
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మృతి కేసులో రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదు. తను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వెల్లడించింది. ఈ మేరకు కేసును క్లోజ్ చేసింది. దీంతో ఐదేళ్లుగా నిందలు మోస్తూ ఒంటరి పోరాటం చేస్తున్న రియా చక్రవర్తికి ఎట్టకేలకు ఉపశమనం లభించినట్లయింది.
సుశాంత్ మృతి.. మాజీ ప్రేయసిపై ట్రోలింగ్
సుశాంత్ సింగ్ 2020లో జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన మృతి వెనక కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) కూడా అందులో భాగమై ఉండొచ్చన్న ప్రచారం జరిగింది. దీంతో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. తనను ఈసడించుకున్నారు. ఒక విలన్‌గా చూశారు. దీని పర్యవసానంగా సినిమా అవకాశాలకు ఫుల్‌స్టాప్ పడింది. అరెస్టు, జైలు జీవితం, విచారణతో రియా మానసికంగా కుంగిపోయింది.

కేసులో నిర్దోషిగా తేలిన నటి
తాను తప్పు చేయలేదన్న మాటను ఎవరూ లెక్కచేయలేదు. తప్పంతా నీదేనని నోరు నొక్కేశారు. ఎంతో భవిష్యత్తున్న హీరో ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యావని అభాండాలు వేశారు. గుండె నిండా బాధను మోస్తూనే ఒంటరిగా పోరాడింది.. చివరకు కేసులో నిర్దోషిగా తేలింది. ఐదేళ్లుగా రియా అనుభవించిన బాధని, పోరాటాన్ని గుర్తు చేస్తూ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
నిజం ఎంతోకాలం దాగదు
రియా చక్రవర్తికి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ వచ్చింది. ఇలాంటి రోజొకటి వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే నిజం ఎంతోకాలం దాగదు.. కాస్త ఆలస్యమైనా సరే బయటకు రాక తప్పదు. రియా, ఆమె కుటుంబం.. భరించలేని బాధను అనుభవించింది. సమాజం మిమ్మల్ని తప్పని నిందిస్తుంటే, మీతో రాక్షసంగా ప్రవర్తిస్తుంటే మీరు పోరాడిన విధానం ఆదర్శవంతం. మిమ్మల్ని అవమానించారు, చీల్చి చెండాడారు. అయినా ఎంతో హుందాగా నిలబడ్డారు.
క్షమాపణలు చెప్పండి: మంచు లక్ష్మి
నిజానిజాలు తెలుసుకోకుండా మీపై నోరు పారేసుకున్నవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. అన్యాయంగా ఒక కుటుంబాన్ని ఎంత బాధపెట్టారో గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడాలి. రియా.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీకు మరింత శక్తి చేకూరాలి. ఇది ఒక ఆరంభం మాత్రమే.. ఇకపై అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుభవిస్తున్న బాధ ఇప్పటికైనా తగ్గుతుందని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది. దీనికి #Justice, #TruthWins, #RheaChakraborty అన్న హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చింది.

చదవండి: 'ఖుషి' ఫ్లాప్ అయితే నేను బతికేవాడిని కాదు: ఎస్‌జే సూర్య