
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Mahakumbh) అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 26(శివరాత్రి)తో కుంభమేళా ముగియనుంది. ఈ నేపధ్యంలో భక్తులు త్రివేణీ సంగమానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి తొక్కిసలాట ఘటనలు లాంటివి చోటుచేసుకుండా ఉండేందుకు యూపీ సీఎం స్వయంగా కుంభమేళాను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన అరుదైన రికార్డును కూడా నెలకొల్పారు.
జనవరిలో కుంభమేళా ప్రారంభం కావడానికి ముందు నుంచి ఫిబ్రవరి 22 వరకు గడచిన 45 రోజుల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) 12 సార్లు కుంభమేళాను సందర్శించారు. దీంతో అత్యధికంగా కుంభమేళాను సందర్శించిన సీఎంగా చరిత్ర సృష్టించారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి మహా కుంభమేళా 1954లో జనవరి 14 నుండి మార్చి 3 వరకు జరిగింది. ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ రెండుమూడు సార్లు సంగమ స్థలికి వచ్చి పరిస్థితులను పర్యవేక్షించారు. ఆ తరువాత మరే ముఖ్యమంత్రీ కుంభమేళాను పదేపదే సందర్శించలేదు.
సీఎం యోగి కుంభమేళా సందర్శనలు
జనవరి 09: 13 అఖాడాలు, దండిబారా, ఖాక్ చౌక్ మహాసభల శిబిరాలను సీఎం యోగి సందర్శించారు. డిజిటల్ మీడియా సెంటర్‌ను ప్రారంభించారు.
జనవరి 10: ప్రసార భారతి ఛానల్ కుంభవాణిని ప్రారంభించి, రవాణా సంస్థ బస్సులకు పచ్చజెండా ఊపారు.
జనవరి 19: పూజ్య శంకరాచార్య తదితర సాధువులతో సమావేశమయ్యారు. పోలీసు గ్యాలరీ, రాజ్యాంగ గ్యాలరీ, పర్యాటక గ్యాలరీలను ప్రారంభించారు.
జనవరి 22: మంత్రివర్గంతో పవిత్ర సంగమ స్నానం చేశారు.
జనవరి 25: గురు గోరక్షనాథ్ అఖారాలో, విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad) సమావేశంలో పన్నెండు శాఖల యోగి మహాసభలో అవధూత వేషధారణలో కనిపించారు.
జనవరి 27: హోంమంత్రి అమిత్ షాను స్వాగతించారు. త్రివేణి సంగమంలో పూజలు చేశారు.
ఫిబ్రవరి 01: భారత్ సేవాశ్రమ శిబిరాన్ని సందర్శించారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రపంచంలోని 73 దేశాల దౌత్యవేత్తలతో సంభాషించారు.
ఫిబ్రవరి 04: బౌద్ధ మహా కుంభ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూటాన్ రాజుకు స్వాగతం పలికారు.
ఫిబ్రవరి 05: ప్రధాని మోదీకి స్వాగతం పలికి, త్రివేణి సంగమంలో పూజలు చేశారు.
ఫిబ్రవరి 10: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.
ఫిబ్రవరి 16: ప్రదీప్ మిశ్రా కథాశ్రవణం, ప్రభు ప్రేమి సంఘ్ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫిబ్రవరి 22: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు. మహాశివరాత్రి సన్నాహాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (ఆదివారం) మరోమారు మహాకుంభ్ నగర్ కు రానున్నారు. గత అక్టోబర్‌లో మహా కుంభ్ లోగో విడుదలైన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్ రావడం ఇది 18వ సారి అవుతుంది.
ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ..