోజన, వసతి ఖర్చులను భరించింది. తనకు మిగిలిన ఆస్తినంతా ఆశ్రమానికి రాసేసింది. ఆ ఆశ్రమంలోనే ఉంటూ, పిల్లల బాగోగులను చూసుకుంటూ తన శేష జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంది అన్నపూర్ణమ్మ. అక్కడ అడుగుపెడుతూనే, పిల్లలందరూ అన్నపూర్ణమ్మ చుట్టూ చేరడం చూసి, రంగి, ఆమె కొడుకు నాగ ఆమెను దేవతను చూసినట్లుగా తన్మయం పొందారు. అన్నపూర్ణమ్మకు చేదోడు వాదోడుగా ఆ తల్లీకొడుకులు అక్కడే ఉండిపోయారు. అన్నపూర్ణమ్మ తీసుకున్న నిర్ణయం రేపటి తరపు సూర్యోదయం కోసం ఎదురుచూసే మలిసంధ్య. -
యువ కథ: సిల్లు పడ్డ సీర
‘వురెయ్ బామ్మర్ది ఇయ్యాలేటో వొల్లంత పచ్చి పుండు నాగుందిరా’ అప్పుడే నిద్రలేచొస్తూ అన్నాడు ఆదిబాబు. గుమ్మంలో తాపీగా చుట్ట కాల్చుకుంటున్న వీరయ్య ‘ఆ.. నిన్నంతా పనుల్తోటి అలిసిపోయినావు కద బావా. మరామాతరం సలుపులుంటాయినే’ అన్నాడు. ‘ఆ.. అంతేలాగుందిరా బాబూ. ఒలే! బూలచ్చిమి.. బూలచ్చిమీ..’ ఆమె పలికే వరకూ పిలుస్తూనే వున్నాడు ఆదిబాబు. ‘ఆ’ అరిచినట్టే పలికింది భూలక్ష్మి. ‘యేడి నీలెట్టే సానం సేత్తాను’ అని ఒక కేక పెట్టాడు. ‘నానంత కాలీగేటి నేను. నువ్వేల్లెట్టుకో’ లోపల నుంచి విసురుగా సమాధానం వచ్చింది. ‘ఆ.. యేటి దీని తల పొగరూ’అనుకుంటూ పక్కనే వున్న వీరయ్య వైపు చూసి ‘అదేట్రా మీయప్ప తెల్లారికే అలాగరత్తంది. లెగిసాకా కూడా సుసేను.. యేటో సెత్రువుని సూసినట్టు సూసింది. యేతంతావు కారనవు?’ అడిగాడు. వీరయ్య సన్నగా నవ్వుతూ ‘యేటి బావ నిన్న వొచ్చినోలు దెగ్గర యెతేన నాగేవేటి పేకాట్ల’ అని రహస్యంగా అడిగాడు. అడ్డంగా తలాడిస్తూ ‘మీయప్ప వల్ల సుకం నేదు నాకు. ఆగు ఇప్పుడే వత్తాను’ అంటూ లుంగీ ఎత్తి పట్టి నడుముకి చుట్టుకుంటూ పక్కనున్న సందు వైపు నడిచాడు ఆదిబాబు. అక్కడ ప్లాస్టిక్ బకెట్‌లోని నీళ్లని మొహం మీద జల్లుకుని, పుక్కిలించి ఉమ్మి, గూట్లో వున్న వేపపుల్లని నమిలి పిప్పిచేసి వదిలాడు. దండెం మీద తువ్వాలు కోసం వెదుకుతూ ఆ దండెం మీదే ఆరేసున్న చీరని పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు. ‘బావా.. ఇగో తువ్వాలు’ పిల్చాడు వీరయ్య. ఆ పిలుపు వినబడనట్టే ఉండిపోయాడు ఆదిబాబు. అతని బుర్రలో వేల ప్రశ్నలు. ‘యేటలగ కొయ్యలాగ కదలడు’ అనుకుంటూ ఆదిబాబు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య. ‘అలగ వుండిపోనవు యేటైంది బావ’ అడిగాడు. ‘యేటి నేదురా.. ఈ సీరేటి ఇక్కడుందని సూత్తన్ను. ఇది మాయమ్మ సిర.. దీన్ని ఇక్కడెవులు యేసేరూ?’ తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు. వీరి అదో పెద్ద విషయమే కాదన్నట్టు మొహం పెట్టి ‘నిన్నే కదేటి బావా! మీయమ్మ సవస్రికవైంది. యేదో అవస్రానికి తీసుంతారు’ అన్నాడు. ‘ఎంత అవసరం వుంతే మాత్రం పెట్టెలున్న అడుగు సీరే తియ్యల? ఇగో సూడు ఈ సీరకి పెద్ద సిల్లు కూడా పడింది. ఒలే బూలచ్చిమీ.. బూలచ్చిమీ’ భార్యని ఏకధాటిగా పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే వీరయ్య కంగారుగా ‘ఇప్పుడు దాన్నేల పిలత్తన్నవు బావా పల్లకో’ అన్నాడు. ‘మాయమ్మకి ఇట్టవైన సీరరా ఇది. దాని గేపకంగా దాసుకున్నాను. దాన్నిప్పుడు బైటకి నాగే అవసరం యేటొచ్చింది. దానిక్తోడు ఈ సిల్లోటి. ఇంత నిర్లక్సం యేటి దానికి’ అంటూనే కోపం ఆపుకోలేక మళ్ళీ పిలిచాడు ‘ఓలి బూలచ్చిమీ! ఇనబడట్నేదేటే’ ఈసారి అతని కఠం ఖంగుమంది.ఆ అరుపులని ఆదిబాబు గోలని గమనిస్తున్న భూలక్ష్మి నిదానంగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె ఎప్పట్లా లేదనిపించింది అతనికి. బెదురు చూపులకి బదులు తెగింపు ఆమె కళ్ళలో. అలా తనని చూడగానే అడగడానికి లక్ష ప్రశ్నలున్నా వాటన్నింటినీ మర్చిపోయాడు ఆదిబాబు. భూలక్ష్మి కాసేపు అతన్నే తేరిపార చూసి, నిదానంగా అడిగింది ‘యేటి నీ కాకి గోల?’ ఆ మాటకి ఆదిబాబు కోపం నషాలానికెక్కింది.‘ఈ సీర బైటకెలగొచ్చింది?’ భూలక్ష్మి మొఖం చిట్లిస్తూ ‘ఏమో నాకేటి తెలుసు?’ అంది. ‘ఏటే ఆ సమాదానము.. ఈ ఇంట్ల యెంతమంది వున్నారు వచ్చి తీసీడానికి. వున్నదే మనిద్దరం. తీత్తే నువ్వు తియ్యాలి లేదంటే నాను తియ్యాలి. సక్కగ సెప్పు యెలా తీసేవో’‘ఏటి యకసెక్కాల గుందా? నాకు తెలీదని సెప్తున్ను కదా! నిన్న ఇల్లంతా సుట్టాలే! ఎవులు తీసేరో? యానికి తీసేరో?’ అంది. ‘యెంత నిర్లక్సమే నీకు. మాయమ్మ సీర, దానికి ఇట్టవైన సీర.. దాని గేపకార్దం నాను దాసుకుంటే దాన్ని బైటికి నాగిందే కాకంట దానికి సిల్లు కూడ యెట్టారు. ఇది ఎవులు ఎందుకోసం సేసేరో నాకు తెలిసీవరకు నేనొగ్గను’ తెగించినట్టే అన్నాడు ఆదిబాబు.భూలక్ష్మి చీర కొంగును బొడ్డులో దోపుకుంటూ ఇంటి గుమ్మం దాటి బైటకొచ్చింది. ‘యేటేటి.. మల్లి సెప్పు. ఈ సీరంటే నీకిట్టవా.. దీన్ని మీయమ్మ గేపకంగా దాసుకున్నవా.. ఓలమ్మొ ఓలమ్మో నాను ఎంత గుడ్డిదాన్ని.. నా మొగిడి గొప్ప హుదయం సూడలేకపోన్ను. ఎప్పుడూ తాగుబోతు నా కొడుకని తిట్టుకునీదాన్ని గానీ ఇంత గొప్పోడని తెలిత్తే దండేసి దండవెట్టీకపోనా’ అంది నాటకీయంగా చేతులు తిప్పుతూ. ఆమె ఉద్దేశం అర్థమైన ఆదిబాబు ‘నంగనాసిదానా నాటకాలాపే నీయమ్మ.. ఒల్లెలగుందే’ అన్నాడు ఆమె పైపై కెళ్తూ.‘నేకపోతే ఏట్రా సెత్తనాకొడకా... పెపంచకంలో నీదే గొప్ప పేమ అన్నట్టు హెచ్చులు పోతన్నవు. నువ్వడిగేవి దిక్కుమాలిన పెస్నలు. మల్లీ దానికో సమధానం కూడా సెప్పాలా..థూ’ ఆవేశంతో వూగిపోయింది. ‘అవునే సెప్పాలి. నువ్వు మగా ఇల్లాలివని నీ పీలింగ్ కదా.. ఇందల సూపించే నీ ఇల్లాలితనం. ఇంట్ల యేటి జరుగుతందో ఎవరేటి తీస్తన్రో తెలీకుండా బతకతంది.. ఇదొక ఇల్లాలు... దీనికో సపోర్టు’ఆ మాటకి భూలక్ష్మి నవ్వీ ‘పోనీ నానైతే మగా ఇల్లాలిని కానులే. నువ్వయితే గొప్ప ఈరుడివి కదా.. మరి నువ్వు కానుకోలేకపోనవా ఆ సీర ఎవులు తీసేరని. నీకు ఈ సీర మీదున్న ఇట్టానికి అలగ దాని ముందే కూకోలేకపోనవా? దాన్ని నీ బుర్రమీదెట్టుకొని వూరేగలేకపోనవా?’ అంది భూలక్ష్మి. ఆదిబాబుకి రోషం పొడుచుకొచ్చింది. ‘ఒలే నన్ను రెచ్చగొడితే మనిసిని కాను..’ చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ‘నువ్వెలగు మనిసివి కాదన్న ఇసయం నాకు తెలుసులే ఇంక పల్లకో. మీయమ్మ బతికున్నప్పుడు సక్కగ సూసుకోడం సేతగానేదు గనీ ఇప్పుడేదో పేమ కారిపోతన్నట్టు గుండైపోతండు’ అందామె గుమ్మంలో వున్న అరగుపైన కూర్చుంటూ. ‘మగాడి పేమలన్నీ బైటికి అగుపిత్తాయేటే.. మనసులుంటయి గనీ’ ఆమెకు దగ్గరగా వెళ్తూ అన్నాడు ఆదిబాబు. ‘ఆ.. పేమొకటే దాసుకున్నవా.. యేరే రగస్యాలు కుడా దాసినావా ఆ మనసలా’ ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఆదిబాబూ ఆవేశంగా ముందుకు ఊరికాడు. ‘లక్స తొంబై దాసుకుంతానే నీకెందుకు? ముందీ సీర ఇసయం తేల్సు’ అంటూ ఆమె దగ్గరకి వెళ్ళబోతుంటే వీరి అడ్డుపడ్డాడు. ‘యేట్రా నీ గోల. ఆడోలు సీర్లు ఎందుకు తీత్తారు కట్టుకోడానికి తీత్తరు. అదెంత పాత సీరో కట్టుకోబోతే పుసుక్కున సిరిగుంటది. ఇంత సిన్న ఇసియానికా యానికలగ రంకె లేత్తన్నవు’ చిరాకుగా మొఖం పెడుతూ అంది.ఆమె చిరాకు అతడికి ధిక్కారంలా తోచింది. అవమానంతో గుండె భగ్గున మండింది. ఏం మాట్లాడాలో అర్థంకాక మౌనంగా వున్నాడు. కాసేపటి తర్వాత ‘యేవి ఈ ఆడోలికి సీర్లే కరువైపోనాయా. మాయమ్మ సీరే కావల్సొస్సిందా?’ అని అనగలిగాడు. అది కూడా వీరయ్య వైపు చూస్తూ. ‘యేటి రా నాయన. మీ యమ్మ సీరలోనున్న మగత్యవు. ఏటి దాసిస్సేవేటి ఈ సీరల ఇలగ గింజీసికుంతన్నవు’ భూలక్ష్మీ తగ్గలేదు. ఆదిబాబు నీళ్ళు నమిలాడు. అతనేం చెప్తాడా అన్నట్టు ఎదురు చూశాడు వీరయ్య. భూలక్ష్మి భర్తలో మారే రంగులను చూస్తూ ‘యేటాది బాబు.. పలకవు సెప్పు..’ రెట్టించింది.ఆదిబాబు తెగించాడు. ‘యేటి సెప్పాలే. నిజం తెలిసిపోనాక ఇంకేటి సెప్పాలి. నువ్వే ఆ సీర తీసేవ్. యానికో కూడా నాకు తెలుసు’ అని ఆగి, ‘దీనికి ఇసయం తెలుసని అరదమైపోనాది. మరి నేనెలా సెప్పాలి? దాన్నె ఇరకాటంల యెట్టి సెప్పిత్తాను’ అనుకుని, ‘మా యమ్మ మీద కోపంతో నువ్వే ఆ సీర సింపీసినావు. యేరు దాటాక తెప్ప తగలేసే రకవే నువ్వు. అది తెలక ఆ ముసిల్ది నీకు సపోర్టు సేసింది’ కసిగా అన్నాడు. అతను విషయాన్ని ఎలా నరుక్కొస్తున్నాడో అర్థమైంది భూలక్ష్మికి. అతని నోటి నుంచి నిజం రాదని గ్రహించి, తన వ్యూహాన్ని రచించింది. ‘మీయమ్మతో ఏ నాడైన పేమగ మాటాడేవా నువు? అదే సేసుంటే నాకెలా సపోర్టు సేస్తది మీ యమ్మ?’ ‘ఎదో మందెట్టుంటావు’ టక్కున అన్నాడు. ‘ఓలమ్మ నాను మందెట్టీసినానట. ఈలమ్మని పొట్టనెట్టుకుంది ఈడు.. సుట్టు తిరిగి నన్నంతండు’ అంది భూలక్ష్మి అతడి అహాన్ని దెబ్బకొడుతూ. అది చీర విషయంగా రేగిన గొడవలా ఇంకెంతమాత్రం అనిపించలేదు వీరయ్యకి. చుట్టూ జనం గుమిగూడారు. పొద్దున్నే భార్యభర్తల గొడవ భలే రంజుగా వుంది వాళ్ళకి. మాటలు కరువైన ఆదిబాబు ‘ఇదో బూలచ్చిమి.. పోన్లే కదని వూరుకంటంటే పెట్రేగిపోతనవు. మాయమ్మని నేను పొట్టనెట్టుకోడవేటే?’ అన్నాడు. ‘సిక్కింది సేప’ అనుకుంది భూలక్ష్మి. ‘నేనండవేటి వూరు వూరే అంతంతే.. కాలంటే ఇలందరి నుండి సాచ్చకం తీసుకొత్తాను’ అంది. ‘నీ సాచ్చకాలేటి నాకక్కర్నేదు. అది నా తల్లే. నేనేటైన సేసుకుంతాను నా ఇట్టం. నీకేటి మజ్జిల’ ఆవేశంతో అతని గొంతు వణికింది. ‘ఇంత తెగించీసినోడివి మరి నీకేల ఈ సీర ఇసయం. అది సిరిగిపోతే నీకేవి అరిగిపోతే నీకేవి’ మళ్ళీ తిరిగి విషయాన్ని అక్కడికే తీసుకొచ్చింది భూలక్ష్మి. ‘నీయమ్మ ఎంత పొగరే నీకు’ అంటూ పైపై కొచ్చాడు ఆదిబాబు. ‘యేటి కొడతావా? కొట్టు. నువ్వేనేటి నేనూ సెయ్యగలనా పని’ అంటూ భూలక్ష్మి ఓ మూలనున్న రోకలి తీసుకొని వచ్చింది. అదంతా చూస్తున్న వీరయ్య కంగారుగా వాళ్ళ మధ్యలో దూరి ‘సుకంగుండడం సేతకాదేటి మీకు? సిన్న సీరముక్క కోసం గొడవలు పడుతన్రు’ అన్నాడు. ఆదిబాబు కోపంతో బుసలు కొడుతున్నాడు. ‘ఇసయం సీర కాదురా ఈరీ.. ఆడి గొడవ సీర కోసం అంతకన్నా కాదు. ఆ సీరలో దాసిపెట్టిన ఆత్తి పత్రాలేవి అని అడగలేక ఈ బాద’ అంది భూలక్ష్మి. అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఏటవుతుంది బావా ఇక్కడా.. ఆత్తి పత్రాలేటి దాన్ని దాసిపెడ్డం యేటి.. ఈ గోలేటి?’ అడిగాడు వీరి. దానికి సమాధానం ఎం చెప్పాలో తెలియక ఉక్రోషం ఆపుకోలేక భూలక్ష్మిని కొట్టడానికి వురికాడు ఆదిబాబు. ‘ఇద ఈ పాపిట్టిదాన్వల్లే నా బతుకిలగ అయ్యింది. నా ఆత్తి మీద నాకు అక్కు లేకుండ సేస్సేవు కదే దొంగ ముండా’ అంటూ ఆమె చెంపల మీద ఆపకుండా కొట్టాడు. చుట్టూ వున్న వాళ్ళు బలవంతంగా అతన్ని వెనక్కి లాగి ఆమె దగ్గరకు వెళ్ళకుండా శక్తి కొలది పట్టుకున్నారు. భూలక్ష్మి వాచిన చెంపలను తడుముకోకుండా రేగిన జుట్టును సర్దుకోకుండా అలాగే ఆదిబాబును చూస్తూ వుంది. ‘అప్ప ఇద.. ఈ నీలు తాగు’ అని నీళ్ళందించాడు వీరయ్య. వెంటనే అతడి చేతిలో వున్న గ్లాసుని విసురుగా తీసుకొని బలంగా నేలకేసి కొట్టింది. ‘నా మీద నీ పెతాపం సుపిత్తే యేడుసుకొని మూల కూకున్న రోజులు పోనాయి. నువ్వేటో వూడబొడుత్తవని లక్సలు పోసి కట్టబెట్టారు మాయమ్మోల్లు. నువ్వా పైసాకి పనికి రానోడివి. నా కట్టం తిని నన్నే తన్నెవోడివి. మీయమ్మ సచ్చిపోయాక కనీసం దాని సావుకి కారనం కూడ అడక్కండా డవిరెక్టుగ ఆత్తి ఇవరాలు అడిగినోడివి. తూ నీ బతుకు! ఇదో అందరినండి. యేదో ఆలమ్మ మీద పేమ కారిపోతున్నట్టు అంతెత్తున ఎగిరి పడతన్డు గనీ ఆయమ్మ బతికున్నపుడు ఒక్కరోజు కూడా ఈడు పేమగా సూసింది లేదు. దాని ఆస్పెత్రి కర్సులకి దాసుకున్న డబ్బులు కూడా తీస్కెలి తాగిన తాగుబోతోడీడు. దాని శవం కాడికి కూడ తాగేసొచ్చిన యదవ. ఇంత కాత్ర లేనోడికి ఆయమ్మ ఆత్తెలా రాత్తది? అందికే పోయే ముందే పెద్దోల్నెట్టి ఆయమ్మ కూతురు పేర్న నా పేర్న దానికున్నదంతా ఇచ్చీమని యీలునామా రాయింసింది. ఆ యీలునామాని సింపిసినాడీ బాడుకోవు. ఇప్పుడీ ఆత్తి పత్రాలు దాసీసి ఆత్తికి అక్కుదారుడైపోదమని ఈడి ఆలోసన. ఆడముండలం మాకు ఆత్తంత వచ్చీసినాదని ఈడీ యేడుపు. ఇప్పుడు సెప్పండర్రా ఆ పత్రాలని ఈడికి తెలకుండా తీసీడం తప్పా’ అంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది భూలక్ష్మి. ఎటు పోయి ఎటొస్తుందోనని జనం మెల్లగా జారుకున్నారు. వీరయ్య ఆ మొగుడూ పెళ్లాలను చూస్తూ నిలుచున్నాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతుండగా ఆదిబాబు ‘మీకు సాచ్చకాలే లేవు. సింపీసిన ఈలునామ వొట్టుకొని యే కోరుటుకెల్తారు. ఒకేల యెల్లినా గెలిసేది నాయవేనే. అది నా కాడుంది గుర్తెట్టుకో’ అన్నాడు. ‘ఏటా నాయం.. తాగీసొచ్చి ఒల్లు పై తెలీకండా తల్లిని, ఆలిని సితకబాదడవా? ఆడోల కట్టం మీద తిని తొంగోడవా?’ సూటిగా చూస్తూ అడిగింది భూలక్ష్మి.‘ఇయ్యనిటి కన్న పెద్ద అర్గత.. నాను మగాడ్నవ్వడవేనే..’ ఆదిబాబు స్వరంలో గర్వం. అతడి వైపు అసహ్యంగా చూసి ‘తూ! మగాడివైపోతేటిరా ఆరతట్టాలా? నువ్వు మాలాటి మడిసివే గుర్తెట్టుకో. అయినా పుట్టకలో మగాడివైపోతే సరిపొద్దేటి. గునంలో నవ్వక్కర్నేదా?’ అందామె. బుసలు కొడుతూ ఆదిబాబు జారిపోతున్న లుంగీని బిగించి కట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. ఏ అఘాయిత్యం చేస్తాడోనన్న భయంతో వీరయ్య అక్క దగ్గరకొచ్చి ‘ఓలే బావా యెలిపోతున్నాడే’ అన్నాడు కంగారుగా. ‘యెల్లని ఆడేటి సెయ్యినేడు.. తాగి తొంగుంటే ఆడి ముడ్డి, మూతి కడిగి పెతిరోజు జెబ్బలరిగిపోయినట్టు పనిసేసేది నానైతే యేటి సెయ్యనోడికి ఆత్తేటి. మల్లి ఇదే నాయవని ఆడు ఇర్రీగడవేటి. ఆడాలికి ఆత్తి ఎందుకొద్దు. అది ఆల్ల అక్కు కాదా? అక్కులు ఎవరియ్యరట. మావే పోరాడి లాక్కోలట. ఇప్పుడు అదే కదా సేశాను. ఇక పైన కూడ అదే సెయ్యాలి. సేత్తను..’ అంది భూలక్ష్మి స్థిరంగా. వింటున్న వీరయ్యకి ఏదో సత్యం బోధపడ్డట్టు కళ్ళు విశాలమయ్యాయి. -
యువ కథ: చందమామ రావే!
రోజులాగే ఆ రోజూ సెల్లో అలారం మోగింది, కాకపోతే గంట ముందుగా. ఠక్కున లేచి అలారం ఆఫ్ చేశాడు అనంత మూర్తి. ‘అప్పుడే తెల్లారిందా’ మెల్లగా కళ్ళు తెరవకుండానే అడిగింది భార్య నీరసంగా.‘ఈరోజు త్వరగా వెళ్లాలని చెప్పానుగా. రాత్రి టెంపరేచర్ ఏమీ లేదుగా నీకు’ అడిగాడు.‘ఊహూ’తాకి చూడాలనిపించింది. కాని టైమ్ లేదు. లైట్ వేసి ముందురోజే తీసి వుంచుకున్న టవల్, షేవింగ్ కిట్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్ళాడు. ఇంకా పేపర్ కూడా రాలేదు. ముందు రోజు సండే బుక్ తీసుకుని తిరగేస్తూ కూర్చున్నాడు. ‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితం వచ్చే రోజు. వెళ్ళగానే ఆఫీస్ మొత్తం ఒక రౌండ్ వేయాలి. ఆ మహీధర్ని నమ్మలేం. ఏదీ సక్రమంగా చేయడు. ఎంట్రన్స్‌లో కుండీలన్నీ సరిగ్గా పెట్టించాడో లేదో. అసలే మబ్బు గాడు’ మనసులోనే అనుకుంటున్నాడు. చూపు పుస్తకం మీద ఉందే కానీ ఆలోచనలు మొత్తం ఆఫీస్‌లోనే ఉన్నాయి. టైమ్ అయిపోతోంది ఇంక లాభం లేదు అనుకుని కడుపు ఖాళీ అవ్వకపోయినా లేచి స్నానం ముగించుకుని బయటికి వచ్చాడు. అనంతమూర్తి మొదటి నుండి పని రాక్షసుడే. తన నిరంతర కృషే ఈరోజు తనకి జనరల్ మేనేజర్‌గా గుర్తింపు తెచ్చిందని పూర్తిగా నమ్ముతాడు. అందుకే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు దాని పూర్తి బాధ్యత మూర్తి చేతిలో పెట్టింది కంపెనీ. ఈరోజు అది అన్ని బ్రాంచీల్లో కెల్లా అతి తక్కువ కాలంలో ఉన్నతమైన ఫలితాలను సాధించింది. తనని అభినందించడానికి సాక్షాత్తు కంపెనీ íసీఈవో రాబోతున్నారు.డ్రైవాష్ నుండి తెప్పించుకున్న సూట్‌కి ఉన్న ట్యాగ్ కట్ చేస్తూ భార్యకి చెప్తున్నాడు– ‘సాయంత్రం నాకు రావడానికి లేట్ అవ్వచ్చు, ఆఫీస్ వాళ్ళతో బయటకి వెళ్తాను. డిన్నర్‌కి రాను. నువ్ మందులేసుకుని పడుకో. రఘు, సుమ లేచాక చెప్పు రేపు వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తా అని!’ కార్ తీసుకుని ఆఫీస్ బ్యాగ్‌తో బయటకువెళ్తుంటే ఎదురైంది సుభద్ర.. ‘అమ్మగారు లేచారాండయ్య? జ్వరం తగ్గిందా?’‘ఆ..!’ అంటూ గడియారంలో టైమ్ చూసుకుంటూ కార్ ఎక్కి ఆఫీస్‌కి బయల్దేరాడు. దారిలోనే మహీధర్కి కాల్ చేశాడు. పూర్తిగా రింగ్ అయినా ఫోన్ ఎత్తలేదు. ‘ఇంత నిర్లక్ష్యం ఏంటో ఈ యువతకి. వీళ్ళు ఎలా పైకి వస్తారు. ఐదు రోజుల కష్టాన్ని రెండు రోజుల్లో తగలేస్తారు’ అనుకుంటూ అభిరామ్‌కి డయల్ చేశాడు. ‘హాలో.. ఆయన స్నానం చేస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన విషయమాండి?’ అభిరామ్ భార్య ‘20 మినిట్స్‌లో ఆఫీస్‌లో ఉండాలని చెప్పండి’‘ఒక్కరిక్కూడా శ్రద్ధ లేదు. వాళ్ళ వయసులో నేను ఎంత పోటీ పడేవాడ్నో, ఏదో ఒక అవకాశం దొరకక పోతుందా ప్రూవ్ చేసుకోడానికని..’ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఆఫీస్ చేరుకున్నాడు. మూర్తి లోపలికి వెళ్తుండగానే అటెండర్ రవి రావడం చూసి కొత్తగా తెప్పించిన కుండీలను ఎక్కడెక్కడ పెట్టాలో స్వయంగా చూపించాడు. అవన్నీ కూడా హరిశ్చంద్రగారు ఖాళీ సమయాల్లో గార్డెనింగ్ చేస్తానని ఇంటర్వ్యూలో చెప్పడం వల్లే.. విజిట్ గురించి తెలిశాక అప్పటికప్పుడు ఆర్డర్ చేసి రకరకాల బోన్సాయ్ మొక్కలు తెప్పించాడు. కార్పెట్ క్లీనింగ్ సరిగ్గా చేశారా లేదా అని చెక్ చేశాడు. కారిడార్ మొత్తం తిరిగి అన్ని విండోస్ ఓపెన్ చేసి చూశాడు. ఇంతలో అభిరామ్, మహీధర్ వచ్చారు. ‘పాత ఫైల్స్ అన్నీ సెపరేట్ షెల్ఫ్‌లోకి షిఫ్ట్ చేయించావా?’ ‘లాస్ట్ వర్కింగ్ డేనే చేశాం సర్’ మహీధర్ వెనకే నడుస్తూ చెప్పాడు. ‘అప్ కమింగ్ ప్రాజెక్ట్ డీటేల్స్?’ ‘డేటా రెడీగా ఉంది సర్’ అభిరామ్ వైపు ప్రశ్నార్థకంగా చూసి తలాడిస్తూ చెప్పాడు మహీ. స్టాఫ్ అందరూ ఒక్కొక్కరూ రావడం గమనించి మూర్తి వారినుద్దేశించి చెప్పసాగాడు. ‘ఈరోజు మనకు ముఖ్యమైన రోజు. ఇంత వరకు మీరందరూ నాకు సహకరించినందుకు ఫలితం కొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం’మాటల మధ్యలో అభిరామ్ ఫోన్లో మాట్లాడుతూ బయటకి లోపలికి తిరుగుతూనే ఉన్నాడు. అది కనిపెట్టిన మహీధర్ ‘అభి, ఎందుకలా తిరుగుతున్నావ్, ఎవరి కోసం చూస్తున్నావ్?’ అడిగాడు. ‘ఈ రవిగాడు అనుకున్నంత పని చేశాడు’‘రవి బొకే తేవడానికి వెళ్ళాడుగా?’‘ఔను, అలాగే ప్లంబర్ని కూడా తీసుకు రమ్మని నేనే పంపాను’‘వార్నీ, నువ్వింకా ఆ ట్యాప్ ఫిక్స్ చేయించలేదా.. బాస్ ఇంకా చెక్ చేయాల్సింది వాష్‌రూమ్స్ మాత్రమే. ఆయన కంట పడిందో.. చిన్న పని కూడా చేతకాదు అని నెలంతా వాయించేస్తాడు. అయినా నీకు చెప్పాను చూడూ’ మహీధర్ తలపట్టుకున్నాడు. ‘నేను ఆరోజే రవికి చెప్పాను. వాడు చిన్న పనే అయిపోతుంది అన్నాడు. ఇందాకే నాతో చెప్పాడు ప్లంబర్ రాలేదని, ఏదేమైనా 10 నిమిషాల్లో తీసుకొస్తా అన్నాడు. అదే ఫోన్ చేస్తున్నా, తీయట్లేదు’ ఏం చేయాలో తెలీక నీళ్లు నములుతూ చెప్పాడు అభి.రవి వెళ్లి అరగంట దాటింది. టైమ్ 10 అయింది. సీఈవో గారు ఎప్పుడైనా రావచ్చు, ఇంకా ఈ ట్యాప్ ఫిక్సింగ్ ఇప్పుడు కాదు అనుకుని అభిరామ్.. మహీధర్ దగ్గరకి వచ్చి అదే చెప్పాడు. ‘నీకేం? నువ్ ఎన్నైనా చెప్తావ్, బాస్ చెప్పింది నీకు కాదు కదా. అసలు ఆరోజే నేను ఆ పని అయ్యాక వెళ్లాల్సింది. ఫ్రైడే ఈవెనింగ్ అని నీ హెల్ప్ అడిగాను చూడూ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి’ కోపంగా మహీ లోపలికెళ్లి నెమ్మదిగా స్టాఫ్ వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు.ఫ్రైడే రోజు–‘నేను మీ కంటికి పిచ్చి వెధవలా కనిపిస్తున్నానా?’ సడన్‌గా ఫ్లోర్ మీద ప్రత్యక్షమయ్యాడు మూర్తి. అప్పటి వరకూ గుసగుసగా మాట్లాడుకుంటున్న స్టాఫ్ మొత్తం ఆగి ఎవరికి మూడిందా అని చూస్తున్నారు.. ఫ్లోర్ మొత్తం గుండు సూది పడినా వినిపించేంత సైలెంట్‌గా ఉంది. ‘టప్..!’ ఒక శబ్దం ‘ఏదో ఒకటి పెరికేసి నా మొఖాన కొడితే తప్పులన్నీ వెతికి పట్టుకునే డ్యూటీ నేను చేయాలా?’ పూనకం వచ్చినట్టు ఊగి పోతున్నాడు మూర్తి మహీధర్ మీద. మహీధర్ టీమ్‌లోని సంజన రాసిన ప్రోగ్రామ్‌లో మిస్టేక్స్ రిపీట్ ఔతున్నాయి. ఆడపిల్లలను మందలించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ముందే వాళ్ళ టీమ్ లీడ్ మీద విరుచుకుపడటం మూర్తికి అలవాటే! ‘టప్! టప్!’ ‘ఏంటా శబ్దం?’ పక్కనే ఉన్న స్టాఫ్ వాష్‌రూమ్ వైపు అసహనంగా చూస్తూ అడిగాడు మూర్తి. వెంటనే తేరుకుని ‘వాష్‌రూమ్ నుండే వస్తున్నట్టుంది సర్’ మహీ నెమ్మదిగా చెప్పాడు. మూర్తి ఏదో అందుకునే లోపే ‘టప్..!’ మళ్లీ వచ్చింది. ‘అదేంటో చూడు..’ ఆదేశించాడు మూర్తి. వాష్ బేసిన్ అవుట్ లెట్ నుండి ఒక్కో చుక్క కారి సరిగ్గా కింద వాటర్ పోవడానికి ఉండే మెటల్ ప్లేట్ మీద పడుతున్నాయి. మెటల్ ప్లేట్ కింద ఖాళీ ఉండటం చేతనేమో ఆ శబ్దం స్పష్టంగా వినబడుతోంది. ‘వాటర్ లీక్ ఔతుంది సర్’ డోర్ తీసి మెల్లగా చెప్పాడు మహీధర్. అది చూస్తున్న మూర్తి ఇంకా ఏం మాట్లాడకముందే ‘రవికి చెప్పి క్లియర్ చేయిస్తాను సర్’ అన్నాడు మహీధర్. ఈ రకంగా అయినా ప్రోగ్రామింగ్ విషయం వదిలేస్తాడన్న ఆశతో. మూర్తి సూటిగా మహీధర్ కళ్ళలోకి చూసి, ‘ఒక్క చుక్కే కదా అని వదిలేస్తే నాలుగు రోజుల్లో ట్యాంక్ ఖాళీ ఔతుంది. చిన్న తప్పైనా వెంటనే కట్టడి చేయాలి’ అని సంజన గురించి కూడా మందలించినట్టు చెప్పి వెళ్ళిపోయాడు. ‘హమ్మయ్య.. ఈవాళ్టికి గండం గడిచింది’ అని మనసులోనే అనుకుంటూ సంజనకి వివరంగా చెప్పాడు. అటెండర్ రవి ఆరోజు కొన్ని అరెంజ్మెంట్స్కి బయటికి వెళ్లడంతో వచ్చాక ట్యాప్ విషయం చెప్పమని అభిరామ్‌కి చెప్పి వీకెండ్ పార్టీ ఉందని ఆఫీస్ టైమ్ అవ్వకముందే బాస్ వెళ్ళగానే బయల్దేరాడు మహీధర్. ఈరోజు– మూర్తి స్టాఫ్ అందరినీ ఎవరి పనులు వాళ్ళని చూసుకోమని మహీని మాత్రం తన రూమ్‌కి పిలిచాడు. వాష్‌రూమ్ వైపు చూస్తూ మూర్తి వెనకాలే నడుస్తున్నాడు. శబ్దం అయితే రావట్లేదు. ‘బహుశా నిన్నంతా సండే.. ఎవరూ వాడకపోవడం వలన వాటర్ లీక్ అవడం లేదేమో. ఏదైతే ఏం ఈ ఒక్క రోజూ గడిస్తే చాలు’ అనుకున్నాడు.సీఈవోగారు ఒప్పుకుంటే లంచ్‌కి తీసుకెళ్లడానికి ఎక్కడ బావుంటుందో చూడమని అడిగాడు మూర్తి. టార్గెట్ ప్రమోషన్. జోనల్ వైజ్‌గా బ్రాంచెస్ టేక్ కేర్ చేయాలని. అది చెప్పడానికే సీఈవో డైరెక్ట్‌గా వస్తున్నారని మూర్తి ఎక్స్పెక్టేషన్. తను అనుకున్నదే జరిగితే సాయంత్రం స్టాఫ్ అందరికీ డిన్నర్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకు ఒక ప్లేస్ కూడా సెలెక్ట్ చేయమన్నాడు. ఈలోగా ప్లంబర్‌ను వెంటపెట్టుకొచ్చిన రవిని అభి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సైలెంట్‌గా వాష్‌రూమ్‌లోకి పంపించాడు. ప్లంబర్‌కి అక్కడ ఏం చేయాలో చూపించి.. బయటికి చప్పుడు రాకుండా త్వరగా చేయమని, తను చెప్పేవరకూ బయటికి రావద్దని జాగ్రత్తలు చెప్పి, బొకేలు ఇవ్వడానికి బాస్ రూమ్‌కి వెళ్ళాడు రవి. అతను వెళ్లేసరికి ఫోన్లో మాట్లాడుతున్నాడు మూర్తి. ఫోన్ పెట్టేసి, బొకే టేబుల్ మీద పెడుతున్న రవికి చెప్తున్నాడు– ‘అవసరంలేదు బయటకే తీసుకురా. సర్, ఆల్రెడీ ఆన్ ద వే. ప్రయర్గా ఫినిష్ చేసుకుని వెళ్లాలని ముందే బయల్దేరారట. ఎనీ మినిట్ రీచ్ ఔతారు. నువ్వెళ్ళి మన స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చెయ్. మహీ, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీతింగ్’ అంటూ రవితో పాటే బయటికి నడిచారు ఇద్దరూ. రవికి ఏం చేయాలో తెలీలేదు. అభి వంక బేలగా చూస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. నోరు తెరుద్దామనుకున్న అభి, వెనకే వస్తున్న మూర్తి, మహీధర్‌లను చూసి ఆగిపోయాడు. మూర్తి.. అభిని పిలిచి రిసీవ్ చేసుకోడానికి కొంతమంది స్టాఫ్‌తో బయటే ఉండమన్నాడు. చేసేదిలేక బయటికి నడిచాడు అభి. సీఈవో హరిశ్చంద్ర గారు వచ్చేశారు. కార్ దిగడంతోనే అందరూ దండలూ బొకేలతో విష్ చేసి లోపలికి తీసుకొచ్చారు. ప్రమిసెస్ చాలా బావుందని మెచ్చుకున్నారు. అందరూ ఆ క్రెడిట్ మూర్తిగారిదే అని ముక్తకంఠంతో చెప్పారు. మూర్తి చాలా పొంగిపోయాడు. సీఈవో ఒక్కొక్కరిని పలకరిస్తూ అభినందించారు. ఆ సంవత్సరం సంస్థ సాధించిన విజయాలు గర్వంగా చెప్తూ అందులో అధిక భాగం మీకే చెందుతుందని ఎంప్లాయీ‹స్ని ఉద్దేశించి చాలాసేపు మాట్లాడారు. అందరికీ బోనస్‌లు ప్రకటించారు. ‘అతితక్కువ కాలంలో మంచి ఫలితాలు తెచ్చినందుకు మీ అందరి కృషిని స్వయంగా అభినందించాలని వచ్చాను. ఈ విజయం వెనుక ఉన్న విజనరీ మైండ్ మూర్తి గారిని’ అని ముగించేలోపు ‘కెవ్వ్’ అనే కేక ఒకటి అప్పుడే వినిపించి అందరూ అవాక్కయ్యారు. అది వాష్‌రూమ్ నుండి వచ్చిందని తెలిసి రవి, అభి తర్వాత మహీ గతుక్కుమన్నారు. మూర్తికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో విందామనుకుంటే ఇంకేదో వినాల్సివచ్చింది. వాష్‌రూమ్ నుండి బయటకొచ్చిన స్టాఫ్ మెంబర్ అనురాధ ఏడ్వలేక నవ్వుతూ ‘సారీ సర్.. సడన్‌గా లోపల మనిషిని చూసేసరికి’‘మనిషా, ఎవరు?’ హరిశ్చంద్రగారే అడిగారు. భయపడేంతగా ఎవర్ని చూసి ఉంటుందా అని మూర్తి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అభిరామ్‌కి విషయం అర్థమై ఏం జరగబోతోందో ఊహించలేకపోతున్నాడు. ఒకచేతిలో పెద్ద ఇనుప రెంచితో మరోచేతిలో నల్లటి బ్యాగ్‌తో సన్నగా ఉన్న ఒక మనిషి బయటకొచ్చాడు. చిన్న చెక్స్ ఉన్న వైట్ హాఫ్ హ్యాండ్స్ షర్ట్, కాస్త పొట్టి ప్యాంట్‌తో మనిషి నీట్‌గానే ఉన్నాడు. ‘ఎవరు నువ్వు.. లోపలేం చేస్తున్నావ్?’ సూటిగా అతన్నే చూస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. మూర్తికి సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు పడినట్టు అయింది. సమాధానం చెప్తే తెలుసుకుందామని మూర్తి కూడా ఎదురు చూస్తున్నాడు. ‘నా పేరు రాజు, ట్యాప్ రిపేర్ చేయనీకి ఒచ్చిన సార్‘‘రిపేర్ అయిందా?’‘అయింది సార్’‘ఎంతసేపటి నుండి చేస్తున్నావ్?’‘రొండు గంటలైంది’‘వాట్?’‘అది మొదటి 20 నిమిషాల్లోనే అయిపోయింది సార్’‘మరి లోపల ఎందుకున్నావ్ ?’రవి వంక చూసి మౌనంగా ఉండిపోయాడు రాజు. ‘రవీ, ఏంటిదంతా?’ మూర్తి కలగచేకున్నాడు. ‘సారీ సర్.. మీకు తెలియకుండా చేయించాలనుకోడం నా తప్పే’ రవి.. మూర్తికి దణ్ణంపెట్టి హరిశ్చంద్ర గారికి వివరించడం మొదలెట్టాడు. ‘సర్, నేను ఈపని శనివారమే చేయించాల్సింది. ఆరోజు నుండి ఎవరూ దొరక్కపోవడంతో నా స్నేహితుడ్ని బతిమాలి తీసుకొచ్చే సరికి ఉదయం లేట్ అయ్యింది. విషయం తెలిస్తే జీఎం సర్ కోప్పడతారని తెలియకుండా చేపించాలనుకున్నాను. ఇంతలో..’‘అంటే ఇతను ప్లంబర్ కాదా?’ ‘ఔనని చెప్పలేం సర్, కానీ ఇతనికి ప్లంబింగ్ పని బాగానే వచ్చు. ఇతను ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులూ చేస్తుంటాడు సర్. ఒక ఆటో ఉంది. కానీ రోజూ తిప్పడు. ఇలాగే చిన్న చిన్న రిపేర్లు, కరెంటు పని మెకానిక్ పని అన్నీ వచ్చు’‘ఓహో! అల్రౌండర్ అన్నమాట. కానీ అరగంటలో అయ్యే పనికి రెండు గంటలు ఎందుకు లోపలే ఉన్నావ్?’ రాజునే గమనిస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. ‘ఈ సారు కంగారుగా నాకాడికొచ్చి చిన్న పనుందని వెంటపెట్టుకుని వచ్చే. ఏదో అవసరం మీద వచ్చిన. నావల్ల ఏ ఇబ్బంది అయినా ఆయన పని పాడు చేసినటై్టతదని లోపల్నే ఉన్న.’ ‘నువ్వేమో ఫ్రెండ్ అంటున్నావ్, అతను సారంటున్నాడు?’ రవిని ప్రశ్నించారు హరిశ్చంద్ర గారు. ‘సర్’ ఎలా చెప్పాలా అని మౌనంగానే ఉన్నాడు రవి. ‘ఇంకేదైనా దాస్తున్నారా మీ ఇద్దరూ కలిసి?’ అని హరిశ్చంద్ర అడగడంతో రవికి చెమటలు పట్టేశాయి. మూర్తికి చాలా ఇబ్బందిగా అనిపించింది. తన ముందే సీఈవో తన అటెండర్ని ప్రశ్నించడం ఒక ఫెయిల్యూర్‌లా ఫీలయ్యాడు. ‘అయ్యో సర్, ఇంతవరకు ఎలాంటి తప్పు జరగలేదు సర్. జీఎంగారు ఏ విషయంలో అయినా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు’ అని రాజుతో పరిచయం నుండి చెప్పడం మొదలుపెట్టాడు రవి. ‘నిజానికి ఇతన్ని నేను ఎప్పటి నుండో చూస్తున్నాను కానీ ఈరోజే కలిశాను. పోయిన వారం వినాయక నిమజ్జనానికి మా వీధిలో డాన్స్ వేస్తుంటే చూశా. ఆ రోజే మాట్లాడాలనుకున్నా కానీ హడావిడిలో కుదరలేదు. మళ్ళా ఒకరోజు తెల్లవారు ఝామున మా అత్తమ్మోళ్లని బస్టాండ్ నుండి తీస్కొస్తుంటే కాలవొడ్డు దగ్గర చిన్న పార్క్‌లో నలుగురు పిల్లలతో కలిసి యోగా చేస్తూ కనిపించాడు. ఆరోజు గుర్తు పట్టా. చిన్న పనికి ఆదివారం ఎవరూ రావట్లేదని నిన్నంతా ఫోన్లు చేస్తుంటే విని మా చంటోడు చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి పంపులు బిగించడం వచ్చు అని. ఈరోజు వేరే దారిలేక అనుమానంగానే ఇల్లు వెతుక్కుని వెళ్లాను. అడగ్గానే నాతో వచ్చాడు’మూర్తికి ఇదంతా అనవసరంగా తోచినా అనుమానించాల్సిన అవసరంలేదని మాత్రం ఇద్దరికీ స్పష్టమైంది. హరిశ్చంద్రగారికి రాజు ఓపిక నచ్చింది. ఇన్ని పనులొచ్చినా ఏ పనిలోనూ ఎందుకు కుదరలేదో తెలుసుకోవాలనిపించింది. ‘నువ్వు యోగా టీచరా?’ రాజునే అడిగారు హరిశ్చంద్ర గారు. ‘కాదు సార్. ఆయన చూసిన నలుగురు నా పిల్లలే. దాదాపు ప్రతిరోజూ పొద్దున్నే నా భార్యతో పార్క్‌కి పోయి కాసేపు ఆసనాలు ఏసి ఎండకి తిరిగి ఇంటికొస్తాము. అందుకే ఆటో కొన్నాను. మేం ఎక్కడికైనా అందులోనే ఎల్లేది. ఎప్పుడైనా పని లేకుంటే నాలుగు రౌండ్లు వేసొస్తా’‘ఈ రోజుల్లో నలుగురు పిల్లలను పెంచడం భారం అనిపించలేదా?’‘అదేంది సర్.. నేను పెంచేడిదేముంది? ప్రకృతిలో పుట్టింది ఏదైనా పెరిగేటిదే కదా. వాళ్ళకి ఇంతబుద్ధి నియ్యాలె. ఇంత ముద్ద పెట్టాలె. ఆకాడికి ఐతే కష్టం చేయగలను. నా ఇంటిది పోరు పెట్టేటిది కాదు. మా ఇంట్లనే కాయకూరలు కుండీల్లో పాదు పెట్టింది. మేం తినగా పక్కనోళ్లు కొంచపోయి తోచింది ఇస్తరు. పైసా పైసా దాపెట్టి అపదకొస్తదంటది. నా పెద్ద కూతురు పలుకు బంగారం. ఈ ఏడు ఆరో తరగతికొచ్చింది. హనుమంతుడి గుళ్లో శ్లోకాలు పాడతది. ఆడికొచ్చే ఒక ముసలావిడ గొంతు కలిపింది. ఇప్పుడు ఆమెతోని తోల్కపోయి స్టేజీల మీద పాడిస్తది. మన ప్రయత్నం సుబ్రంగుంటే దారి కూడా సుగమంగుంటది కదా సార్’ చెప్తూనే వాళ్ళమ్మాయి గొంతు విన్నట్టు మైమరచి పోతున్నాడు రాజు. హరిశ్చంద్రతో పాటు మూర్తి, మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ప్రశాంతంగా వింటున్నారు. ‘మీ ఆవిడ సరే, మీ పిల్లలైనా అది కావాలి ఇది కావాలి అని అడుగుతారుగా?’ గురువు దగ్గర హితబోధ కోసం ఎదురుచూస్తున్నట్టు అడిగారు హరిశ్చంద్ర గారు. ‘అడుగుతారు సార్. చిన్నప్పుడు చందమామ కావాలని అడుగుతాము. అలాగని అడిగినోళ్ళని కొడతామా.. చందమామని కొంటామా! గిది అంతే. మొన్న మూడోవాడు పెద్ద టీవీ కావాలనీ, రోజూ ఎన్నో సినిమాలు చూడొచ్చని అడిగిండు. వాని కోరిక సమంగాదని ఎట్లా తెలియాలె. మర్నాడే బడి నుంచి వచ్చినాక ఆరుగురిమి శ్రీనివాస థియేటర్‌కి పోయి మహేష్ బాబు సినిమా చూపిచ్చి ఇంటర్వెల్లో అందరం కేకులు తిని మస్తు ఖుషీ అయి వచ్చినం. ఆ రేత్తిరి నా కొడుకును అడిగిన.. ఎట్లుంది నాయిన సినిమా? అని. ‘చానా బాగుంది నానోయ్.. మస్తుగుంది అన్నడు. నేనన్నా ‘మరి ఇంట్లో టీవీ కొని రోజూ చూస్తే ఆ మజా వస్తదా? నువ్ రోజూ బడి నించి వచ్చినాక చెల్లితోని ఆడుకోవాలే.. లెక్కలూ, పాఠాలు చదవాలే.. అమ్మతోని కథలు చెప్పించుకుంటా బువ్వ తినాలే.. డాబా మీద చుక్కలు చూస్తా పండుకోవాలే. మల్ల మనందరం థియేటర్‌కి పోయి సినిమా జూడాలే.. అని.’ అందరూ అప్రయత్నంగా చప్పట్లు కొట్టారు అభి, మహీతో సహా. హరిశ్చంద్ర గట్టిగా నవ్వుకున్నారు. మూర్తీ నవ్వక తప్పలేదు. అందర్నీ చూస్తూ రాజూ నవ్వడం మొదలుపెట్టాడు. హరిశ్చంద్రకి తన ప్రశ్నకి జవాబు దొరికిందనిపించింది. స్టాఫ్ అందరికీ సీఈవో స్పీచ్ కంటే రాజు స్పీచ్ బావుందనిపించింది. మూర్తికి ఎక్కడో కలుక్కుమనింది. గత వారం రోజులుగా జ్వరంతో నీరసపడిన భార్య, ఐదు నిమిషాలు కూడా తనతో నవ్వుతూ మాట్లాడలేని పిల్లలు జ్ఞాపకమొచ్చారు. ఆరోజు రాజుని కలవడం తనకెంతో ఆనందంగా ఉందని, తనని తీసుకొచ్చిన రవికి థాంక్స్ చెప్పి, ఆ అవకాశం మూర్తి వల్లనే వచ్చిందని అభినందించారు హరిశ్చంద్ర. మూర్తి ప్రమోషన్ గురించి చెప్పి, ఆయనే అందరినీ లంచ్‌కి తీసుకెళ్లాడు రాజుతో సహా! రాజు జీవితంలోనూ ఏదో ప్రమోషన్ ఉందనిపించింది. దాని కోసం ఇంట్లో కూడా కష్టపడాలని నిశ్చయించుకున్నాకే లంచ్‌లో అతడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.మరిచిన రుచులను గుర్తుచేసే సందర్భాలు రావడమూ అదృష్టమే.ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. -
యువ కథ: కావడి
ఆడిమాసం పెట్టినాది. ఇది చిత్తూరు జిల్లాకే యిశేషం. యీ మాసంలోనే మురగడుకి వూరంతా కలిసి కావడి ఎత్తుతారు. రెండు మూడు దినాల పండగిది. పయనిగాడు కాలేజీ నుంచి వస్తా ‘పల్లె సింగారించుకుందో లేదో? వాళ్ళమ్మ వాకిలి కడిగిందో లేదో? నాయన నాన్నారం పోయి సరుకులు తెచ్చాడో లేదో?’ అని యోసన చేస్తూన్నాడు. వచ్చీరాగానే ‘రేయ్.. పయనిగా రేపు మర్శటి దినం ఆడి కిర్తిక కదా! రామగిరి మురగడుకి గుండు కొట్టి రా.. పన్నెండో తర్గతి పాసయ్యిపూడస్తావు’ అన్నాడు నాయన. ‘నాయనా అక్కడేముండాది? మనూరోళ్ళతో కల్సి తిర్తినికి పోతా’ మనస్సులో యింకేదో దాస్తూ.‘రామగిరి మురగడు గుళ్ళో నంది నోట్లోంచి నీళ్ళు వస్తాయి. కార్వేటినగరం గుడి కోనేటిలో నీళ్ళు అన్ని వైపులా సమానంగా ఉంటాయి. అందుకే దాన్ని స్కంద పుష్కరిణి అంటారు. అంతేగాదబ్బాయా.. ఆ కోనేరు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గుడి కోనేరు తెల్సునా?’ ‘అవునా! ఇదంతా నీ కాడ కొత్తగా యింటున్నా’ అని నోరెళ్ళబెట్టాడు పయని.‘నిజిమేరా! నువ్వు పుడితే నీకు పయని మురగడు దగ్గిర గుండు కొట్టిస్తామని మొక్కుకున్నాం. పయనికి పోయే బయిసు లేదు. కనీసం రామగిరి కన్నా పోయి మొక్కు చెల్లించుకురారా’ అన్నాడు దిగులు పడుతూ పయని నాయన. ‘నేనొంటరిగా యట్ల పోయేది? నేను పోనుబో’ అని మొండికేసినాడు.‘నా మాటిను అబ్బాయా.. మొక్కొని పోకపోతే మనకు చేటు జరగతాది.. నీ యిష్టం మళ్ళా..’ అని భయపెడుతున్నాడు పయని నాయన.‘నిజింగానే మురగడు చేటు చేస్తాడా? అయితే పోతాలే! కానీ వొగ కండిషన్.. రాణి అత్తోల్లతోనే పోతా..’‘వాళ్ళు పోయేది తిర్తినికి కదరా?’‘అవును. నేను కూడా తిర్తినికే పోతా. అక్కడ వుండేది కూడా మురగడే కదా!’ అన్నాడు పయని. ‘సరే! పొయిరాపోరా అతి నాకొడకా. కానీ గుండు కొట్టించుకొని రా.. కొట్టకపోతే మురగడే కొట్టిస్తాడు సూస్కో’ అని ఆర్డరు వేశాడు పయని నాయన.‘పన్నెండు పాసుకాక మునుపే గుండెందుకు కొట్టించాలి? సరే అత్త కూతురు జయలచ్చిమితో పోవాలంటే సరేని జెప్పాలి కాబట్టి ఊ.. కొడదాం’ అని గంగెద్ది మాదిరి తలూపాడు పయని.∙∙ భరణి కిర్తిక దినం పొద్దు మొల్సినాది. అత్తిల్లు చేరినాడు పయని. ‘మురగడుకి యిట్టమైన ఎరిక్కా పూలు (జిల్లేడు పూలు, పాల పూలు) కావాల’ అన్నది రాణత్త. ‘వొకే నిమిషంలో అటు పోయి యిటు వచ్చేస్తా’ అని వుసారుగా వురకపోయాడు పయని. ‘రేయ్.. ఆగురా! జయలచ్చిమిని కూడా తీస్కుబో’ అనింది రాణత్త. లచ్చిమి పయని ఇద్దరు కల్సి జోడేసుకొని పాల సెట్టుకాడికి యలబారినారు. ఒక్కోపువ్వే కోస్తూ లచ్చిమి పైనున్న పేమని ఎలాగైనా తెలియజెప్పాలి అనుకున్నాడు పయని. ‘ఎరిక్కా పువ్వా.. ఎరిక్కా పువ్వా.. నువ్వు నాకిస్టమే ఎరిక్కా పువ్వా.. నేను నీకిస్టమా ఎరిక్కాపువ్వా’ అని పాటందుకున్నాడు పయని. ‘పాల మొగ్గా.. పాల మొగ్గా.. పువ్వు ముదరాల పాల మొగ్గా.. వేచుంటావా పాల మొగ్గా.. వేచి సుస్తా పాల మొగ్గా’ అని పయని పాటకు ఎదురు పాట విసిరింది లచ్చిమి. ఖాళీ కడుపులోకి పాయసం పోసినట్టు కుశాలు పడి అరమైలు దూరం యట్టబోయిందో తెలీకుండా గిల్లుకుంటూ గిచ్చుకుంటూ కొంపకొచ్చారిద్దరు. ఎరిక్కా మాల కట్టారు. వొగరికొకరు మెడల దగ్గిర ఎరిక్కా మాలను పెట్టి చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అబ్బుటికే సూరీడు నడుచ్చికెక్కాడు. వంటకాలు వొక్కోయింటి సుట్టూరం గుమగుమ లాడుతున్నాయి. రాతిరికి వడలు, పులుసన్నం పొట్లాలు చుట్టుకున్నారు. ఒక్కోకింట్లో వొక్కోబ్బుడు నడింట్లో ఆకేసి ‘హరోం హర.. హరోం హర’ అని మొక్కిన శబ్దాలు వినిపిస్తున్నాయి. కావిడెత్తని కిరుస్తూ యిళ్ళకు, హిందూ యిళ్ళకు కావిడెత్తే యిళ్ళు సిన్న పిల్లలతో గుండు గిన్నెల్లో అన్నాలు పంచుతున్నారు. తలనిండా వెండెంటికల పెద్ద మనుషులు, రెండు మూడు బంగారెంటికల నడి మనుషులు కలుసుకొని వూరి తలారితో మిద్దింగు మురగయ్యను, ఆచారి కిష్టయ్యను పిలిపించారు. పసి పిల్లలు చొక్కా నిక్కర్లేసుకొని బొమ్మల కోసరం పోతుంటే, పయని యీడోల్లు లచ్చిమి యీడున్న పడుసు పిల్లల కోసం పోతున్నారు. కావిడెత్తే వాళ్ళు పసుపు బనీను, పసుపు పంచితోంటే కావిడెత్తనోళ్ళు కొత్త బట్టలతో వున్నారు. మిద్దింగు మురగయ్య దొంకలబడ్డ బనీనుతో డమరు వాయిస్తుంటే ఆచారి కిష్టయ్య నిగనిగలాడే తెల్ల చొక్కాయితో పాటలందుకున్నాడు. పిల్లలు డాన్సులేస్తున్నారు. అందరూ నెత్తిలో రైలు పట్టాలు మాదిరి మూడు యిబూది పట్టలు, దానిపైన చందనం కుంకుమాలద్ది భత్తి పరవశంతో ఉన్నారు. కావిడెత్తే వాళ్ళు మెడలో పూలమాలతో, కావడికి పసుపు కుంకుమలు పెట్టి, బంతి పూలు, చామంచి పూలు, ఎరిక్కా మాలలు చుట్టి గలగలా గంటలూపుతున్నారు. వీధంతా పట్టరాని జనాలతో కిక్కిరిసిపోతున్నాది. గ్రామ దేవత గెంగమ్మకు పూజలు జేసి, వూరిడిచి పుత్తూరు రైల్వే టేషనుకు పూడ్సినారు. ఆరు గంటలకు గరుడాద్రి రైలు బండి పట్టాలకొచ్చింది. ఒక నిమిషానికే ఈగల మాదిరి గుంపుగా రైలెక్కినారు. ‘బోయ్’ మని హారన్ కొడుతా బయల్దేరింది రైలు. సమోసాలు, చాయ్, వేంపుడు చెనిక్కాయలు, యల్లరికాయలు ( కీర దోస కాయ) అమ్మేవాళ్ళొస్తున్నారు. ‘పయనిగా ఏమైనా తీస్కోరా. తిందాం’ అని రాణత్త అడిగితే, ‘వొద్దు అత్తా. యిదంతా తినకూడదు. దుడ్లు వేస్టు’ అన్నాడు పయని. తలకొట్టుకున్నారు వూరోళ్ళు పయని పిసినారితనం జూసి.చూస్తుండగానే తిర్తిని వచ్చినాది. రైలు కిటికీల నుంచి ధగ ధగ యలిగిపోతున్న తిర్తిని కొండని జూసి ‘హరోం హర హరోం హర’ మంటూ అరుస్తూ దిగినారు. రాతిరి పడుకునేకి దుప్పట్లు ఎత్తుకొని ప్లాటుఫారం పైన జాగాలు వెతుక్కొని బుక్ చేసుకున్నారు. పయనిగాడు ఉసారుగా ముందుగానే బుక్‌చేసి పెట్టాడు. ఊరు వూరంతా కల్సి నెలవంక సుట్టూరా కూర్చున్నట్టు తిండి సుట్టూరా కూర్చున్నారు. అమ్మ గోరుముద్దలు పెట్టినట్టు వొగరికొకరు పంచుకుంటున్నారు. జయలచ్చిమి పులుసన్నాన్ని వుండగా జేసి పయనికి పెట్టింది. ముసిముసి నవ్వులు నవ్వతాండాది రాణత్త. ముచ్చట్లు, కబుర్లు చెప్పుకుంటూ తిన్న తర్వాత కొంతమంది పక్కనేవున్న కమలా సిన్మా కోటాయికి ఫస్టు షో, సెకండ్ షో కోసం పూడ్సినారు. మరికొంత మంది రోడ్లెంబడి షికారుకు పోయినారు. ఇంకొందరు ముచ్చట్లు పెట్టుకొంటుంటే, పిల్లలంతా వచ్చి పోయే రైలు బండ్ల బోగీలను లెక్కిస్తా కూర్చున్నారు. అంతలోకి ‘అయ్యో యమ్మా.. నా సంచిని రైలులోనే వదిలేశాను’ అని నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తాండాది నడీడున్న వల్లెమ్మ. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘యామంటున్నావే పాపిస్టిదాన. సంచిని వదిలేశావ? యాముంది అందులో? అంత మతిమరుపు యాందిమే నీకు’ అని రాణత్త కోపంగా అరుస్తున్నాది. ‘అయ్యో! అక్కా కావాలని చేస్తానా? ఆ సంచిలోనే మురగడుకి వుండీలో వేస్తానని మొక్కున్న బంగారు వేలు, వెండి శూలం, సెల్లు ఫోను, దుడ్లు, బట్టలన్నీ వున్నాయక్కా, యింక నా బిడ్డల గతేంది, మా ఆయనకాడ నేనెట్ల బతికి బట్టకట్టేది నాయనా’ అని గుండెలు బాదుకుంటాంది. ‘మనం దిగిన రైలు బండి మద్రాసు చేరుంటాది. యింకో రైలెక్కి మద్రాసు సెంట్రలుకు పోతే సంచి దొరకొచ్చు. నేను పోయి సూస్తా’ అని యనక బండెక్కి పోయినాడు పయని. ఊరంత కళ్ళలో వత్తులేసుకొని పయని కోసరం ఎదురుచూస్తాన్నాది. మద్రాసు నుంచి వచ్చే రైళ్లు చానా తిర్తినిలో ఆగి మరలా తిర్పితి వైపుగా పోతున్నాయి. కానీ పయని మాత్రం ఏ రైలు నుంచి దిగలేదు. జయలచ్చిమి ‘సంచి లేకున్నా సరే, పయని జాగిర్తగా తిరిగొస్తే చాలు’ అనుకుంటూ దిగులుగా సూస్తున్నాది. తమ్ముడు కొడుకు యామైనాడో? యప్పుడొస్తాడోని కూతురికి తోడుగా కూర్చుంది రాణత్త. రాతిరి రెండు గంటలప్పుడు.. పయనిగాడు సంచిని తెచ్చాడు. వల్లెమ్మ కంటిలో కన్నీటి పొర కమ్ముకున్నాది. పయనికి చేతులెత్తి మొక్కినాది. రాణత్త, లచ్చిమి పయనిగాన్ని సూసి వూపిరి పిల్చుకున్నారు. ‘పయనిగాడు మొనగాడురా’ అని ఊరంతా పొగడాతంటే లచ్చిమి మన్సు పొంగిపోతాండాది. అందరూ నిమ్మళంగా పొనుకున్నారు. పయని.. లచ్చిమిని సూస్తా కూసున్నాడు. వచ్చిన కస్టం చాలదని ఒక మనిషి ముఖానికి మాస్క్ పెట్టుకొని నైసుగా రాణత్త పక్కన కూసున్నాడు. మెల్లగా కాళ్ళకున్న గొలుసును యిప్పుతున్నాడు. పయని పొనుకున్నట్టే పొనుకొని గబుక్కున లేసి దొంగను పట్టుకుని రైలు పోలీసులకు అప్పగించాడు. ‘వెరీ గుడ్. వి సెల్యూట్ టు యువర్ బ్రేవరీ’ అన్నారు పోలీసులు. జయలచ్చిమి, రాణత్త, వూరోళ్ళ ముందు యీరో అయిపూడ్సినాడు పయని.∙∙ ఆడి కిర్తిక దినం పొద్దు మొల్సినాది. నాలుగున్నరకి టేషను కమ్మీలకు తగిలించున్న కావల్లకి యదురుంగా కర్పూరం అంటించి ‘హరోం హర.. హరోం హర ’ అని మూడు తూర్లు అరిసి, కర్పూరం సుట్టూ వూగించి భుజాలకెత్తుకున్నారు. కోనేటిలో తానం చేసి, కావల్లను కడిగి కొత్త పూలను చుట్టి, యిబూదితో అడ్డం బొట్లు గీసుకొని, టెంకాయలు కొట్టి, కర్పూరం యలిగించి మళ్ళా మూడు సూర్లు ‘హరోం హర’లు సెప్పి కొండెక్కారు. కొండపైన గుండు కొట్టుకునే వాళ్ళు కొట్టుకున్నారు.‘సార్ తమరికి నాయన సెప్పింది గుర్తులేదా?’ అంది జయలచ్చిమి. ‘గుర్తుంది. కానీ పాసయితే కొడుదాంలె. ఇప్పుడెందుకు’ అన్నాడు పయని. ‘మొక్కొని గుండు కొట్టకపోతే మురగడే నీకు కొట్టిస్తాడాగు’ అంది జయలచ్చిమి. ‘సూస్కుందాంలె. యాదైతే అదయితాద’న్నాడు ధీమాగా! ఎవరికి కావల్సింది వాళ్ళు కోరుకుంటూ దేముడికి దండం పెట్టుకున్నారంతా. అగ్గి గుండంలో కర్పూరం, టెంకాయలు వేసి మొక్కులు చెల్లించుకొని ఒక్కచోటుకు చేరారు. అందరొచ్చారో లేదో లెక్కపెట్టుకుని, దారెంట ఉన్న అంగళ్ళను సూసుకుంటా కొండ దిగడం మొదలుపెట్టారు. ఎవరికి కావల్సింది వాళ్ళు, యాడ సలీసుగుంటే ఆడ కొనుక్కుంటున్నారు. పయని మాత్రం తన దగ్గరున్న యాభై రూపాయల నోటును యాభై లచ్చల సూర్లు ఆ నోటుందో లేదో అని తడుముకుంటూ వున్నాడు. బ్లేడుతో చేతులను కోసుకుంటా రక్తాన్ని పసిపాపల పైన పోస్తా జాటీలతో కొట్టుకుంటా ‘రుయ్.. రుయ్’ మని భార్య దరువేస్తే చేతులు చాచి దుడ్లు అడుక్కుంటూ కొందరు.. దారాల పైన నడుస్తూ కోతులతో మ్యాజిక్కులు, సర్కసులు చేస్తా మరికొందరు.. భత్తి పేరుతో ఎండిన డొక్కలకి కొంకీలు గుచ్చుకుని బిచ్చమెత్తుకుంటూ బిడ్డలకు బరువైన ముసలోళ్ళు.. ‘దేముడు దగ్గిరే వున్న వాళ్ళని దేముడెందుకు కాపాడలేకపోతున్నాడు? జానెడు కడుపు కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని పనులు, ఎన్ని బాధలు? చేతి కోతలు ఆరొచ్చేమో కానీ కడుపు కోతలు? కళ్ళు చెమర్చి ఏమీ చెయ్యలేక గమ్మున వెళుతున్నాడు పయని. బాగా బలిసినోళ్ళు ఖద్దరు బట్టలేసుకుని పుణ్యం కోసం ‘అన్నదానం.. రాండి.. రాండి’ అని అరుస్తుంటే బక్క జీవులంతా దేముడు ప్రసాదం దొరకడమే అదృష్టం అనుకుని తినొస్తున్నారు. ఎండ నడినెత్తికెక్కినాది. రైల్వే టేషనుకు పోయే దోవలో ‘మోర్ మజ్జిగ.. మోర్ మజ్జిగ’ అని పిలుస్తుంటే పయని వెళ్ళాడు. కొత్తి మీర, పచ్చి మిరప వేసిన పాల పెరుగు వాసన నోరూరిస్తుండగా గబ గబ తీసుకొని గుట గుట రెండు గిలాసులు తాగినాడు. మూడో గిలాసు కూడా తీసుకుని తాగబోతుండగా.. ‘బాబు వొగ గ్లాసు మోర్ యిరవై ఐదు రూపాయలు అయినాది’ అన్నాడు. గబుక్కున ఆ గిలాసును పక్కన పెట్టేస్తూ ‘యొవ్ ముందే సెప్పాలి కాదుయా? పిలిచి పుణ్యం కోసం దానం చేస్తున్నావని తాగాను’ అన్నాడు అమాయకంగా పయని. ‘హా.. రమ్మంటారు నిన్ను. మూస్కొని దుడ్లు యిచ్చి పో’ అన్నాడు. చేసేదేమి లేక తన దగ్గిరున్న యాభై రూపాయలనిచ్చాడు. ఊరోళ్ళందరూ నవ్వినారు. యిరో జీరో అయిపూడ్సినాడు. యంటికలుండగానే గుండు కొట్టిన మాదిరి అయిపూడ్సినాది యవ్వారం. నాయన మాటలు గుర్తొచ్చినయ్ పయనికి. మురగడు మామూలోడు కాదనుకున్నాడు. మారు మాట్లాడకుండా అత్తబెట్టిన చార్జితో రైలెక్కి యిల్లు చేరాడు.పొంగలి పెట్టి నడింట్లో వేసి మొక్కుకున్నారు. తిర్తిని నుంచి తెచ్చిన బొరుగులు, హల్వా, పొంగలి, బేరికాయలు పందేరాలు మొదలైనాయి. జయలచ్చిమి కూడా ఫలాలు, పొంగలి, బేరికాయలు, బొరుగులు తీసుకుని పయని యింటికి వచ్చినాది. ‘హలో సార్.. అన్నీ టయాలు వొగిటి గావు. యిదిగో నీకోసం వాచ్’ అని చేతిలో పెట్టి ముదిగారంగా బుగ్గలు గుద్దేసి దూడ పిల్ల మాదిరి ఎగురుకుంటూ యల్లిపూడ్సినాది. ఒక పక్కగా జత కట్టిన పయని తాత పాత కావడి బుట్టీలు నవ్వుతూ నిలబడినాయి.∙ -
యువ కథ : అబార్షన్
‘మరోసారి ఆలోచించుకోండి. మళ్లీ కావాలనుకుంటే కుదరక పోవచ్చు.. నేను చెప్పాల్సింది చెప్పా.. తర్వాత మీ ఇష్టం’ అంది డాక్టర్ పద్మ. ఐదు నిమిషాల భయంకర నిశ్శబ్దం. పెద్ద శబ్దం విని ఉలిక్కిపడ్డ చిన్నపిల్లలా ఉంది సంధ్య. ఆమె మాట్లాడేలా లేదని అర్థమైంది డాక్టర్‌కు.‘రెండు రోజుల తర్వాత మీరు రావచ్చు’ అంటూ అసహనంగా టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కింది. తనకెందుకో డాక్టర్ తన ముఖంపైనే గెటవుట్ అని చెప్పినట్లనిపించింది సంధ్యకు. ‘సరే’ అన్నట్లుగా తల ఊపుతూ పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ‘ఏం ఫరవాలేదు నా నిర్ణయం సరైనదే’ అన్నట్లు చూశాడు నరేంద్ర. ఇద్దరూ పైకి లేచి డాక్టర్ గారికి నమస్కరించి బయటికి వచ్చి ఇంటికి వెళ్లడానికి హాస్పిటల్ బయట పార్క్ చేసిన వారి బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడే ఒక కుక్క వాళ్ళ బైక్ వెనుక టైర్ మీద చేయాల్సిన పని చేసి వెళ్లిపోయింది. మరో చిన్న కుక్కపిల్ల బైక్ ముందు చక్రం దగ్గర పడుకొని వుంది. నరేంద్రని చూసి తోక ఊపుతూ అతని చెప్పులు నాక బోయింది. విసురుగా కాలితో ఒక్క తోపు తోశాడు నరేంద్ర. కుయ్‌కుయ్ మంటూ అరవ సాగింది ఆ కుక్కపిల్ల. ఇంతలో దాని తల్లి ఒక్కసారిగా నరేంద్రని చూస్తూ భౌ భౌమని అరుస్తూ వెళ్లి తన బిడ్డను ఆప్యాయంగా నాకుతూ సముదాయిస్తూ వుంది.ఆ కుక్కపిల్లనూ దాని తల్లినీ చూస్తూ ఉంది సంధ్య. కాలు విరిగిన తన తల్లి బాగోగులు చూడడానికి భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అడ్డమని తేల్చి అబార్షన్స్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకు వచ్చిన భర్త వైపు కూడా చూసింది. భర్త మాటకు తాను కనీసం ఎదురు కూడా చెప్పలేకపోయానని, ఆ మూగ జీవానికున్న ధైర్యం కూడా లేనందుకు తన మీద తనే జాలి పడుతూ భర్త బైక్ వెనుక సీటు పైకి ఎక్కి కూర్చుంది. అయితే ప్రతిసారిలాగా భర్త భుజంపై చేయి వేయలేదు. బైకు వెనుక మాత్రమే పట్టుకుని కూర్చుంది.బైక్ బయలుదేరింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం తిష్ట వేసుకుని కూర్చుంది. ఎక్కుపెట్టిన బాణంలా స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా నిదానంగా వెళ్ళకుండా వేగంగా వెళుతోంది బైక్. వెనుక మరింత గట్టిగా పట్టుకుని కూర్చుంది సంధ్య. మెల్లగా పొమ్మని చెబితే ‘అమ్మ బెడ్ మీద ఉందని తెలుసుగా. మనం వచ్చి ఒక గంట పైన అయింది. త్వరగా వెళ్ళవలసిందే’ అని తన భర్త ఎలాగూ అంటాడు. అందుకే మౌనంగా ఉండిపోయింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు పట్టింది. సంధ్యను ఇంటి గుమ్మం దగ్గర వదిలి ఆఫీసుకి వెళ్ళిపోయాడు నరేంద్ర.ఇంటి బయట చెప్పులు వదిలి మెయిన్స్ డోర్ తలుపు తీసింది సంధ్య.‘రామ్మా.. రా.. కొంచెం కాఫీ కలిపి ఇవ్వమ్మా... తల పగిలిపోతోంది’ అంది సరోజినమ్మ.‘సరే అత్తయ్య..’ అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ గిన్నెలో కొన్ని పాలు పోసి, స్టవ్ మీద పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుందామని బెడ్రూమ్లోని వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళింది. వార్డ్రోబ్ అద్దంలో తన పొత్తికడుపు వైపు చూసుకుంది. ఒక చేయి పొట్ట మీద ఉంచుకొని మరొక చేత్తో నైటీతో కన్నీళ్లు తుడుచుకుంటూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో ‘నాలుగు నెలల నిన్ను చంపుకుంటున్నాను. నన్ను క్షమించరా..’ అంటూ వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్ళు ఆగటం లేదు. ‘సంధ్యా .. ఒసేయ్ సంధ్యా.. పాలు మరిగిపోతున్నాయి. సోకులు చేసుకోవడం ఆపి బయటికిరా..’ అంటూ సరోజినమ్మ అరుస్తూ తన చేతి కర్రతో మంచాన్ని గట్టిగా కొట్టేసరికి ఈలోకంలోకి వచ్చి, గబగబా నైటీని దూర్చుకొని హడావిడిగా వంటింట్లోకి పరుగు పెట్టింది. దారిలో టీపాయ్ అంచు రోజు మాదిరిగానే మోకాలిని ముద్దాడింది.‘అబ్బా’ అని గట్టిగా అరిస్తే ‘ఇంకా కళ్ళు కూడా పోయాయా? చూసుకొని నడవలేవా?’ అనడానికి అత్తయ్య రెడీగా ఉంది. అందుకే బాధనంతా పంటిబిగువున పట్టి, వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి అత్తయ్య చేతిలో పెట్టింది.తన మొహం కూడా చూడకుండా కాఫీ అందుకుని దానిని తాగే పనిలో పడిపోయిందామె.‘అత్తయ్యా.. మీతో విషయం చెప్పాలి’ అంది సంధ్య లోగొంతుతో.‘ఏంటి?’ అంది అత్తయ్య గొంతు కరుగ్గా.‘అదీ .. అదీ.. అత్తయ్యా .. నాకు ఇప్పుడు నాలుగో నెల..’ అని సంధ్య అంటుండగానే..‘తీయించే కడుపు నాలుగో నెల అయితే ఏమి? ఐదో నెల అయితే ఏమి?’ అంది సరోజినమ్మ. సంధ్య నోట మాట రాలేదు. తాను విన్నది నిజమేనా అన్నట్లు సరోజినమ్మ ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పటివరకు అబార్షన్స్ చేయించాలనుకున్న నిర్ణయం కేవలం భర్తది మాత్రమే అనుకుంది.అత్తయ్యకు కూడా ఈ విషయం తెలిసుంటుందని ఊహించలేకపోయింది. కనురెప్పలు కంటిని మూయడం మరిచిపోయాయి సరోజమ్మ మాటలకు. మొదటిసారి తన ఇల్లే తనకి భయాన్ని పరిచయం చేసింది. అమ్మా కొడుకులు కలిసి తన బిడ్డను, తన అమ్మతనాన్ని, తన నుంచి దూరం చేయాలనే నిర్ణయం తీసేసుకున్నారని, మొద్దుబారిన ఆమె మెదడుకు అర్థమయ్యేసరికి కన్నీళ్ళు చెంపల నుంచి గుండెల వైపుకి చేరసాగాయి.నెమ్మదిగా గొంతులోకి ధైర్యాన్ని నింపుకొని ‘అత్తయ్యా .. నేను బిడ్డను ఉంచుకుంటాను అత్తయ్యా.. వారికి మీరే ఎలాగైనా చెప్పి ఒప్పించండి.. ప్లీజ్’ అంది.‘చూడమ్మాయ్.. నేను కాలు విరగ్గొట్టుకొని మంచాన పడున్నాను. ఆరు నెలలు లేవడానికి లేదు.నీవు కడుపని పుట్టింటికి వెళితే నన్నెవరు చూసుకుంటారు? అందుకే తీయించేసేయమన్నాను. కడుపుదేముంది ఎన్నిసార్లైనా తెచ్చుకోవచ్చులే. అయినా నేను మీ సంబంధం ఖాయం చేసేటప్పుడే మీ నాన్నతో చెప్పా.. మాకు మీరు కట్నం ఎలాగూ ఇవ్వలేరు. ఇంటి పనులు చేసే పిల్లయి ఉంటే చాలు అని.తల్లి లేని పిల్ల కదా అని పెళ్ళి కూడా తేరగా చేసుకుంటే ఇప్పుడు మేము మీకు సేవలు చేస్తూ కూర్చోవాలా?’ అంటూ ఇంకా ఏవేవో నా¯Œ స్టాపుగా మాట్లాడుతోంది సరోజినమ్మ.సంధ్యకు అంతవరకు మాత్రమే ఆ మాటలు వినపడ్డాయి. ఇక తర్వాత తనకు ఏమీ వినపడలేదు. కాసేపటి తర్వాత ‘నీ మొగుడు వచ్చినట్టున్నాడు వెళ్ళి తెలుపు తియ్..’ అన్న సరోజినమ్మ మాటలతో ఉలిక్కిపడింది. కంటిన్యూగా మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దం తను వెళ్ళి తలుపు తీయగానే ఆగిపోయింది.‘ఎక్కడ చచ్చావ్? ఇంతసేపు?’ అంటూ విసురుగా లోపలికి వచ్చి ఆఫీస్ బ్యాగు సోఫాలో విసిరేసి ‘కాఫీ తీసుకురా’ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు నరేంద్ర.కాఫీ కలిపి తెచ్చి భర్త చేతికందిçస్తూ.. ‘అబార్షన్స్ విషయం మరొకసారి ఆలోచించకూడదా?’ అని అడగబోయే లోపలే.. ‘రేపు ఉదయం నేను ఆఫీస్‌కి లీవ్ పెట్టాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా?’ అంటూ కాఫీ తాగడంలో నిమగ్నమైపోయాడు నరేంద్ర.నిస్సహాయత కమ్ముకుంది సంధ్యను.ఉదయం చూసిన తల్లి కుక్క గుర్తొచ్చింది. అది కనీసం మొరగనైనా మొరిగింది. తనకు నోరు లేదా? దేని గురించి తాను భయపడుతున్నట్టు?సంధ్యను తండ్రి మగరాయుడిలా పెంచాడు. తల్లి లేకపోవడంతో ఇంట్లోని ప్రతి పనీ సంధ్యకు బాగా వచ్చు. తండ్రికి సేద్యంలో సాయానికి వెళ్ళి పొలంలో దిగిందంటే మట్టిని గింజను కాపాడుకొని పంట ఇంటికి తెచ్చుకోవడం తెలుసు. పాడి పొదుగు పాలు తెలుసు. తండ్రి రూపాయి తెస్తే పావలా దాచి మిగిలిన డబ్బుతో ఇల్లు నడపడం తెలుసు. తండ్రి తనని టౌన్స్ లో ఇచ్చి చేసింది ఈ పనులకు దూరంగా కూతురు కాస్తంతైనా సుఖపడాలని. జీతగాడైన భర్త తెచ్చే జీతంతో హాయిగా ఉండాలని. కాని జీతం తెచ్చే వాడంటే జీవితంలోని ప్రతి నిర్ణయానికి అధిపతి అని ఆమె అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకుంది. అయితే ఏంటి? ఇంటి నుంచి తరిమేస్తారు. లేదా విడాకులు ఇవ్వొచ్చు. చిన్నప్పుడే కలుపు కూలీల బిడ్డల్ని సరదాగా వీపుకు కట్టుకుని పని చేసేది సంధ్య. ఇప్పుడు సొంత బిడ్డను గుండెకు అదుముకుని ఎలా బతకాలో తెలియదా!సంధ్య మౌనంగా ఇంట్లోకెళ్ళి ఒక చిన్న సంచిలో కొన్ని బట్టలు పెట్టుకొని బయటికొచ్చి నిలబడేసరికి అత్త, భర్త నోరు తెరిచారు. ‘మా ఇంటికి వెళుతున్నాను. అక్కడ ఉంటానో లేదో తెలియదు. మా నాన్న ఇక్కడకు తిరిగి వెళ్ళమని అంటే వేరే ఎక్కడికో వెళ్ళి నా బిడ్డను క్షేమంగా కంటాను. ఆ తర్వాత కష్టం చేసి పెంచుకోవడం నాకు వచ్చు. మీ అమ్మ అంటే నాకు గౌరవమే. ఆమె కాలు విరిగితే ఎలా సేవ చేయాలో ఈ క్షణం వరకూ ఆలోచిస్తూనే ఉన్నాను. కాని మీ సౌకర్యం కోసం నా బిడ్డ ప్రాణాలు తీయడంలో కనీసం నా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని అనుకోలేదు మీరిద్దరూ. అంటే నన్ను మీలో ఒకరు అని అనుకోలేదన్న మాట. నేను కూలిదాన్ని కాదు.. కోడల్ని. భార్యని. ఇప్పుడు కేవలం కాబోయే తల్లిని. నాకై నేను వద్దనుకుంటే తప్ప నా కడుపులోని బిడ్డను ఎవరూ తాకలేరు. ఇప్పుడు వెళుతున్నాను. అత్తయ్యా.. మీ అబ్బాయి వచ్చి క్షమాపణలు చెప్పి మీరూ క్షమాపణలు చెప్పాక నా కడుపులోని బిడ్డతో పాటు నలుగురం కూచుని మన ఇంట్లో ఎవరూ ఏ ఇబ్బంది పడకుండా ఎలా ఈ సందర్భాన్ని దాటొచ్చో ఆలోచిద్దాం.మరో విషయం. మీరు కాలు విరిగి మాత్రమే మంచం మీద పడ్డారు. నేను గనక ఇప్పుడు ఇల్లు దాటితే మీ అబ్బాయి నడుమే విరుగుతుంది జాగ్రత్త’ అంది సంధ్య.ఒక చేతిలో సంచి పట్టుకుని, మరో చేతిని కడుపులో ఉన్న బిడ్డకు చేరువ చేస్తూ నిలబడి ఉన్న సంధ్యను సరోజినమ్మ, నరేంద్ర భీతిల్లి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళ ఆధిపత్యం ఏ క్షణమైనా అబార్షన్స్ టేబుల్ ఎక్కేలా ఉందనిపించింది సంధ్యకు.ఆమె ధైర్యంగా అలాగే నిలుచుంది. -
యువ కథ: నీలం కారు
‘ఏమిటీ ఈ డొక్కు కారు ఇక్కడా!! ఎవరిది ఇది?’ అనే మాట వినిపించే సరికి చురుక్కున చూశాను.ఇస్త్రీ చేసిన చొక్కా, గాలి వీస్తున్నా వడలిపోని జరీ అంచు కుచ్చిళ్ళు, ఎండకి మెరుస్తున్న పంచె, నున్నగా గీసిన గడ్డం, నల్ల కళ్ళజోడు, ఇతగాడికి ఎండ తాకకుండా వెనుక గొడుగు పట్టుకొని మా రాముడు. అర్థం అయింది కొత్త పెళ్ళికొడుకు అని. రెండేళ్ళ నుండి మూలన పడి వున్నా ఇన్నేళ్ళుగా నన్ను ఎవరూ కదిలించింది లేదు పట్టించుకోనూ లేదు. ఇలా ఈసడించిన వాళ్ళు కూడా లేరు. అలాంటిది ఉన్నట్టుండి డొక్కు కారు అని వినేసరికి కుంభకర్ణుడికి నిద్రాభంగం అయినట్టు లేచాను. ‘ఇది మా షావుకారుగారి మొదటి కారు అయ్యగారూ.. మా షావుకారు అనే కాదు, ఇది ఈ ఊర్లోనే మొదటి కారు’ నన్ను నాకు గుర్తుచేస్తూ, నా గత వైభోగం గురించి గొప్పగా చెప్పాడు రాముడు.‘అయితే?’ అన్నాడు కొత్త పెళ్ళికొడుకు.నేను అక్కడ ఉండటం, అలా ఉండటం అతగాడికి బొత్తిగా నచ్చనట్టు ఉంది. అతనికి నచ్చకపోయేసరికి రాముడు చిన్నబుచ్చుకుంటూ నన్ను చూశాడు.పాపం నన్ను ఇంటికి మొదటిసారి తీసుకొని వచ్చినప్పుడు నాకు దిష్టి తీసింది రాముడే. అలా తీసినందుకు షావుకారు రాముడికి, అతని భార్యకి, కొడుకుకి కలిపి ఒక రూపాయి నోటు ఇచ్చారు. నన్ను చాలా ఆప్యాయంగా, సొంత బిడ్డలా చూస్తూ తాకిన మా షావుకారి చేతి స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది. నన్ను ఒక కారులా కాకుండా ఇంట్లో ఒకరు అన్నట్టు చూసుకునే వాళ్ళు. డ్రైవర్ పేరుతో బయట మనిషి కూడా నన్ను తాకకుండా షావుకారు అన్నీ తానే అన్నట్టు అల్లారుముద్దుగా చూసుకునే రోజులవి.మొదటిసారి నేను ఊరిలోకి వచ్చిన క్షణం నాకు ఇంకా గుర్తుంది. అది ఒక జాతర అనే చెప్పాలి. లేదా నేను ఒక గ్రహాంతరవాసిని అయినా అయ్యుండాలి.మా షావుకారుగారు నన్ను తోలుకుంటూ ఊరిలోకి వస్తుంటే, ఏదో తెలియని అమాయకపు హోదాని ఇస్తూ గడపల దగ్గర, అరుగుల మీద కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి చూడటం; మా షావుకారి గారినో, నన్నో చూసి చూసి మురిసిపోవటం, బుడత గాళ్ళందరూ నా వెనుకనే పరిగెత్తుకుంటూ రావటం, కొందరు సైకిల్ టైరుని కొట్టుకుంటూ నా వెనుక పరిగెత్తటం, రోజువారీ పనులకి వెళ్ళే వాళ్ళందరూ నన్ను చూస్తూ అలా ఆగిపోవటం... ఆహా!! ఇంటికి వచ్చాక వాహన పూజ అన్నట్టు అయ్యగార్లు మంత్రాలని వల్లిస్తుంటే ఎంత వినసొంపుగా ఉండేదో. కొత్త ముతైదువుని అలకరించినట్టు పసుపు కుంకుమలతో నన్ను సింగారించి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, చిన్న పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇలాంటి మధుర స్మృతులన్నీ నెమరు వేసుకొంటుండగా టపీమని ఒక చేతి అచ్చు పడింది బోనెట్ మీద. ఒక్కసారిగా కలలో నుండి ఇలలోకి వచ్చినట్టు అయ్యింది. ఎవరా అని చూస్తే ఇంకెవరు కొత్త పెళ్ళికొడుకే!‘ఎందుకూ పనికి రాని ఇనుము ఇంట ఉంచరాదు అని తెలియదా రాముడూ’ అంటున్నాడు.‘నిజమే నయ్యా!! కానీ ఈ కారుని ఇనుము అని ఇంటిల్లిపాది ఎప్పుడూ అనుకున్నదే లేదు. ఈ కారు వచ్చాకనే ఇంటికే కాదు, ఊరికి కూడా చాలా విషయాలు కలిసొచ్చాయి.’తన మాటకు ఎదురు పలుకుతున్నందుకు రాముణ్ణి కొత్త పెళ్ళికొడుకు గురాయించి చూస్తుంటే నా ఒళ్ళు వుడికిపోతోంది. అయ్యగారి చూపులని గమనించిన రాముడు తనని తాను తమాయించుకున్నాడు. దూరంగా చూస్తే చిన్నమ్మాయి గారు. నన్ను పరిచయం చేయటానికే ఏమో ఇటుకేసి వస్తున్నారు. నేను ఇంటికి వచ్చిన కొత్తల్లోనే పెద్దమ్మాయి గారికి పెళ్ళయింది. పెళ్ళి పిలుపుల దగ్గర నుండి అప్పగింతల వరకు తిరిగింది నేనే, తిప్పింది నన్నే. ఎంత హడావిడి వున్నా కారు తీయాలంటే షావుకారు గారే వచ్చే వాళ్ళు కానీ పొరపాటున కూడా నన్ను ఇంకొకరి చేతిలో పెట్టలేదు. పెద్దమ్మాయికి నేనంటే చాలా సెంటిమెంట్. అందుకే అత్తారింటికి వెళ్ళే ముందు నాకు నమస్కారాలు పెట్టి తృప్తిగా తడిమి మరీ వెళ్ళిందా బంగారుతల్లి.ఇక మా చిన్నమ్మాయి గారు నేను ఫ్రెండ్స్. తన కాలేజీ చదువులకు, పరీక్షలకు, టైపింగ్ నేర్చుకునేందుకు, పట్టణంలో షాపింగ్‌కి, స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి అన్నిటికీ నేనే... అంటే అదే నా తోడునే.ఒకసారేమో ఊరి అవతల వైపు ఉండే అమ్మాయి గారి స్నేహితురాలు లలితకి పురిటినొప్పులు మొదలు అయ్యాయి. మంత్రసాని ఊరిలో లేదాయె. సమయానికి షావుకారు కూడా ఊరిలో లేరు. చిన్నమ్మాయి గారే ధైర్యం చేసి తోలారు నన్ను. చాలా జాగ్రత్తగా లలితను తీసుకొని పక్క ఊరిలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. పసికందు పుట్టాక ఇంటికి తీసుకొని వచ్చింది కూడా నాతోనే. డ్రైవ్ చేయటానికి కొంచెం దడ ఉన్నా దాన్ని బయటకు చూపించకుండా బాగానే తోలారు. ఆ ఒక్క సంఘటనతో అమ్మాయి గారికే కాదు వాళ్ళ స్నేహితురాళ్లందరికీ కూడా నేనంటే మక్కువ. ఒక్కోసారి పూలతో, మరోసారి బొట్లతో, ఇంకోసారి ఓణీలతో రకరకాలుగా ముస్తాబు చేసే వాళ్ళు నన్ను. అలా నన్ను చూసి ఎవరైనా ఏమైనా అంటే మా కారు మా ఇష్టం అని నన్ను హత్తుకునే వాళ్ళు. ఈ రకంగా నేను వాళ్ళల్లో ఒకరిలా కలిసిపోయాను. షావుకారు గారు ఎటైనా ఏదైనా పని మీద వెళ్ళడం మా అమ్మాయి గారు నన్ను తీసుకొని షికారుకి వెళ్ళటం. ఎవరైనా ఆకతాయి కుర్రాళ్ళు మా అమ్మాయి గార్ని సతాయించాలనుకుంటే స్పీడ్ పెంచి మేము వాళ్ళని బెదరకొట్టటం. భలే ఉండేదిలే మా సావాసం. పై చదువులు అని అమ్మాయి గారిని పట్టణం పంపేశాక ఇదే మళ్ళీ చూడటం. చాలా మారిపోయారు అప్పటికీ ఇప్పటికీ. ఈ రెండేళ్ళలో ఇంటికి మరో కారు వచ్చింది. కానీ నాకు ఇచ్చిన స్వాగతం, హోదా ఆ కారుకి లేదు. ఊరు చిన్నదే అయినా ఇప్పుడు మరో నాలుగైదు కార్లు వచ్చాయి. ఇదంతా ఎపుడు జరిగిందో కూడా తెలియలేదు. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గర వాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. ఆ ఫొటోలన్నీ హాల్లో గోడలకి వేలాడుతుండేవి. ఇపుడు కట్నం పేరిట కొత్త పెళ్ళికొడుక్కు ఒక కొత్త మోడల్ కారు వెళ్తుందంట! మా అమ్మాయి గారు దగ్గరికి వచ్చేశారు.‘ఓరి కొత్త పెళ్ళికొడకా... ఇప్పుడు చూడు ఆమె నీకెలా గడ్డి పెడుతుందో’ అనుకున్నాను.చిన్నమ్మాయి గారు వచ్చి రాగానే ‘ఈ కారు ఇంకా ఇక్కడనే ఉందా?!’ అన్నారు. ’రాముడూ! నాన్నకంటే చాదస్తం ఎక్కువ. నీకేమైంది. ఇదుగో ఈ కారు తాళం. తీసుకొని వెళ్ళో, తోసుకొని వెళ్ళో డంపింగ్ యార్డ్‌లో పడేయ్’. రాముడు ఆ మాటలకి నివ్వెరపోయాడు. ‘ఏంటి రాముడు అలా చూస్తున్నావ్? ఇదుగో తాళం. తీసుకొని త్వరగా ఇక్కడ నుండి బయలుదేరు’. ఏదో ఆలోచిస్తూ రాముడు తాళం తీసుకున్నాడు. నాకు గుండెల్లో కవ్వం పెట్టి చిలికేస్తున్నట్టు ఉంది. రాముడు ఎన్నడూ నన్ను నడిపించింది లేదు. అలాంటిది మొదటిసారి ఎక్కి కీ ఆ¯Œ చేశాడు. ఇంజి¯Œ లో వణుకు పుట్టింది. నేను అమ్మాయి గారి వైపు చూశాను. ఒకప్పుడు అన్నీ తన ఇష్టంగా జరిపించుకున్న అమ్మాయి గారు. తన మాటే నెగ్గాలనుకునే అమ్మాయిగారు. బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని అంటే షావుకారు గారు హడలిపోయి వద్దన్నా ‘చేస్తాను. నా ఇష్టం. అందులో తప్పేముంది’ అని మాట చలాయించుకున్న అమ్మాయిగారు, పెద్దమ్మాయిగారు ఉన్నప్పుడు ఇద్దరం రోజూ ఒకే రంగు బట్టలేసుకుందాం అనంటే నీ ఇష్టం నీది నా ఇష్టం నాది... ఏంటి నీ కోరిక యూనిఫారంలాగా అని పడీపడీ నవ్విన అమ్మాయి గారు, పుస్తకాలు తెగ చదివే అమ్మాయి గారు, పెళ్ళి అయిన నాలుగు రోజులకే...రాముడు మెల్లగా నన్ను కదిల్చాడు.‘సాయంత్రం షికారుకెళ్దామా’ కొత్తపెళ్లికొడుకు అడుగుతున్నాడు.‘మీ ఇష్టం’ అంటోంది అమ్మాయిగారు.‘ఆ ఫ్యాష ఎందుకు... తాళిబొట్టు బయటకు కనిపించేలా వేసుకో’‘అలాగే. మీ ఇష్టం’‘నాకు చెప్పకుండా ఎప్పుడూ డ్రైవింగ్ చేయకు’‘సరే’...రాముడు నన్ను బంగ్లా బయటకు తోలుకెళ్తున్నాడు.నేను అమ్మాయిగారినే చూస్తూ ఉన్నాను.ఆమె అక్కడే ఉండిపోగా నేను గేటు దాటి, మలుపు తిరిగిపోయాను. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గరవాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. -
యువ కథ: ది ప్రపోజల్
డియర్ రియా! ఆఫ్టర్ మచ్ థాట్ ఐ హావ్ కమ్ టు ద కంక్లూజన్ దట్ ఐ కెన్ నాట్ సస్టెయిన్ దిస్ ఫీలింగ్ వెరీ లాంగ్. ఐ జస్ట్ వాంట్ టు బి యువర్ పార్టనర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఇప్పటికే రెండు రోజులయింది ఇన్‌స్టాలో మేసేజ్ చేసి. కనీసం రిప్లయి కూడా లేదు తన నుండి. ఒక చిన్న మేసేజ్కే ‘యస్’ చెపుతుందని కాదు. కానీ ఒక చిన్న ‘నో’కి కూడా నోచుకోలేకపోయాననే బాధ. ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియలేదు కానీ చేసేశాను. ఎలాగైతేనేం తనకి విషయం అర్థం అయితే చాలు. అసలు ఈ మెసేజెస్, కాల్స్‌లో ప్రపోజ్ చేయడం ఏంటి? డైరెక్ట్‌గా చెప్పేస్తే ఏదోఒక సమాధానం వచ్చేది కదా! ఆ ధైర్యమే ఉంటే ఇన్నిరోజులు ఎందుకు ఆలోచిస్తా. ఎప్పుడో చెప్పేసే వాడిని కదా! నన్ను నేను తిట్టుకుంటూ తనని ఆఫీస్‌లో ఎలా ఫేస్ చేయాలో అని భయపడుతూ ఆఫీస్ బాట పట్టాను. బెంగళూరులోని మా ఆఫీస్‌లో రియా నా కొలీగ్. కన్నడ కంటెంట్ రైటర్. నేను తెలుగులో పని చేస్తున్నాను. తనది బళ్ళారి కావడం వలన తెలుగు బాగా మాట్లాడుతుంది. నాకు తనతో పరిచయం తక్కువే. ఆఫీస్‌లో తను మాట్లాడని, తనతో మాట్లాడనివారు ఎవ్వరూ ఉండరు ఒక్క నేను తప్ప. నేను మాట్లాడకపోవడానికి కారణం లేకపోలేదు. తనతో మాట్లాడే ప్రతి ఒక్కరినీ బ్రో అని సంబోధిస్తుంది. తన నుండి ఆ పిలుపుకి నోచుకోకపోవడమే ఉత్తమమని ఆల్మోస్ట్ దూరంగానే ఉంటాను. ఎంత దూరంగా అంటే నా ఎదురు క్యాబిన్ తనదే అయ్యి ప్రతీ అయిదు నిమిషాలకొకసారి గత్యంతరం లేక ఒకరి ముఖం ఒకరు చూసుకునేంత. అయినా సరే నేను మాట్లాడకపోగా తనకి మాట్లాడే అవకాశం ఇచ్చిన పాపాన పోలేదు. గడుస్తుంది కాలం తనని చూస్తూ, తన పలుకులను వింటూ, తన ఊహలతో జీవనం గడుపుతూ. ఆ గ్రిల్డ్ చికెన్ తింటూ నేను వేసిన ‘స్నాప్’ చూసి మరుసటి రోజు రెస్టరెంట్ చిరునామా వాకబు చేసింది. నేను లోకేషన్‌తో పాటు టేస్ట్ కూడా షేర్ చేశాను. నోట్లో లాలాజలపాతాలు పొంగాయో ఏమో కానీ ఉన్నపాటున లేచి ‘వెళదాం పదా’ అంటూ నిలబడింది. నన్ను మించిన భోజన ప్రియురాలు కాబోలు అనుకుంటూ వెళదాం అన్నట్టుగా లేచాను. ఈ తంతంతా తెలుగు రాకపోయినా వింటున్న రాజ్దీప్కి ఎంత అర్థం అయ్యిందో గాని ‘నేనూ వస్తా’ అంటూ కదిలాడు. అలా ముగ్గురం నడుచుకుంటూ రెస్టరెంట్‌కి వెళ్ళి ఆర్డర్‌కి ముందు ముచ్చట్లు తిన్నాం. ఆ తర్వాత తనని పీజీ దగ్గర డ్రాప్ చేయడానికి నేను, రాజ్‌దీప్ తీసుకెళుతూ ఉంటే తను మరిన్ని ముచ్చట్లు తినిపించింది. ఎంత బాగా మాట్లాడుతుందో.. ఒక్కోపదాన్ని పేర్చినట్టు, ఆ పదాలు తన నోటి నుండి రావడానికి పోటీ పడుతున్నట్టు.. భాషే కాదు, వ్యక్తీకరణ కూడా సరళంగానే ఉంది. మాటల మధ్యలో రాజ్‌దీప్ ‘అర్జున్ కుక్స్ వెల్’ అని చెప్తే ‘నిజమా విచ్ ఐటెమ్స్ డు యు కుక్ వెల్’ అని అడిగింది. ‘అదీ ఇదీ అని ఏం లేదు అన్నీ చేస్తా’నని బదులిచ్చాను. ‘నీ వైఫ్ చాలా లక్కీ’ అంది. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అన్నాను. ‘సారీ, ఫ్యూచర్’ అని జోడించింది. ఆ లక్ నీకు ఇస్తున్నానని మనసులో అనుకోబోయి బయటకు అనేశాను ఏమరపాటుగా. నడుస్తున్నది కాస్త ఆగి ఒక్క క్షణం నా వైపు చూసి ‘ముఖద్ మేలే హొడిత్తిని నన్మగ్నే’ అంది కన్నడాలో. నాకు అర్థం కాకపోలేదు. తను ఆ మాట అంటున్నప్పుడు తన ముఖంలో ముసిముసిగా తొణుకుతున్న నవ్వుని గమనించాను. మా మధ్య పెద్దగా మాట పరిచయం లేకపోయినప్పటికీ ఉన్న ముఖ పరిచయంతోనే ఏదో తెలియని బంధం ఏర్పడిందేమోనన్న భావన నాలో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ భావనే లేకపోతే ఈరోజు ఈ క్షణం తనతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడేవాడినే కాదేమో! తనతో వేసిన ఆ కొన్ని అడుగులలో నాకు అవసరమైన ఏడు అడుగులను తన అడుగుల్లోనే జాగ్రత్తగా వేస్తూ తన పీజీ దగ్గరకు చేరాము. తనకి ఒక బై చెప్పి, సీ యూ టుమారో అంటూ నేనూ, రాజ్‌దీప్ మా ఫ్లాట్‌కి మేము బయలుదేరాము. ఫ్లాట్‌కి వచ్చి స్నానం చేసి బెడ్ మీద వాలగానే గుండెల్లో ఏదో అలజడి. ఆమెతో గడిపిన ఆ కొన్ని క్షణాలు నా మదిని పదేపదే ఢీకొడుతున్నాయి. మా పరిచయం కాస్త స్నేహంగా మారుతుందేమోననే ఆలోచన నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అలా జరిగితే ఆమెకున్న స్నేహితుల్లో నేను ఒకడిగా మిగిలిపోవడం ఖాయం. ఒక స్నేహితుడిగా ప్రేమను తెలియజేయడం కన్నా ప్రేమికుడిగా ప్రేమను వ్యక్తపరచడం మేలనిపించింది. ఎన్ని కోణాల్లో ఆలోచించినా ఆ క్షణాన నా మస్తిష్కానికి అంతకన్నా ఉన్నతమైన ఆలోచన తట్టలేదు. ఏదో తట్టినట్టుగా తటాలున టెర్రస్ పైకి వెళ్ళాను. అప్పటికే టైమ్ అర్ధరాత్రి. ఒకటీ యాభై అవుతోంది. కొద్దిసేపు భూగోళాన్ని విడిచి ఆకాశానికేసి చూస్తూ నక్షత్రాల సోయగాల్ని ఆస్వాదిస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి టైమ్ ట్రావెలింగ్ చేసినట్లు అనిపించింది. దాదాపు రెండు దశబ్దాల కాలం ఒక్కసారిగా కళ్లముందు కదలాడింది. ఆరవ తరగతిలో అనుకుంటా ఊరికి దూరంగా హాస్టల్లో చేర్పించారు. అప్పుడు మొదలైన జీవనపోరాటం ఇప్పుడు ఈరోజు ఈ మహానగరంలో జాబ్ చేస్తూ కొనసాగుతోంది. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి, ట్రాఫిక్ ని జయించి ఫ్లాట్‌కి వచ్చేసరికి రాత్రి అవుతుంది. అప్పుడప్పుడూ టెర్రస్ మీదకు వచ్చినా.. ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ తిరగడం మినహాయించి అంత నిశితంగా ఆకాశానికేసి చూసింది లేదు. ఇప్పుడు ఇలా పరికించి చూస్తుంటే చిన్నప్పుడు ఆరుబయట మంచం మీద పడుకుని ఒక్కో నక్షత్రాన్ని జాగ్రత్తగా లెక్కపెట్టిన క్షణాలు గుర్తొచ్చాయి. అదేంటో ఎన్ని అంకెలు జత చేసినా లెక్క తేలేదికాదు. అలసిపోయి ఆదమరిచి నిద్రపోవడం తప్ప ఏనాడూ లెక్క పూర్తి చేసింది లేదు. చుక్క రాలిపడుతున్నప్పుడు మనసులో కోరుకున్నది నిజమైపోతుందని నాయనమ్మ చెప్పిన కథలు మనసులోనే నాటుకుపోయాయి. రియా పట్ల నా ప్రేమ సత్యమైతే, తన ప్రేమను పొందగలను అనేది నా నమ్మకం. ఆ వేళ ఆకాశంలో చుక్కలేవీ రాలి పడటం లేదు. నిలిచి ఉన్న చుక్కలే నా ప్రేమను నిలబడతాయని అనుకున్నాను. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమీ తెలియకపోయినా పెట్టని ఆ సుముహూర్తాన రెండోపొద్దు జామున రెండుగంటల ముప్ఫై ఆరు నిమిషాలకు మేసేజ్ చేశాను. ఏంటో ఈ భావన! భయమో, ఆత్రమో తెలియడం లేదు. రెండుగటలయింది ఆఫీస్‌కి వచ్చి. కానీ తనవైపు తలెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కారే చెమటని ఏసీ కూడా నియంత్రించలేకపోతోంది. ఇదంతా గమనించింది కాబోలు వచ్చి పక్కన కూర్చుంది. గుండె వేగం కాంతితో పాటు పయనిస్తున్నట్లు ఉంది. ఏమీ మాట్లాడకపోయినా నా వైపే చూస్తుందన్న విషయం నాకు అర్థమవుతోంది. మెల్లిగా తన అరచేతిని నా చేతిమీద పెట్టింది. ఎన్ని హిమపాతాలను తోడు తెచ్చుకుందో కానీ ఆ స్పర్శ నా శరీరాన్నే కాదు నా హృదయాన్ని కూడా చల్లబరిచింది. మెల్లిగా తనవైపు తిరిగాను. ‘డు యు థింక్ ఇట్ వాజ్ ఎ ప్రపోజల్?’ అన్నది సున్నితంగా. నాకు నోట మాట రాలేదు. బలవంతంగా గొంతు పెకల్చి ‘ఐ యామ్ సారీ ఫర్ దట్’ అని చెప్పాను. ‘ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు’ అదే సున్నితమైన స్వరంతో. నేను మౌనం దాల్చాను. ‘చూడూ.. ఈ ఫీలింగ్స్, ప్రేమ, వ్యక్తీకరణ ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమేనని నేను నమ్ముతాను. వాటి కొరకే జీవించాలి, ఆ భావాలే జీవితాన్ని నడిపిస్తాయి అంటే నమ్మను. నీ ప్రేమను గౌరవిస్తాను. నా మీద నీకున్న ప్రేమకి నా మనసు అంగీకారం తెలిపితే నిన్ను నమ్మి ఎంత దూరమైనా వస్తాను. కానీ ఆ ప్రయాణంలో నా వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి ఎంత మాత్రం ఇష్టపడను. నిన్న పుట్టి ఈరోజు మరణించే ప్రేమలను నేను నమ్మను. నీకు ప్రేమ పుట్టినంత సులభంగా నాకూ పుట్టాలనుకోకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమించలేను. నేను ప్రేమను ప్లాన్ చేయలేను దానంతట అది జరిగిపోవాలి. ముందు మనిద్దరికిద్దరం అర్థమవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అర్థంలేని భావోద్వేగాలతో అనుక్షణం నేను చస్తూ నిన్ను చంపుతూ బతకడం నాకిష్టం లేదు. మనమింకా అర్థం చేసుకునేంత దూరం ప్రయాణించలేదు. ఓపికతో ఉండు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతుంది!’‘నాది ప్రశ్న కాదు ప్రేమ’ అనాలోచితంగా అనేశాను. ‘నాకు ప్రేమ అనేదే పెద్ద ప్రశ్న! దానికి సమాధానం అన్వేషించడానికి నేనిప్పుడు సిద్ధమవ్వాలేమో!’ అంటూ కుర్చీలో నుంచి లేచి తన క్యాబిన్ వైపు అడుగులు వేసింది. ఈ అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి సంపూర్ణంగా అర్థం చేసుకోగలరా? ఒకవేళ ప్రయత్నించినా దానికేమన్నా గడువు ఉంటుందా. ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, భావజాలాలు.. ఇవన్నీ నిరంతరం మారేవే కదా. వీటన్నిటి సమాహారమే కదా మనిషి అంటే. కాలానుగుణ మార్పుల వల్ల కోతకు గురవ్వని మనిషి ఎవరైనా ఉంటారా! మనం మన గతాన్ని తవ్వి చూసుకున్న ప్రతిసారీ మనకు మనమే ఒక నూతన వ్యక్తిగా పరిచయమవుతాం. అలాంటిది ఈ రోజు ఉన్న నన్ను తన భవిష్యత్ మొత్తానికి ఆపాదించుకుని చూసుకోవడం, దానినే అర్థం చేసుకున్నానని భ్రమపడటం హాస్యాస్పదం కాదా? మనిషి మస్తిష్కంలో పొరలు పొరలుగా దాగున్న స్వభావాన్ని, అవే లక్షణాలు కలిగిన మరొకరు తెలుసుకోగలరా. ఒకవేళ ప్రయత్నించినా అది అంత సులభమా. ఇవన్నీ తనతో మాట్లాడలేను. తన కోసం ‘ఎన్సెఫలాటోస్ వూడి’ అనే చెట్టులాగా ఎదురుచూడటం తప్ప నాకు మరొక ప్రత్యామ్నాయం లేదు. మేము జంటగా కోల్పోతున్న ఈ క్షణం గురించి బాధ తప్ప మరో ఆలోచన లేదు. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమి తెలియకపోయినా.. -
యువ కథ: చినుకుల అలజడి
జయరాం, తనకు కాబోయే అల్లుడు ప్రవీణ్ పక్కనే నిలబడి మాట్లాడతా వుండాడు.‘రేయ్ చిన్నోడా, ఇప్పుడేలరా ఈ పెండ్లిసూపులు. ఒకేసారి లగ్నపత్రిక రాయించుకోని ఒచ్చేద్దామంటే ఇనవు’ ప్రవీణ్ నవ్వతా ‘నా కోసరం గాదు. నీ ముద్దుల కూతురు ఉంది కదా, ఆయమ్మ ఆగిత్యమే’ అన్నాడు. ‘చిన్నప్పట్నించి అనుకున్న సంబంధానికి మళ్లీ పెళ్లిచూపులేంట్రా. ఏంటో ఈకాలం పిల్లలు’ అన్నాడు.దూరంగా ఉండి ఈ మాటలన్నీ వింటోంది శిరీష. ప్రవీణ్ మాటలకి కోపమొచ్చేసింది ఆమెకు. కానీ అది సమయం సందర్భం కాదని ఏం మాట్లాడకుండా గమ్మునే ఉండిపోయింది.అరగంటలో పెండ్లిచూపుల కార్యక్రమం అంతా అయింది. వచ్చే మంగళవారం లగ్నపత్రిక రాయించుకొద్దాం అని రెండు కుటుంబాలు అనుకునేశాయి. ఇద్దరూ ఉండేది అదే ఊళ్లో. జరగాలి కాబట్టి జరిపించినట్టుగా ఉంది తంతు.‘ఎల్దాం పదండి’ అంటా అమ్మాయి తరుపువాళ్లు బయల్దేరతా ఉంటే శిరీష ‘మీరు బొండి, నాకు పవిగాడితో కాస్త పాతబాకీల ముచ్చట ఉంది. తేల్చుకొనొస్తా’ అనింది. శిరీషకు ఎప్పుడూ ఎవురూ అడ్డు జెప్పింది లేదు. అట్లే కానియ్యమని బయల్దేరి పోయినారు. ప్రవీణ్ మిద్దె మీద ఎండబెట్టిన మిరక్కాయలని గోతాంలో ఏస్తాన్నాడు. వానొస్తాదని నమ్మకమొచ్చేలా ఇంకోసారి ఎక్కడో పిడుగు పడిన శబ్దం వినపడింది. ఎండ కూడా తన పెగ్గి తగ్గించుకుంటాంది.‘అత్తా.. పవీ ఏడా’ అనడిగింది శిరీష నవ్వతా. అత్త కూడా నవ్వతా పైకి చూపెట్టింది. మూటగట్టిన మిరక్కాయల గోతాంని లోపలికేసి కిందకు దిగిన ప్రవీణ్ చెయ్యి కడుక్కుని తుడుచుకుందామని అట్టా ఇట్టా చూశ్నాడు. శిరీష అగుపడ్నాది. దగ్గరకెళ్ళి చీర కొంగు బట్కోని తుడుసుకోబోయినాడు, శిరీష వెంటనే వెనక్కి జరిగి – ‘రేయ్.. కొత్త చీరరా’ అనింది. ప్రవీణ్ రెండు చేతులూ ఏసేసరికి చేతుల తడి నడుముకు తగిలింది. శిరీష వెంటనే ప్రవీణ్‌ను ఎనక్కి తోసేసి, ‘మండుతాది వాయ్’ అనింది కోపంగా. ‘లాస్టు మూడు నెలలుగా నాకు మండినట్టా?’ అనేసి బాల్కనీ వైపుగా నడిచి అక్కడ అలానే కింద కూర్చుండిపోయినాడు. ‘అబ్బా .. మళ్ళీ మొదలు పెట్నావా?’ అంటూ పక్కనే ఒచ్చి కూర్చొనింది శిరీష.ప్రవీణ్ తలవంచుకున్నాడు. వోని గెడ్డం పట్టుకొని పైకి లేపింది. వోని కండ్లు ఎర్రగా నరాలు తేలేసి ఉన్నాయ్. ‘దీనికి ఎందుకురా పవీ ఏడవడం? ఏమన్నా అంటే ఇట్టా ఆడపిల్లలా ఏడుస్తావ్..’ అనేసి కండ్లు తుడిచింది శిరీష. ‘ఏం, ఆడపిండ్లోల్లే ఏడసాల్నా? మొగపిండ్లోల్లు యాడ్సకూడదు అని యాడైనా రాసుండాదా ఏం..?’ అన్నాడు ప్రవీణ్ కండ్లు తుడుసుకుంటా. శిరీష నవ్వి ‘సర్లే , మళ్ళీ ఏడుద్దువులే గానీ, ఈ మూడు నెలలు ఎట్లున్నావ్రా నాతో మాట్లాడకుండా, నన్ను సూడకుండా?’ అనింది. ‘అదేమంత కష్టం కాదులేమే, నువ్వే మళ్లీ పలకరిస్తావ్ అని నాకు దెల్సు. అందుకే ఆ నమ్మకంతోనే ఉన్నా’ అన్నాడు ప్రవీణ్. ‘ఉద్యోగం మానేశ్నావంట ? ఏంది కత?’ ప్రవీణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది.‘అక్కడ టౌన్లో ఉండబుద్ధి గాట్లేదు మే. ఆ ప్రైవేట్ స్కూల్లో టీచరు ఉద్యోగం నావల్ల కాదు ఇంక. ఈసారి డీఎస్సీ నోటిఫికేషన్ పడనియ్. అప్పటిదాకా నువ్వున్నావ్‌గా, ఏం చూస్కోవా నన్ను?’ ‘నేను చూసుకుంటాలే గానీ, ఈలోపు నీ చేయి కంట్రోల్లో లేకుంటే ఇరగ్గొట్టి పొయ్యిలో పెడతా.’‘మరెట్టాగే? ఇంకెన్నాళ్ళు ఇట్టా దూరంగా ఉండాల నీతో?’‘రేయ్ తిక్క సన్నాసీ.. వయసు శానా ఆట్లే ఆడమంటాది. కొన్నిదినాలు ఆగు, పెండ్లైపోనీ’అని గట్టిగా ఒక ముద్దిచ్చి ఆడ నుంచి ఇంటికి బోయింది శిరీష.మూడు నెలల క్రితం శిరీష ఇంటికి వెళ్లిన ప్రవీణ్ ఏకాంతం చూసి చనువు చూపించబోయాడు. లాగిపెట్టి కొట్టింది. పద్ధతి ప్రకారం ఉండకపోతే పెళ్లీగిళ్లీ జాన్తానై అంది. ‘అసలు మూడు నెలలు కనపడకుండా వినపడకుండా నిష్టగా ఉంటేనే పెళ్లి’ అంది. ఆ మాటను అంత పట్టింపుతో అనకపోయినా ప్రవీణ్ సీరియస్‌గా తీసుకున్నాడు. ఇద్దరి వైఖరిలో మార్పు గమనించి పెద్దవాళ్లు ఇది ఎటుపోయి ఎటొస్తుందోనని పెళ్లికి వేగం తెచ్చారు. అది కూడా జనం కోసం జరిపించాల్సిన ఒక తంతే. ప్రవీణ్, శిరీష మానసికంగా ఎప్పుడో భార్యాభర్తలు. ఆ రేతిరి మిద్దె మీద చాప ఏస్కొని అటూ ఇటూ దొర్లుతున్నాడు ప్రవీణ్. నిద్ర పట్టక కింద వీధిలో కొచ్చి సిగరెట్ వెలిగించినాడు. శిరీష గుర్తుకొచ్చి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. మొబైల్ చూస్కున్నాడు. గీత నుంచి మళ్ళీ మెసేజ్– ‘మేల్కొనే ఉన్నావా?’ అని. దాన్ని పట్టించుకోకుండా ‘డార్లింగ్’ అని ఉన్న నంబర్‌కి డయల్ చేశాడు.నిద్ర మత్తులో ఫోన్ ఎత్తినాది శిరీష. ‘ఏంది పవీ ఈ టైములో ఫోను’ ‘నిద్రపట్టట్లే మే’ ‘పడుకుంటే అదే వస్తాదిలే. పడుకో పవీ’ అంటూ ఫోన్ పెట్టేశ్నాది శిరీష. ఇంతలో గీత నుంచి మళ్ళీ మేసేజ్– ‘పడుకునేశ్నావా’ అని. ‘లేదు’ వెంటనే ఫోన్ రింగయ్యింది. గీత నుంచి ఫోన్.‘హలో’ అన్నాడు ప్రవీణ్. ‘ఏం చేస్తున్నావ్?’ ‘ఏం జెయ్యట్లా. నిద్రపట్టకపోతే అలా బయటకొచ్చినా’ ‘బయటికి అంటే మీ ఇంటి ముందుకా ?’‘అవును. అయినా యాడైతే నీకు తేడా ఏముందే, నువ్వుండేది బెంగుళూరులో గదా’‘రామాలయం వీధి వైపు నడుస్తున్నావా?’‘అవును. అంత కరెక్టుగా ఎట్టా జెప్పినావ్?’‘ఇంకొంచెం ముందుకి నడువు అలాగే’ అట్టాగే ముందుకి పోయిన ప్రవీణ్‌కి ఎదురుగా చెయ్యి ఊపుతూ ఎవరో కనబడ్డారు. ఈ టైంలో ఎవరా అని చూస్తే గీత! ‘ఒసేయ్, నువ్వేందే ఈడ ? బెంగుళూరు నుంచి ఎప్పుడొచ్చినావ్?’ అన్నాడు. ‘సాయంత్రం ఒచ్చినాన్లే గానీ, దా ఇక్కడ చలిగా ఉంది లోపలికెళ్దాం.’ ‘ఈ టైంలో ఎందుకులేమే, తెల్లార్నంక మాట్లాడుకుందాం’ అన్నాడు ప్రవీణ్. ‘అబ్బా, ఏంగాదు రా ప్రవీణ్’ అంటూ బలవంతంగా లోపలికి లాక్కెళ్ళింది గీత. ప్రవీణ్ ఇల్లంతా చూస్తూంటే ‘ఎవరూ లేరు. అందురూ పెండ్లికి ఎలబారిపోయినారు. నువ్వూ నేనే ఉండాం’ అనేసి సోఫాలో కూర్చునింది. బయట వర్షం మొదలైంది. మెల్లగా ఊపందుకుంది. ‘ఈ రేతిరికి వాన ఇంకా గెట్టిగా పడేట్టుగా ఉండాది మేయ్. ఇంకా పెరిగే లోపు నేను ఇంటికెళ్ళిపోతా’ అన్నాడు ప్రవీణ్.‘సర్లే ఎల్దువులే గానీ, కాసేపు ఉండు ప్రవీణ్’ అనింది. ప్రవీణ్ చేతిని తన చేతిలోకి తీసుకునింది. ప్రవీణ్ గుండె వేగం ఆ పిల్లకి కూడా తెలుస్తాంది.‘నువ్వంటే చిన్నప్పట్నుంచీ ఇష్టంరా ప్రవీణ్. కానీ నీకేమో ఆ శిరీష అంటే పిచ్చి. అందుకే ఎప్పుడూ జెప్పలా నీకు. కానీ నువ్వు కావాలి’ గీత కండ్లు మూసుకునింది. మొహాన్ని మొహానికి దగ్గిరగా తెచ్చాడు ప్రవీణ్. పెదాల మీద ముద్దు పెడతాడు అనుకునింది. అయితే ప్రవీణ్ నుదిటి మీద ముద్దు పెట్టాడు. ‘ఇట్టా చేయడం తప్పు మేయ్’అన్నాడు. వెంటనే కండ్లు తెరిచేశ్నాది గీత. ‘నా శిరీషకు నేను అన్యాయం చేయలేను. ఈ వయసులో మనందరికీ ఒకేలా ఉంటుంది. అదే మాట శిరీషతో అంటే– ఉంటుంది. నాకూ ఉంటుంది. కాని ఆగాలి కదా అని ఆగడం నేర్పింది. నీకూ అదే మాట చెప్తున్నా. వయసు ఆడించినట్టు మనం ఆడకూడదు’ అనేసి పైకి లేచాడు.‘అయితే రేతిరి దాని ఇంటికెల్నావ్, అయినా సరే ఇద్దరి మధ్యనా ఏం కాలేదు అంటావ్. అంతేనా ?’అవునన్నట్టు తలాడించాడు ప్రవీణ్. గీత ఏం మాట్లాడకుండా నిలబడింది. కండ్లు తుడుచుకొని, ‘నాదే తప్పు. మీ మధ్య దూరుండకూడదు. పెండ్లెప్పుడు అనుకుంటా ఉండారు?’ అనడిగింది.‘రెండు నెలల్లో. కానీ అంత దూరం మంచిది కాదనిపిస్తాంది’ అంటూ నవ్వినాడు ప్రవీణ్. గీత కూడా నవ్వింది. ‘సరే మేయ్ నేను పోతా’ అనేసి వానలోనే తడ్సుకుంటా ఇంటికి పోయి మిద్దె మీదకెల్నాడు ప్రవీణ్. అక్కడ చాప, దిండు రెండూ తడిసి ముద్దయిపోయున్నాయి. మరుసటి రోజు పొద్దున్నే శిరీష వొచ్చినాది. ఆరేసున్న బొంత, చాప, ఎండబెట్టిన దిండు అన్నిటినీ చూస్తూ నిలబడింది. ‘అయితే రేతిరి దాని ఇంటికెల్నావ్, అయినా సరే ఇద్దరి మధ్యనా ఏం కాలేదు అంటావ్. అంతేనా ?’అవునన్నట్టు తలాడించాడు ప్రవీణ్.‘ఇది. ఈ కంట్రోల్ ఉండాల్ననేరా మూడు నెలలు నన్ను కల్సొద్దు అని కండిషన్ బెట్టి కూర్సోబెట్టింది. కానీ నిన్ను నమ్మినా, ఈ వయసును నేను నమ్మలేను పవీ’ అంది. ‘మరేం చేద్దాం?’ అన్నాడు ప్రవీణ్. వారం తర్వాత ప్రవీణ్, శిరీషల పెండ్లి ఘనంగా జరిగింది.ఆ రేతిరి, దాదాపు ఒంటిగంట ప్రాంతంలో.. ‘ఏంది పవీ, ఇంకా ఒంటి గంట కూడా కాలేదు. అప్పుడే పడుకుంటే ఎట్టా?’‘అట్టా కాదు లెమ్మే, నాకు నిద్దొరస్తాంది’ అన్నాడు ప్రవీణ్. శిరీష నవ్వతా అనింది ‘నాకు రాట్లేదు’ -
యువ కథ.. లాయర్ నోటీస్
పేషంట్లు, నర్సులు, డాక్టర్లతో గైనిక్ వార్డంతా హడావిడిగా ఉంది. ఒక్కొక్కరి మొహంలో ఒక్కో భావం. కూతురి వైపు చూశాడు లాయర్ బ్రహ్మారెడ్డి. తల గోడకు ఆన్చి, నిద్ర పోతున్నట్టుగా ఉంది. ఆమెకిప్పుడు ఆరో నెల. తాత కాబోతున్న సంతోషం తొలి రెండు నెలలు మాత్రమే. మాటా మాటా పెరిగి, అల్లుడు చెయ్యి చేసుకున్నాడంట. నేరుగా ఇంటికి వచ్చింది కూతురు. కొత్త సంసారంలో చిన్న చిన్న మనస్పర్థలు మామూలే అనుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ అర్థమైంది సర్దుకునేంత చిన్నది కాదని.చూస్తుండగానే మూడు దాటి, నాలుగో నెల వచ్చింది. వీళ్లు చూస్తే పంతంబట్టినట్టు ఎవరి లోకంలో వాళ్లున్నారు. రేపేదైనా తేడా జరిగితే పుట్టబోయే బిడ్డ ప్రధాన సమస్య అవుతుందని ఎన్నో కేసులు వాదించిన అనుభవం మెదడు తడుతోంది.బిడ్డ పుడితే కలవకపోతారా అనే దింపుడు కల్లం ఆశ కూడా లేకపోలేదు. తీరా బిడ్డ పుట్టేక వాళ్లు రాకుంటే? కూతురు ఇంకో పెళ్లి వద్దంటే? కూతురు ఒప్పుకున్నా బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? చేసుకున్నా కూడా కూతురు జీవితం సంతోషంగా ఉంటుందా? ఇవన్నీ లేకుండా కడుపులో బిడ్డకు ఏదో ఒక అవయవ లోపముంది అని డాక్టరే అబార్షన్ సూచిస్తే మేలనిపిస్తోంది. వాళ్లు చెప్పకుండా మనమే ఆ మాట అడిగితే బాగుండదేమో.పొంతనలేని ఆలోచనలు ఎటెటో తరుముతున్నాయి. చుట్టూ చూశాడు. ఎంతకూ తరగడం లేదు జనాలు. తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. న్యూస్, వీడియోలు, కోర్టు కేసులు దేని మీదా ధ్యాస కుదరక బయటికి నడిచాడు. లోపల స్థలం సరిపోనోళ్లంతా మెట్ల మీద, గేటు దగ్గర ఎక్కడపడితే అక్కడ కూర్చున్నారు.ఇంతలో గలగలా మాట్లాడుతూ బయటికొచ్చింది ఒక గుంపు. నడి వయస్కురాలి చేతిలో బెడ్, మధ్యలో చిన్న ఆకారం. పాపో బాబో గానీ అందరి మొహాల్లోనూ మురిపెం తెలుస్తోంది. చూస్తేనే చెప్పొచ్చు అబ్బాయి తరపు వాళ్లని. ఇలాంటివి చూసినప్పుడే అల్లుడి నుంచి గానీ, వాళ్ల తల్లిదండ్రుల నుంచి గానీ కనీసం ఇందులో పది శాతం కూడా అమ్మాయి మీద ఆపేక్ష లేదే అని బాధపడిపోతాడు బ్రహ్మారెడ్డి. వీటన్నింటి మధ్యన మరింత కుంగదీసేది కూతురి మౌనం. జీవితమంతా అయిపోయిన దానిలా ఎప్పుడూ దిగాలేసుకుని ఉంటుంది. ఇప్పుడు దిగులుపడితే మాత్రం చెయ్యగలిగేదేముందీ..!ఏదో పెళ్లిలో అమ్మాయిని చూశారంట. బాగా నచ్చింది, రూపాయి కట్నం వద్దు అని తెలిసిన మనిషిని పంపించారు. ఒక జిల్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కోరి కోడలిగా చేసుకుంటాం అని ఇంటికొస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అబ్బాయి ఏ ఉద్యోగం చెయ్యకున్నా తండ్రి సంపాదించిన ఆస్తి దండిగా ఉంది. కూతురు భవిష్యత్తే కాదు, కలెక్టర్ వియ్యంకుడిగా సమాజంలో తనకెంత గౌరవం, పరపతి! అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇలా..! కూతురి పేరు అనౌన్స్మెంట్లో రావడంతో ఆలోచనలు ఆపి, లోపలికి నడిచాడు. ‘బేబీ గ్రోత్ బాగుంది. మదర్ కొంచెం వీక్‌గా ఉంది. హెల్దీ డైట్ మెయింటెయిన్ చెయ్యండి’ అంటూ జాగ్రత్తలు చెప్పింది డాక్టర్.రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అల్లుడు రాలేదు.‘డెలివరీ అయ్యాకైనా వస్తాడా రాడా?’ అంటూ బెదిరిపోతున్నాడు బ్రహ్మారెడ్డి. అమ్మాయికి నార్మల్ డెలివరీ కుదరక, సీరియస్ అయ్యి, సిజేరియన్ చేసినారని తెలిసినా కూడా రాలేదు. అల్లుడే కాదు, వాళ్ల తరపునుంచి ఒక్కరూ రాలేదు. తెలిసిన వాళ్ల చేత మాట్లాడించాడు. పెద్దవాళ్లు అదీ ఇదని ఏదో చెప్పబోయారంట గానీ ‘నాకే పుట్టిందని గ్యారెంటీ ఏముందీ’ అన్నట్టు అన్నాడంట అబ్బాయి. ఇదే మాట ఎదురుగా అని ఉండుంటే తల పగలగొట్టాలి అనేంత కోపం వచ్చింది. కూతురితో చెప్పలేదు. భార్యతో అంటే ‘వానికి లేని చెడ్డలవాట్లు లేవంట. ఆ విషయం వాళ్లమ్మా నాయనకు ముందే తెలిసినా పెళ్లి చేస్తే అయినా దారికొస్తాడని చేశారంట. కొత్తవాళ్లతో సంబంధం మంచిది గాదని చెప్తున్నా వినకుండా పెద్ద వాళ్ల సంబంధం అని దాని గొంతు కోశావు’ అన్నాళ్లూ లోపల దాచుకున్న ఆక్రోశమంతా బయటికి వెళ్లగక్కింది.ఏదో ఫంక్షన్లో స్నేహితుడు కలిస్తే జరిగిందంతా చెప్పాడు.‘ఇలాంటి కేసులు నీ సర్వీసులో ఎన్ని చూసుంటావు! అయినా ఈ కాలంలో ఎవర్రా విడాకులకు భయపడేది?’ అన్నాడు.నిజమే. లాయర్ బ్రహ్మారెడ్డి అమ్మాయి తరపున వకాల్తా పుచ్చుకున్నాడంటే అబ్బాయి వాళ్లు, అబ్బాయి తరపునైతే అమ్మాయి వాళ్లు తలలు పట్టుకుంటారు. కానీ ఇది స్వంత కూతురి విషయం. మధ్యవర్తిత్వం ద్వారా కొంత ప్రయత్నం చేశాడు. కుదరలేదు.‘అందరికీ విడాకులు ఇప్పించి ఇప్పించి వాళ్ల ఉసురు కొట్టుకుని కూతురి జీవితం ఇలా చేసుకున్నాడని తలా ఒక మాట అంటారని ఇన్నాళ్లూ రాజీ కోసం చూశాను. అది నా అసమర్థత అనుకుంటున్నారు’ అనుకుంటూ ఆఫీసుకెళ్లి గృహహింస కేసు, వారం తర్వాత మెయింటెనె¯Œ ్స కేసు ఫైల్ చేశాడు. ఈ రెండింట్లో వీలైనంత వరకూ విసిగించి, వాళ్లే విడాకులకు అప్లై చేసేలా చేస్తే భరణం అడగొచ్చు అనుకుంటే ఎన్నాళ్లు చూసినా కేసు హియరింగ్‌కి రాలేదు. పంపించిన నోటీసులు వెనక్కి వచ్చాయి. ఏమైందని కనుక్కుంటే ఇచ్చిన అడ్రస్‌లో వాళ్లు లేరన్నారంట. క్లైంట్ల కోసం తను వాడే పోస్ట్ మ్యాన్ మేనేజ్మెంట్ టెక్నిక్‌ను తిరిగి తన మీదకే ప్రయోగిస్తున్నారని అర్థమైంది లాయర్ బ్రహ్మారెడ్డికి.మరో నెల చూసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. అయితే అనుకున్నట్టుగా సాగడంలేదు. చిన్న చిన్న విషయాలకు కూడా వాయిదాలు అడుగుతున్న అవతలి లాయర్‌ను చొక్కా పట్టుకుని కొట్టాలన్నంత కసి. లాయర్ అంటే పోనీ చంటి బిడ్డను తీసుకుని కోర్టుకు వచ్చే నా కూతురి గురించి ఒకసారి ఆలోచిస్తే అర్థం కాదా ఆ జడ్జికి..! ఆమె కూడా మహిళే కదా. తీర్పు దగ్గరకొస్తోంది అనంగా పై కోర్టుకు అప్లై చేశారు. అక్కడా అదే సాగతీత. చేసేదేం లేదు చట్టంలో వెసులుబాటు అలాంటిది. ఇన్నాళ్లూ క్లైంట్ తరపున ఇవన్నీ చూస్తుంటే తనేదో విజయం సాధిస్తున్నట్టుగా అనిపించేది గానీ ఇప్పుడు తనే ఒక పిటిషనర్‌గా అవి అనుభవిస్తుంటే ఆక్రోశంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు. కానీ ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. కేసును అంత సులభంగా వదలనని బ్రహ్మారెడ్డికీ తెలుసు గానీ, వాళ్లకున్న పలుకుబడి, డబ్బుతో తీర్పును ఎక్కడ అనుకూలంగా మార్చుకుంటారోనని చిన్న సంశయం.అదే జరిగితే శ్రమ, సంపాదన, జీవితం గురించి కనీసం ఆలోచన కూడా చెయ్యని కూతురి భవిష్యత్ ఏంటో అర్థం కాలేదు అతనికి. ఆరోజు కోర్టు కేసులు ఏమీ లేకపోవడంతో టీవీ పెట్టుకుని, సోఫాలో పడుకున్నాడు.‘పాప బర్త్‌డేకి లంగా జాకెట్ కుట్టించమని చెప్పొస్తాం. చూస్తూ ఉండు నాన్నా’ అంటూ కూతురు, భార్య బయటికి వెళ్లారు.మనమరాలి వైపు చూశాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ నేల మీదనే నిద్రపోయినట్టుంది. ‘కేసు గెలుస్తామో, ఓడిపోతామో? భరణం వస్తుందో, రాదో? విడాకులైతే తీసుకోవాలి. తీసుకుంటుంది సరే, కానీ కూతురి భవిష్యత్..! పాపను వదిలెయ్యి అంటే కూతురు ఒప్పుకుంటుందా? ఎక్కడెక్కడి ఆలోచనలన్నీ పాప దగ్గరే ఆగుతున్నాయి. అసలు ఆ పాపే పుట్టకుండా ఉండుంటే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు కదా! ఆరోజే అబార్షన్ చేయించాల్సింది.. తప్పు చేశాను’ అనుకుంటూ నిద్రకు, మెలకువకు కాని స్థితిలో కళ్లు మూసుకున్నాడు.మెలకువ వచ్చి చూసేసరికి పాప అక్కడ లేదు. వరండాలో పారిజాతం చెట్టుకింద రాలిపడిన పూలతో ఆడుకుంటోంది. పక్కనే వాటర్ సంప్ ఉంది. కొంచెం కదిలినా అందులో పడిపోతుంది.పక్కకు తీసుకొద్దామా, వద్దా..! చుట్టూ చూశాడు. తనను ఎవరూ గమనించలేదు అని అర్థమైంది. ఇదే అవకాశం. డోరు చాటుకు నక్కి, కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడు. అయిదు నిమిషాలు గడిచాయి. పాప కదలకుండా కింద పడిన పూలన్నీ ఏరి కుప్పగా పోస్తోంది.‘పాప పడిందా, రెండే రెండు నిమిషాలు చాలు. గమనించకుండా నిద్రపోయినందుకు కూతురు నన్ను తిట్టుకుంటుంది, వారం పది రోజులు మహా అయితే ఓ నెల రోజులు బాధపడుతుంది. పడనీ తర్వాత మెల్లిగా మరిచిపోతుంది. నిదానంగా పెళ్లి చెయ్యొచ్చు. ఒకవేళ పాప నీళ్లల్లో పడిన శబ్దం పక్కింటోళ్లో, దారిలో పొయ్యే వాళ్లో ఎవరైనా గమనించారా మన దరిద్రం’ రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి ఒక్కసారిగా.గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్లంతా చెమటలు. పది నిమిషాలకు కదిలింది. చెయ్యి తీసి మరో చెయ్యి మారిస్తే చాలు పడబోతుంది అనంగా గేటు తీసిన శబ్దం. గట్టిగా కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చి పాపను ఎత్తుకుంది కూతురు. మొహానికి పట్టిన చెమట తుడుచుకుని, ఏం తెలియనట్టు వెళ్లి సోఫాలో పడుకున్నాడు.‘ఒక్క అడుగు ఆలస్యమైనింటే..!’ కేకలేస్తూ ఇంట్లోకి వచ్చింది భార్య. ఆ అరుపులకు మెలకువొచ్చినట్టు లేచి ‘ఏమైందీ’ అడిగాడు అమాయకంగా.మనమరాలి ప్రాణాపాయం నుంచి మొదలు కోర్టు కేసు, విడాకులు, అత్తగారింట్లో కూతురి కష్టాలు, పెళ్లి మొదలు మొగుడి చేతగానితనం వరకూ అన్నీ చదువుతూనే ఉంది సాయంత్రం వరకూ. ఎలా తప్పించుకోవాలి అనుకుంటుండగా ‘స్టేషన్‌కి కొత్త ఎస్సై వచ్చిందంట. వెళ్లి ఫార్మాలిటీగా కలిసొద్దాంరా’ అని లాయర్ ఫోన్ చెయ్యడంతో వెళ్లాడు.యంగ్ ఆఫీసర్. ట్రైనింగ్ తర్వాత తొలి పోస్టింగ్. అందరూ పరిచయం చేసుకున్నారు. అవీ ఇవీ మాట్లాడి, కదలబోతుండగా నేమ్ ప్లేట్ చూశాడు. ఈ పేరు ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ మొహం చూశాడు. గుర్తుకొచ్చింది. నాలుగేళ్ల కిందట తాను వాదనలు వినిపించిన విడాకుల కేసులో ఆ అమ్మాయి రెస్పాండెంట్.లాయర్ బ్రహ్మారెడ్డి మనసులోని భావం గ్రహించినట్టు నవ్విందామె. ఇంటికొచ్చాడు. తిని పడుకున్నా కూడా అదే నవ్వు వెంటాడుతోంది. నిద్రపట్టలేదు. ఆ అమ్మాయి కేసు కళ్ల ముందు మెదిలింది. తిరిగి చూస్తే ఇప్పుడు తన కూతురిదీ అదే పరిస్థితి. మనసులో ఎంత సంఘర్షణ అనుభవించేదో గానీ బయటికి మాత్రం నిండు కుండలా ఉండేది. అంత బాధనూ దిగమింగుకుని, పడిలేచిన కెరటంలా ఇప్పుడు ఎస్సైగా రావడం చూసి తల తీసేసినట్టుగా ఉంది. ఏదో అపరాధభావం.నెల రోజులు గడిచాయి. ఒకట్రెండు సార్లు కలిసే అవకాశం వచ్చినా కూడా ఎదురుపడే ధైర్యం లేక కలవలేదు. కూతురి కేసు వాయిదా ఉంటే కోర్టుకు వచ్చాడు. ఏదో కేసు అటెండ్ అవ్వడానికి కోర్టుకొచ్చి, టైమ్ ఉండడంతో జీప్‌లో కూర్చుని ఉంది ఎస్సై.‘నేను నీ కేసు విషయంలో బాగా ఇబ్బంది పెట్టాను. ఆరోజు అలా చెయ్యాల్సింది కాదు’ అంటూ బాధపడ్డాడు. అతని మాటల్లో తేడా తెలుస్తోంది.అంతా విని, ‘ఇన్నాళ్లకు తెలిసిందా లాయర్ బ్రహ్మారెడ్డి గారూ. నేను మగాన్ని ఏమైనా అంటాను, నువ్వు ఆడదానివి పడాలి అన్నట్టు బిహేవ్ చేసేవాడు. నా వల్ల కాలేదు. విడిపోదాం అనుకునేంతలో కడుపులో బిడ్డ. తెలిసో తెలియకో పెళ్లి చేసుకున్న పాపానికి పుట్టబోయే బిడ్డనెందుకు ఒంటరి చెయ్యడం అని సర్దుకుపోదామనుకున్న ప్రతిసారీ వాళ్లమ్మొక మాట, నాన్నొక మాట, అక్కొక మాట. ఎంతకాలం పడాలి? అసలెందుకు పడాలి? విడిపోతాం. ఎవరి బతుకు వారిది. మరి పాప పరిస్థితి? పాప భవిష్యత్ కోసం మెయింటెనె¯Œ ్స, భరణం అడిగితే చట్ట పరంగా ఒకపక్క, నా క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ మరోపక్క ఎంతలా వేధించారు. నీకూ ఒక కూతురుండి, తనకు ఇలా జరిగినా కూడా ఇలాగే చేస్తావా అని అడుగుదామని ఆరోజు మీ దగ్గరికి రాబోతుంటే అద్దాల చాటున మీరు చూసిన చూపు గుర్తుందా?’ అతని వైపు చూసింది.ఆమె కళ్లల్లోకి చూసే ధైర్యం చాలక పక్కకు చూస్తూ నిలబడ్డాడు.‘ఏదోకరోజు కాళ్ల బేరానికి రాకపోదా అని మీరనుకున్నారు. నేను నాలా బతుకుతున్నా’ జీప్ దిగి, క్యాప్ సర్దుకుంటూ కదిలిపోయింది.ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె నోటి నుంచి వచ్చిన ఒక్కొక్కమాట ఒక్కో సూదిలా గుచ్చుతున్నాయి. నిజమే. ఆ అమ్మాయికి సమస్య వస్తే సమస్యను సవాలు చేసి గెలిచింది. మరి నేను..? పాప మరణాన్ని కోరుకున్నాను. తన అల్పత్వానికి వణికిపొయ్యాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీళ్లు తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇంతకుముందు క్లైంట్లు, రెస్పాండెంట్లు కనపడేవాళ్లు. ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు. -
యువ కథ: మనసు రుచి
వైనతేయ గోదారి ఎర్రగా మారింది. గోదారికి పైన నల్లటి మేఘాలు తప్ప వర్షం లేకపోయినా పై నుంచి పడుతున్న వర్షాలకు కాబోలు రోజు రోజుకి నీరు పోటెత్తుతోంది. బోడసకుర్రు నుంచి పాశర్లపూడికి మధ్య వైనతేయ పాయ పోతూ ఉంటే దాని మీద ఒకటే పంట్ నడుస్తోంది. ఆరోజు అది కూడా రద్దయ్యింది. కారణం పొద్దున వచ్చిన వెంటనే బోడసకుర్రులో సూరన్న కాలం చేశాడు. బోడసకుర్రు రేవు దగ్గర గుమాస్తా ఉద్యోగం సూరన్నది. 70 ఏళ్లు వచ్చినా పని చెయ్యడం మానలేదు. పొద్దున్నే సాధు హోటల్లో రెండు రొట్టెలు ఫట్టు చట్నీ తినడం రేవుకి సైకిలు మీద బయలుదేరడం, టికెట్ కొట్టడం... ఆ రోజు జనాలు ఎక్కువ ఉంటారేమో అని ఫట్టు చట్నీని కాస్త ఎక్కువ చేశాడు సాధు. అప్పుడే తిని వెళ్లిన సూరన్న పోయాడన్న కబురొచ్చింది. సూరన్న పోగానే చుట్టాలకి, పక్కోళ్లకి కుబురు పెట్టాడు పెద్ద కొడుకు లక్ష్మన్న. హైదరాబాదులో ఉంటున్న చిన్న కొడుకు, ఇద్దరు కూతుళ్లు రావాలి. కాలంతో పాటు కదిలిపోయిన కుటుంబాలలో సూరన్న, సూరన్న పెద్ద కొడుకు మాత్రం బోడసకుర్రులోనే ఉండిపోయారు. అందులోను సూరన్నది మరీ చాదస్తం. పొద్దున్నే ఫిల్టర్ కాఫీ, సాధు టిఫిన్స్ పడాల్సిందే.సూరన్నని బయట పడుకోబెట్టారు. జనాలు ఒక్కొక్కళ్లే పోగయ్యారు. ‘పెద్దాయన కదండీ’ అన్నాడు ముత్యాల వెంకట రత్నం పెద్దోడు లక్ష్మన్నతో. ‘అవునండి మీ వయసే’ అన్నాడు ఏడుస్తూ పెద్దోడు. ‘ఇంతకీ అందరికీ కబురెట్టారా’ అన్నాడు ఊర్లో పెళ్లికి, చావుకి ముందుండి పనులు చూసుకునే యేసునాథం. ‘మహా గొప్ప ఇట్టమండి బాబా.. సూరన్నకి ఫట్టు చట్నీ అంటే’ అన్నాడు అక్కడే ఉన్న సాధు. ‘కాస్త ఆ చట్నీ తీసుకొచ్చి నోట్లో ఏసి చూడు లేచి కూర్చుంటాడేమో’ అన్నాడు యెటకారంగా యేసునాథం. ‘సావు దగ్గర పరాచకాలు ఏంటండీ బాబు’ అన్నాడు పక్కనే ఉన్న ముత్యాల వెంకట రత్నం. ‘మహా గొప్పగా పోయాడయ్యా సూరన్న ..’ అన్నాడు సాధు. ‘మరే.. నీ చట్నీ తిని పోయాడు. తులసి తీర్థంలా పడి ఉంటాది’ అన్నాడు యేసునాథం. సూరన్న బంధు వర్గం పెద్దది. మంచి చెడ్డలతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికీ వెళ్లేవాడు. అంచేత ఆయన్ని చూడటానికి కూడా చాలా మంది జనం వచ్చారు. వచ్చినోళ్లందరికీ టిఫినీలు, కాఫీలు చూసుకోమని సాధుకి అప్పచెప్పాడు పెద్దోడు. అంతమంది జనాల్ని చూసిన సాధు ‘ఇంతమందికి రొట్టెలేత్తే రేపు నా పాడే ఎత్తాలి’ అన్నాడు. ‘చావు ఇంట్లో టిఫినీలు పెట్టడమే. శవం లేచే దాకా ఏం తినకూడదు. అందులోను మేము సూరన్న వేలు విడిచిన చుట్టాలాయె’ అంది సూరన్న వేలు విడిచిన మేనత్త గారి తోడికోడలు. ‘మీరు తినద్దు లెండి. యేలు యిడిచిన చుట్టాలు గందా. యిడవనోళ్లు ఉంటారు ఆల్లు తింటారు. అందులోను మా సాధు ఫట్టు చట్నీ అంటే నాకేత్తారు. మీరు తినకపోతే కలిసొత్తాది’ అన్నాడు యేసునాథం. టిఫినీలు పెడతన్నా కూడా సూరన్న పోయాడన్న బాధ మనసులో తొలిచేస్తోంది సాధుకి. అయినా సరే పిల్లా జెల్లా అందరికీ ఇడ్డెనులు వడ్డించేశాడు. ‘డబ్బులు లెక్కట్టుకో మరి’ అని సూరన్న బంధువొకడు అంటే ‘ఇలాటి సోట నాకు లెక్కలు రావు బాబా’ అని నింపాదిగా తన పని చేసుకుంటూ పోయాడు.మొహం ఎర్రబడ్డ సాధుని చూసి ‘పుసుక్కున అనేశాడులేరా. నేను లెంపలేయిత్తాను లే’ అన్నాడు యేసునాథం. సాయంత్రానికి సూరన్న కొడుకు, కూతుళ్లు కన్నీళ్లతో దిగితే .. మనవళ్లు మాత్రం లాప్‌టాప్‌లు వేసుకుని దిగారు. తర్వాత రోజు కార్యక్రమాలు. ఈసారి పెద్దోడు చెప్పకుండానే అందరికీ టిఫినీలు తెచ్చేశాడు సాధు– కష్టమైనా దోరగా అందరికీ రొట్టెలు కాల్చి. అలాగే ఇడ్డెనులు కూడా పట్టుకొచ్చేశాడు పెద్ద ఆటోలో. మండువా ఇంట్లో పొద్దు ఎండ పడుతుండగా లాప్టాప్ నొక్కుతున్నాడు సూరన్న రెండో కూతురు రెండో వాడు. సాధు రెండు రొట్టెలు పట్టుకొచ్చి ‘ఈ రెండు తినెయ్యండి’ అన్నాడు. ‘సాధు.. బాగున్నావా’ అని అడిగాడు. ‘చాలా పెద్దోడు అయిపోయేరు. సాలా సిన్నప్పుడు సూసాను’‘చట్నీ ఏం మారలేదు సాధు’ అన్నాడు. చిన్నగా నవ్వి ‘నేను మారలేదులెండి. ఇది యేటి బాబు’ అని అడగ్గానే ‘నేను చేసే పని సాధు. ఇంతకి ఇవ్వాళ హోటల్ వదిలి వచ్చేశావా’ ‘అంతే కదా బాబు. మనిషిని మించిన పనులేముంటాయ్ సెప్పండి. నా సేత అయ్యింది సేద్దామని వచ్చాను సేత్తన్నాను’లాప్టాప్ మూసేసి విస్తరిలో ఇచ్చిన రొట్టెలను మూడు గరిటెల చట్నీతో గబాగబా తిని, పోయి తాత దగ్గర కూర్చున్నాడు. ‘ఆకుని కూడా వదలలేదు. ఏం చట్నీ నో ఏమో’ అని విసుక్కుంది సూరన్న వేలు విడిచిన మేనత్త గారి తోడికోడలు. ‘సూరన్న గారికి కూడా చాలా ఇట్టం అండి సాధు ఫట్టు చట్నీ అంటే. ఊరంతా కూడా ఇట్టం అనుకోండి’ అన్నాడు టీలు ఇస్తూ ఇరటం రాంబాబు. ‘అబ్బో గొప్పే.., నేను చేసిన చట్నీలకు ఈ ఆకులు కూడా మిగలవు’‘అంటే మీరొండినవి కాకుండా ఆకులు తినేత్తారా అండి’ అల్లం వేసిన టీ ఆమెకు అందిస్తూ. ‘మీ ఊరంతా యెటకారమేరా. ఎప్పుడు ఎవరు తిన్నంగా సమాధానం చెప్పరు’‘మా ఊరెంట గోదారి యెళ్తాది అండి. అది కూడా అంతేనండీ తిన్నంగా యెల్లదు’‘ఊరుకోరా ఇరటం పెద్దావిడతో’ అన్నాడు సాధు టిఫినీలు అందిస్తూ. సూరన్న వేలు విడిచిన మేనత్తగారి తోడికోడలు మనవరాలికి ఆకలంటే ఆవిడ సాధుని పిలిచి ‘టిఫిన్స్ ఏం తెచ్చావురా’‘సావు ఇంట టిఫినీలే ..’ అన్నాడు రాంబాబు. ‘నువ్వు ఊరుకోరా. రొట్టెలు అయిపోయాయ్ అమ్మా. ఇడ్డెనులు ఉన్నాయి’ ‘అరే .. నా మనవరాలు ఇడ్డెన్లు తినదే’ ‘మీరు తాపీగా టీ తాగుతూ కూర్చోండి. నే పెట్టేత్తాను’ అని ఒక అరిటాకు కోసుకొచ్చి కడిగి చిన్న ముక్క కింద కోసి వేడి వేడి మూడు ఇడ్డెన్లు వేసి ఫట్టు చట్నీ వేశాడు. మారాం చేస్తున్న పిల్లని బుజ్జగించి ఒక వేలుడు చట్నీని నాకించగానే తింటానంది. చిన్న ఇడ్లీని ఎక్కువ చట్నీలో ముంచి పెడితే మొత్తం కానిచ్చేసింది. అది చూసి ఆశ్చర్యపోయిన ఆవిడ ‘మా సూరన్న చెప్తుంటే ఏదో అనుకున్నాను’ అని అదే అరిటాకులో ఇంకో నాలుగు ఇడ్డెన్లు వేయించుకుని .. ఐదు గరిటెల చట్నీతో ముగించింది.చేతి నిండా ఉన్న చట్నీని నాకుతూ ‘నీ చట్నీలో ఏదో మహత్యం ఉందయ్యా. కాస్త చెప్పరాదు’‘సావు ఇంట రుచుల గురించి మాట్టాడడమే’ అన్నాడు నవ్వుతూ అప్పుడే వచ్చిన యేసునాథం. ‘మహత్యం ఏముంది అండి. నలుగురు మెచ్చేలా ఉండాలనుకుంటాను అంతే’ అన్నాడు సాధు. ‘పెహిడెంటు గారొచ్చేత్తన్నారండోయ్’ అని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు వార్డ్ మెంబెర్ వరాలి మొగుడు వెంకట్రావ్ . ‘పెహిడెంటు గారే.. ఆయనకు సెంటిమెంట్లు గందా’ అన్నాడు యేసునాథం. ‘ఆయనే కాదండి మాజీ పెహిడెంటు గారు కూడా వచ్చేత్తన్నారు’‘ఒకే ఒరలో రెండేసి కత్తులు .. సూరన్న మీద ప్రేమే’ ‘అంటే ఒక్కోసారి ఎండా వాన ఒకేసారి ఒత్తాయి కదా అండి’ అన్నాడు వరాలి మొగుడు వెంకట్రావ్ .‘మనిసి బతికుండగా ఎవరూ మాట్టాడరండి. పోయాక అదేమంటారు.. సూక్తి వాక్యాలు చెప్తారు ఆయన గురించి’ అన్నాడు సాధు వెంకట్రావ్కి టిఫిన్స్ అందిస్తూ. ‘నేనలా కాదండోయ్ యేసునాథం గారు .. మిమ్మల్ని, సాధుని పలకరిత్తున్నానా. పోయాక మీ గురించి సుత్తి వాక్యాలు చెప్పకుండా ఉంటానా’‘అది సూక్తి .. సుత్తి కాదు వరాలు మొగుడోయ్’ అన్నాడు యేసునాథం. వచ్చిన ప్రెసిడెంట్ గారు వాళ్లు సూరన్న గణాన్ని పరామర్శించి నేరుగా సాధు టిఫిన్లు తీనేసి వెళ్లిపోయారు.ఆ రోజు కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఆ తర్వాతి పది రోజులు సాధు హోటలు నడపడం ఆపై సూరన్న ఇంటికి వచ్చి సాయం చెయ్యడం ఇలా సాగిపోయింది . సూరన్న బంధుగణం సాధు హోటల్ చట్నీ రుచి మరిగారు. రొట్టె ఒకటి ఐదు రూపాయిలు ఎంత తిన్నా తక్కువే. మరి ఇంత తక్కువ రేటా అని ఆశ్చర్యపోయేవారు. అలా అని రూపాయి ఎక్కువ తీసుకునేవాడు కాదు. కొంతమంది హైదరాబాదు వచ్చేసి వ్యాపారం పెట్టుమని ఈ టిఫినీకి బోళ్లు లాభం అని చెప్పేవారు. సాధు చిన్నగా నవ్వి ఊరుకునేవాడు .ఇదంతా గమనిస్తున్న సూరన్న రెండో కూతురి కొడుకు వైకుంఠ సమారాధన అయిపోయిన తర్వాతి రోజు తెల్లారకుండానే సాధు హోటలుకి వెళ్లి కూర్చున్నాడు.‘అప్పుడే వచ్చేశారేటండి. టిఫినీకి చాలా టైమ్ పడతాది’ అన్నాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన సాధు. ‘నువ్వు చట్నీ ఎలా చేస్తావో చూద్దాం అని’ అన్నాడు. ‘కూర్చోండి అయితే’ అని. దేవుడికి దండం పెట్టి లేత కొబ్బరి కాయని తెచ్చి మెత్తగా కోరి పక్కన పెట్టుకున్నాడు. ‘ఫట్టు చట్నీ అంటే ఏంటి సాధు’ ‘ఈ యేలప్పుడు నేను కూర్చుని శ్రద్ధగా చేత్తానండి. ఇది ఎంత చేసినా ఒక్కోసారి ఎనిమిదింటికల్లా అయిపోతాది. అప్పుడు రెండోది చేస్తాను. అదేటో మరి ఫట్టు చట్నీకి ఉన్నంత రుచి రెండో దానికి రాదంటారు. నిజానికి రెండూ ఒకటే’ మాట్లాడుతూనే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలని, కరివేపాకుని, కొత్తిమీరని చెక్కులా తరిగి పక్కన పెట్టుకున్నాడు.‘ఫట్టు చట్నీ అంటే ఫస్ట్ చట్నీ యా’ అనుకుని నవ్వుకున్నాడు తనలో తానే. సాధు కొబ్బరాకు మట్టలు అన్నీ పొయ్యిలోకి పెట్టి మండించి తరిగిన సామాన్లతో పాటు పోపేసి నీళ్లు మరిగించాడు. ఇంక మరుగుతున్న నీళ్లలో శనగపిండి వేసి మరిగాక కొబ్బరి అందులో వేశాడు. అంతే .. వేడిగా కాలిన పెద్ద పెనం మీద పల్చని మినప రొట్టెను వేశాడు.‘సాధూ రొట్టెకి ఐదు రూపాయిలు ఏం మిగుల్తుందయ్యా’ ‘ఏదో మిగులుతుందని ఏదైనా చెయ్యాలి అంటారా. మొన్నటి దాకా 2 రూపాయిలు ఉండేది ..ఊర్లో వాళ్లు కిట్టదని 5 రూపాయిలు చేశారు’‘కొనేవాళ్లు పెంచారన్నమాట. రేపు సరుకుల రేట్లు అవీ ఇంకా పెరిగితే’ఇదిగోండి అని వేడి రొట్టెని చట్నీకి కలిపి ఇచ్చి ‘ఈ రోజు ఉండగా రేపటి గురించి ఎందుకు బాబా! అయిపోయిన నిన్నటి గురించి ఎందుకయ్యా! నచ్చిన పనిని నచ్చిన మనషుల మధ్య ఇట్టంగా చేస్తూ పోతే చాలదా’ అన్నాడు. చట్నీ అదే రుచి. ఆనందంతో డబ్బులు ఎక్కువ ఇస్తుంటే ‘కంటి నిండా నిద్ర, కడుపు నిండా కూడు, అత్యాశ లేని జీవితం, నవ్వుతూ మాట్టాడే మనుషులు .. మాకు ఇవి చాలండి. అందులోను నాకు లెక్కలు రావండి’ అన్నాడు డబ్బులు తీసుకోకుండా. ఆ తర్వాత ఆ కుర్రాడు హైదరాబాద్ వచ్చి సాధు ఎలా చేశాడో అలానే చేస్తే దాని రుచి పడలేదు. నోట్లో వేసి ఊసేశాడు. సాధు ఫట్టు చట్నీ రుచి ఏ చీకు చింతా లేకుండా ఇష్టంగా చేసే సాధు చేతిది.. దానిలో పడ్డ సామాల్ది కాదు. చేతి నిండా ఉన్న చట్నీని నాకుతూ ‘నీ చట్నీలో ఏదో మహత్యం ఉందయ్యా. కాస్త చెప్పరాదు’‘సావు ఇంట రుచుల గురించి మాట్టాడడమే’ అన్నాడు నవ్వుతూ అప్పుడే వచ్చిన యేసునాథం. -
వాస్తవ సంఘటనలతో...
శీను కార్పెంటర్ దర్శకత్వంలో, కిశోర్ పాలకుర్తి నిర్మిస్తున్న ‘యువకథ’ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీయం రాజయ్య కెమెరా స్విచాన్ చేయగా, రచయిత గోరటి వెంకన్న క్లాప్ ఇచ్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే ఈ సినిమా... నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుందనీ, మూడు షెడ్యూళ్లలో సినిమాను పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు.