
జంతు సంరక్షణ సామాజిక బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జంతువుల సంరక్షణ సామాజిక బాధ్యతని, జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన జంతువులపై క్రూరత్వ నివారణ జిల్లా సొసైటీ (డీఎస్‌పీసీఏ) సర్వసభ్య సమావేశం బుధవారం వర్చువల్‌గా జరిగింది. తొలుత జిల్లా సొసైటీలో ప్రగతిశీల రైతులు ఎ.శ్రీపద్మ, వి.రవికుమార్ సభ్యత్వానికి సమావేశం ఆమోదం తెలిపింది. అనంతరం జిల్లా పరిధిలో జంతు సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, వేసవి కార్యాచరణ, వీధి కుక్కలు – జనన నియంత్రణ కార్యక్రమం అమలు, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ తదితరాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లా సొసైటీ సభ్యుల సమష్టి కృషితో జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం పటిష్ట అమలుకు కృషి చేస్తున్నామన్నారు. విజయవాడ నుంచి 10 నుచి 15 కిలో మీటర్ల లోపు జిల్లా ఎస్‌పీసీఏ యానిమల్ షెల్టర్ (గోశాల) ఏర్పాటుకు ఎకరా స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహాయంతో అన్ని ఆవాసాల్లోనూ నీటి తొట్టెల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు అవసరమైతే యుద్ధప్రాతిపదికన చేసి, వినియోగంలోకి తీసుకురావాలని పంచాయతీరాజ్, డ్వామా, పశు సంవర్ధక శాఖల అధికారులను ఆదేశించారు. భారత జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యూబీఐ) మార్గదర్శకాలు, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్–2023 ప్రకారం జిల్లాలో వీధి కుక్కల సంతాన నియంత్రణ కార్యక్రమాన్ని (యానిమల్ బర్త్ కంట్రోల్–ఏబీసీ) అమలుచేస్తున్నట్లు తెలిపారు. నెలకు సగటున 1100 ఏబీసీ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 211 కెన్నెళ్లు అందుబాటులో ఉన్నాయని, మరో 100 కెన్నెళ్ల నిర్మాణం పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జంతు సంరక్షణపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలను కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీపీఓ పి.లావణ్య కుమారి, డీఈఓ యు.వి.సుబ్బారావు, నాన్ అఫీషియల్ వైస్ ప్రెసిడెంట్ పాకూరి బాలకృష్ణ, సొసైటీ సభ్యులు గోవింద సాబూ, ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్‌పీసీఏ సర్వసభ్య సమావేశంలో
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ