
వైద్య వృత్తికి ప్రత్యేక గుర్తింపు
నల్లగొండ టూటౌన్ : దేశంలో ఏ రంగంలో రాని గుర్తింపు కేవలం ఒక వైద్యవృత్తిలో మాత్రమే లభిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎస్‌ఎల్‌బీసీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆవరణలో గురువారం రాత్రి నిర్వహించిన 2019–25 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డేలో ఆయన ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న యువ డాక్టర్లు.. పీజీ పూర్తి చేసిన తర్వాత నల్లగొండ గడ్డ మీద ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆకాక్షించారు. అత్యవసర సమయంలో ప్రజలు తలుచుకునేది వైద్యులను మాత్రమేని.. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని కోరారు. ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ సర్వీస్‌ల్లో చేరి రోగులకు వైద్యం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైద్య, విద్యా రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆరోగ్యశ్రీ కింద వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. వివిద రాష్ట్రాల నుంచి వచ్చి ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కడ వైద్యం అందించినా నల్లగొండ గడ్డకు పేరు తీసుకురావాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రోగులకు వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకుంటేనే వైద్యులకు కూడా తృప్తి ఉంటుందన్నారు. విదేశాల్లో పైచదువులు చదివినా తిరిగి దేశానికి, నల్లగొండ ప్రాంతానికి వచ్చి పని చేయాలని కోరారు. ఏ డిపార్టుమెంట్‌లో పని ఆలస్యం జరిగినా ఇబ్బంది అంతగా ఉండదని, వైద్యంలో మాత్రం అప్పటికప్పుడే స్పందించి వైద్యం అందిస్తేనే రోగులకు మేలు చేకూరుతుందన్నారు. అనంతరం ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న 142 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపాల్ రామచంద్ర, సూపరింటెండెంట్ అరుణకుమారి, ప్రొఫెసర్లు శివకుమార్, రాజేంద్రకుమార్, స్వరూపరాణి, బద్రీనారాయణ, రాధాకృష్ణ, పుష్ప, వందన, ఉషశ్రీ, యామిని, అయేషా పాల్గొన్నారు.
ఫ యువ డాక్టర్లంతా పేదలకు
సేవలందించాలి
ఫ ఎవరైనా ఆపదలో
తలుచుకునేది వైద్యులనే..
ఫ పీజీ పూర్తి చేసిన తర్వాత
నల్లగొండ ప్రజలకు సేవ చేయాలి
ఫ మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

వైద్య వృత్తికి ప్రత్యేక గుర్తింపు

వైద్య వృత్తికి ప్రత్యేక గుర్తింపు