
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. నారా లోకేష్ రెడ్ బుక్ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ హత్యలకు, దాడులకు పాల్పడుతున్నారు. అలాగే, కొన్ని చోట్ల అత్యాచారాలు జరుగుతున్నా మంత్రుల నుంచి సీఎం చంద్రబాబు వరకు ఎవరూ స్పందించడం లేదు.
మరోవైపు.. చంద్రబాబు శ్వేతపత్రాల పేరుతో ప్రతీరోజు ఏదో ఒక అంశంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పచ్చ మీడియాలో రాసిన వార్తలను శ్వేతపత్రం పేరుతో చదవి వినిపిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేశారు.
కాగా, ఈరోజు శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు భావించిన్పటికీ చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎందుకంటే నిన్న రాత్రి వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్న నివాసంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇలా టీడీపీ నేతల హింసాకాండ కొనసాగుతున్న క్రమంలో.. లా అండ్ ఆర్డర్ వైట్ పేపర్ విడుదల చేస్తే అది తమకే తిప్పి కొడుతుందని ఆయన భావిస్తున్నారు. దీంతో ఇవాళ్టి శ్వేతపత్రం విడుదలపై చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దారుణ హత్యలు, బాలికలపై అత్యాచారాలు, మహిళల హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే.