
మీసేవ కేంద్రాల్లో సర్వర్ డౌన్
రామగిరి(నల్లగొండ) : నిరుద్యోగులైన యువతకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు సర్వర్ సహకరించడం లేదు. ఈ నెల 14 తేదీ చివరి గడువు కావడంతో.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినా ఆ తర్వాత నేరుగా ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తులను సమర్పించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డుతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఆమోదించిన తర్వాత సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఇప్పుడు రెండవ శనివారం, ఆదివారం, సోమవారం (అంబేద్కర్ జయంతి) సెలవు దినాలు కావడంతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుకు శుక్రవారం మాత్రమే గడువు ఉందని కానీ, మీ సేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ సమస్య వచ్చింది. దీంతో శుక్రవారం జనం మీ సేవ కేంద్రాల వద్ద బారులుదీరారు. సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకున్నా.. తహసీల్దార్ కార్యాలయ సమయం ముగియడంతో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో గందరగోళం ఏర్పడింది.
ఫ రాజీవ్ యువ వికాసం పథకం
దరఖాస్తులకు తప్పని ఇబ్బందులు
సెలవు దినాల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తాం : కలెక్టర్
నల్లగొండ : ప్రభుత్వ సెలవు దినాల్లోనూ రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు ప్రభుత్వం ఈనెల 14 చివరి తేదీగా నిర్ణయించిందని తెలిపారు. 12న రెండవ శనివారం, 14న అంబేద్కర్ జయంతి రోజున సెలవు దినాల్లోనూ దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలతో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో తీసుకుంటారని తెలిపారు.