
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పాల్గొన్న నాయకులు
పోలింగ్ అక్రమాలపై కాలమే సమాధానం చెబుతుంది
ఏమాత్రం అవినీతికి తావు లేకుండా ప్రజలకు పథకాలు అందించాం
రాష్ట్ర స్థూల ఉత్పత్తిని, ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాం
అంతకన్నా మెరుగ్గా పథకాలను అందిస్తామన్న కూటమిని ప్రజలు నమ్మారు
ప్రజలకు అందుబాటులో ఉంటాం – కార్యకర్తలకు అండగా ఉంటాం
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో తేడాలపై అధ్యయనం చేస్తున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పోలింగ్ అక్రమాలపై కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. ఆయన గురువారం ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావు లేకుండా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించిందని చెaప్పారు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని విద్య, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని, ప్రజల తలసరి ఆదాయాన్ని, వారి కొనుగోలు శక్తినీ పెంచామని వివరించారు. అంతకన్నా మెరుగ్గా సంక్షేమ పథకాలను అందిస్తామన్న కూటమిని నమ్మి ఈ ఎన్నికల్లో ప్రజలు వారిని గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూటమి ఆ హామీలన్నీ అమలు చేయాలని కోరారు. ప్రాజెక్టుల్లో కొద్దిపాటి మిగులు పనులనూ పూర్తి చేసి ప్రజలకు వాటి ఫలాలను అందించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందన్నారు.
ఏమాత్రం తేడా చేసినా నష్టపోయేదీ ప్రజలేనని అభిప్రాయపడ్డారు. ప్రజలు నష్టపోకూడదని, వారికి అన్నివిధాలా మేలు జరగాలని పార్టీ తరఫున ఆశిస్తున్నామన్నారు. ఐదేళ్ల పాటు ప్రజాసేవకు అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇకపైన కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా, ప్రత్యర్థులు ఇబ్బందులకు గురిచేసినా ఏమాత్రం వెరవకుండా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.
వారికి అన్నివేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సురే‹Ùబాబు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు తదితరులు పాల్గొన్నారు.