
ఆయిల్‌పాం రైతులకు ప్రోత్సాహకం
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహకం అందిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే సాగులో ఉన్న రైతులకు ప్రోత్సాహక డబ్బులను జమ చేసింది. జిల్లాలో ఆయిల్‌పాం కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఆయిల్‌పాం సాగును విస్తరించేందుకు కృషి చేస్తున్నాం.
– పిన్నపురెడ్డి అనంతరెడ్డి,
జిల్లా ఉద్యాన శాఖ అధికారి
నల్లగొండ అగ్రికల్చర్ : ఆయిల్‌పాం సాగును విస్తరించడానికి ఉద్యానవన శాఖ ప్రత్యేక ప్రణాళికలను తయారు చేసింది. ఆయిల్‌పాం సాగుపై రైతుల్లో అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 9,768 ఎకరాల్లో అయిల్‌పాం తోటలను 2,217 మంది రైతులు సాగు చేశారు. ఆయా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి సంబంధించిన ప్రోత్సాహకం రూ.6.144 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.
సాగు రెండింతలు చేయాలని లక్ష్యం..
ఆయిల్‌పాం సాగును జిల్లాలో రెండింతలు చేయాలని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం తోటలను సాగుచేసే రైతులను ప్రోత్సహిస్తోంది. ఎకరా ఆయిల్‌పాం సాగుకు 57 మొక్కలు అవసరం కాగా ఒక్కో మొక్కకు రూ.193 గాను.. రైతు రూ.20 చెల్లిస్తే.. ప్రభుత్వం మిగతా రూ.173 చెల్లిస్తుంది. సాగుకు అవసరమైన డ్రిప్‌ను ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం సబ్సిడీపై, బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీపై అందిస్తోంది. ఎకరానికి ప్రతి సంవత్సరం ఎరువులు, పురుగుల మందుతో పాటు అంతర్‌పంట సాగు చేసుకునేందుకు రూ.4200 ప్రోత్సాహకం ఇస్తుంది. సాగు చేసిన నాటి నుంచి కాతకు వచ్చేంత వరకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది.
మెట్రిక్ టన్నుకు రూ.21 వేలు..
ఎకరం వరికి సరిపోను నీరు ఉంటే మూడు ఎకరాల్లో ఆయిల్‌పాం తోటను సాగు చేసుకోవచ్చు. ఆయిల్‌పాం తోట నాలుగు సంవత్సరాలకు కాతకు వస్తుంది. కాతకు వచ్చిన తరువాత ఆయిల్‌పాం గెలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంది. మెట్రిక్ టన్నుకు రూ.21 వేలకు పతాంజలి సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసుంది.
కొత్తలూరులో కంపెనీ!
జిల్లాలోని అనుముల మండలం కొత్తలూరు గ్రామంలో పతాంజలి సంస్థ అయిల్‌పాం కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఆ గ్రామంలో 16 ఎకరాల భూమిని ఆ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇంకో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి త్వరలో కంపెనీ ఏర్పాటు పనులను ప్రారంభించే అవకాశం ఉంది. అయిల్‌పాం కంపెనీ ఏర్పాటు పూర్తయితే జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఉద్యానవన శాఖ అంచనాలు వేస్తోంది.
ఫ రైతుల ఖాతాల్లో డబ్బు జమచేసిన ప్రభుత్వం
ఫ సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలు
రైతుల ఖాతాల్లో ప్రోత్సాహకం జమ ఇలా..
సంవత్సరం రైతులు విస్తీర్ణం పోత్సాహకం (రూ.కోట్లలో)
1వ 401 1856 2.820
2వ 934 3933 1.652
3వ 651 3290 1.340
4వ 141 789 0.332

ఆయిల్‌పాం రైతులకు ప్రోత్సాహకం