
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
నల్లగొండ: అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మంజూరు చేసేందుకు సర్వేకు ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం మీసేవ యాప్ రూపొందించి సిబ్బందిని నియమించింది. వారం రోజుల నుంచి యాప్ ద్వారా అర్జీలపై క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తోంది.
ప్రజాపాలనలో లక్షకుపైగా దరఖాస్తులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించింది. అందులో భాగంగా రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా 1,25,733 మంది దరఖాస్తులు అందించారు. ఇప్పుడు ఆ దరఖాస్తులపై సర్వే కొనసాగుతోంది. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 622 మంది సిబ్బందిని నియమించారు. సదరు సిబ్బంది మీసేవ యాప్ ద్వారా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లోనే వారి వివరాలు సేకరించి నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో చిన్న మండలాలకు 10 మంది, పెద్ద మండలాలకు 20 మంది, పెద్ద మున్సిపాలిటీలకు 30 మంది చొప్పున సిబ్బందిని కేటాయించారు. వీరికి సర్వే ఎలా చేయాలో శిక్షణ కూడా ఇచ్చారు. సర్వే తర్వాత అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపించనున్నారు.
ఇప్పటికే 8,415 కార్డులు మంజూరు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆన్‌లైన్ ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించింది. దీంతో ప్రజులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 8,415 మందిని అర్హులుగా తేల్చి కార్డులు మంజూరు చేశారు. అయితే వీరికి సన్న బియ్యం పంపిణీకి ఆదేశాలు రావాల్సి ఉంది.
బీసీ కుల గణనలోనూ భారీగా అర్జీలు
ప్రభుత్వం బీసీ కుల గణన ప్రక్రియ చేపట్టిన సందర్భంలో రేషన్ కార్డులు లేనివారు అందులో ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇందులో మొత్తంగా 27,523 అర్జీలు రాగా వీటి 23,428 అనుమంతించగా 4,095 దరఖాస్తులు తిరస్కరించారు. వాటిని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. అయితే ప్రజాపాలన దరఖాస్తుల సర్వే తరువాత అన్ని కొత్తకార్తులకు ఒకేసారి సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తారా లేక ఇప్పటికే మంజూరైన వాటికి వచ్చేనెల నుంచి ఇస్తారా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది.
ఆదేశాలు రాగానే కొత్త కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేస్తాం
ఇప్పటికే కొందరికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీరికి ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు ఇస్తే అప్పటి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తాం. ప్రజాపాలన దరఖాస్తుల సర్వే కొనసాగుతోంది. సర్వే పూర్తికాగానే అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపుతాం.
– హరీష్, పౌరసరఫరాల శాఖ డీఎం, నల్లగొండ
ఫ ప్రజాపాలనలో 1.25 లక్షల దరఖాస్తులు
ఫ పరిశీలనకు ప్రత్యేకంగా మీసేవ యాప్
ఫ 622 మంది సిబ్బంది నియామకం
ఫ వారం రోజులుగా కొనసాగుతున్న ప్రక్రియ