
తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్ల హవా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేసేందుకే బాలీవుడ్ యాక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తొలిసారిగా తెలుగు తెరపై విలన్‌గా కనిపించనున్న కొందరు బాలీవుడ్ యాక్టర్స్, వారు ఓకే చేసిన సినిమాలు వివరాలు ఇలా ఉన్నాయి.
మల్టీ మిలియనీర్
‘నీర్జా, పద్మావత్, సంజు, గంగుభాయి కతియావాడి’ వంటి చిత్రాలతో నటుడిగా బాలీవుడ్‌లో నిరూపించుకున్నారు జిమ్ సర్భ్. ఈ నటుడికి టాలీవుడ్ ఎంట్రీ చాన్స్ లభించింది. నాగార్జున–ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ మల్టీ మిలియనీర్ పాత్రను జిమ్ సర్భ్ చేస్తున్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హైప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ భిక్షగాడిగా కనిపిస్తారని, ఓ ఆఫీసర్‌గా నాగార్జున, మల్టీ మిలియనీర్ పాత్రలో జిమ్ సర్భ్ కనిపిస్తారని తెలిసింది. ఓ బలమైన సామాజిక అంశం, డబ్బు ప్రధానాంశాలుగా ‘కుబేర’ కథనం సాగుతుందని సమాచారం.
ఇటు ఓజీ... అటు జీ2
‘మర్డర్, గ్యాంగ్‌స్టర్, ముంబై సాగ, టైగర్ 3, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇమ్రాన్ హష్మి గురించి తెలుగు ఆడియన్స్‌కు తెలిసిందే. ఈ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఖరారైంది. ప్రజెంట్ రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మి. పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ – ప్రచారంలో ఉన్న టైటిల్)లో ఇమ్రాన్ హష్మీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓమి భావ్ అనే పాత్రలో హష్మి కనిపించనున్నట్లుగా తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ΄్లాన్ చేస్తోంది. మరోవైపు అడివి శేష్ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. కాగా ‘జీ 2’ సినిమా షూటింగ్‌లో ఆల్రెడీ ఇమ్రాన్ హష్మీ జాయిన్ అయ్యారు. గత ఏడాది అక్టోబరులో ‘జీ 2’ కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఇమ్రాన్ గాయపడ్డారు. కానీ ఆ తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘జీ 2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తూ, డబుల్ విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇమ్రాన్ హష్మి.
ఇన్‌స్పెక్టర్ స్వామి
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం విజయ్ సేతుపతి ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘రైఫిల్ క్లబ్’ వంటి చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అనురాగ్ కశ్యప్ యాక్టర్‌గా తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని కొందరు తెలుగు ఆడియన్స్ ఆశపడ్డారు. వారి ఆశ నిజమైంది. అడివి శేష్ హీరోగా ‘డెకాయిట్: ఓ ప్రేమకథ’ అనే సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఇన్‌స్పెక్టర్ స్వామి అనే కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ఉంటుందని తెలిసింది. కథ రీత్యా... ఇద్దరు ప్రేమికులు బ్రేకప్ చెప్పుకుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారికి ఇష్టం లేకపోయినా... వీరిద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి ఉంటుంది.
ఈ క్రైమ్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత ఇన్‌స్పెక్టర్ స్వామిది. మరి... క్రిమినల్స్ అయిన ఈ ప్రేమికులను పోలీసాఫీసర్‌గా ఇన్‌స్పెక్టర్ స్వామి పట్టుకున్నాడా? అనేది ‘డెకాయిట్’ సినిమా చూసి తెలుసుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగం వంటి అంశాల మేళవింపుతో రూపొందుతున్న ‘డెకాయిట్’ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు నటుడిగానే కాదు... ‘పాంచ్, బాంబే టాకీస్, అగ్లీ, మ్యాడ్లీ, దో బార’ వంటి హిందీ చిత్రాలతో అనురాగ్ కశ్యప్ బాలీవుడ్‌లో దర్శకుడిగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగానూ, రైటర్‌గానూ ఆయన రాణిస్తున్న విషయం కూడా విదితమే.
అర్జున్‌కు విలన్‌గా...
స్క్రీన్‌పై నందమూరి కల్యాణ్‌రామ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు విజయశాంతి. ఇక ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు సోహైల్ ఖాన్. ‘పార్ట్‌నర్, వీర్, దబాంగ్ 3’ వంటి చిత్రాల్లో నటుడిగా అభినందనలు అందుకున్న సోహైల్ ఖాన్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాకీ పార్టు పూర్తయింది.
రామ్‌చరణ్‌కు విలన్‌గా...
రామ్‌చరణ్‌కు విలన్‌గా కనిపించనున్నారు బాలీవుడ్ యంగ్ హీరో దివ్యేందు. హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలోప్రారంభం కానుందని తెలిసింది.
కాగా ఈ మల్టీ స్పోర్ట్స్ (క్రికెట్, కుస్తీ తదితర క్రీడలు) డ్రామాలో దివ్యేందు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ దివ్యేందు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు విలన్‌గా కనిపిస్తారట దివ్యేందు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావొచ్చని, దీపావళికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందనీ సమాచారం.
మరోవైపు ‘ప్యార్‌కా పంచనామా, టాయిలెట్: ఏక్ ప్రేమకథ, ఓల్డ్ కపుల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటుడిగా రాణించారు దివ్యేందు. కాగా ‘మిర్జాపూర్, సాల్ట్ సిటీ, ది రైల్వే మెన్’ వంటి వెబ్ సిరీస్‌లతో దివ్యేందు మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు.
కొందరు బాలీవుడ్ యాక్టర్స్ ఆల్రెడీ తెలుగులో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా చేసిన ‘భగవంత్ సింగ్ కేసరి’లో అర్జున్ రామ్‌పాల్, ‘డాకు మహారాజ్’లో బాబీ డియోల్ విలన్స్‌గా నటించారు. కాగా పవన్ కల్యాణ్ ‘హరిహరవీర మల్లు’ చిత్రంలో ఎంతో కీలకమైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర 2’ చిత్రంలోనూ బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.
గత ఏడాది విడుదలైన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేశారు సంజయ్ దత్. ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాల్లోనూ లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలిసింది. అలాగే ప్రభాస్ ‘ఫౌజి’ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లీడ్ యాక్టర్స్‌గా చేస్తున్నారు.
నాగార్జున–నానీల ‘దేవదాసు’ (2018)లో విలన్‌గా యాక్ట్ చేసిన కునాల్ కపూర్ ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో మళ్లీ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్ ‘కల్కి’లో అమితాబ్ బచ్చన్ ఎంతటి బలమైన రోల్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కల్కి 2’లోనూ అమితాబ్ బచ్చన్ రోల్ కొనసాగుతుందని తెలిసిందే...
ఇలా విలన్స్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ మరికొందరు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు