
ఎంపీ యూసఫ్ పఠాన్ ఇన్‌స్టా పోస్టుపై బీజేపీ విమర్శలు
కోల్‌కతా: తృణమూల్ ఎంపీ యూసఫ్ పఠాన్‌పై బీజేపీ విరుచుకుపడింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బెహ్రాంపూర్ పరిధిలో పలు ప్రాంతాలు వక్ఫ్ అల్లర్లతో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రశాంతమైన మధ్యాహ్నం.. మంచి చాయ్.. ప్రశాంతమైన పరిసరాలు’అంటూ చాయ్ తాగుతున్న ఫొటోను యూసుఫ్ ఆదివారం ఇన్‌స్టాలో పోస్టు చేశారు. నియోజకవర్గం తగలబడి పోతుంటే ఇలాంటి పోస్టులా అంటూ బీజేపీ విరుచుకుపడింది.
కాగా, వక్ఫ్ వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన మాల్దా, ముర్షీదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో ఉద్రిక్తతలు ఆదివారం కొనసాగాయి. ముర్షిదాబాద్ నుంచి జనం భయంతో వలసబాట పడుతున్నారు. భద్రతా బలగాలు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. ఇప్పటిదాకా 150 మందిని అరెస్ట్ చేశారు. హింసాత్మక ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తృణమూల్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ కూడా పలుచోట్ల ప్రతి నిరసనలకు దిగింది.