
నెల్లూరు, సాక్షి: అధికారం చేపట్టిన వెంటనే.. కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఆపేయడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం.. ఆఖరికి గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేయడం పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. తాజాగా.. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ వద్ద నేమ్ బోర్డులోంచి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించడం విమర్శలకు తావిస్తోంది.
వైఎస్సార్ హయాంలో 2008లో బ్యారేజ్ పనులు ప్రారంభమైనప్పటికీ.. ఆయన మరణాంతరం ఆ పనులు అటకెక్కాయి. ఆయన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. రూ.131 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీని పూర్తి చేయించారు. అలాగే 1195 మీటర్ల పొడవుతో రెండు లైన్ల బ్రిడ్జి రోడ్ కూడా నిర్మించారు.ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 3.85 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.
నాడు సీఎంగా బ్యారేజ్ వద్ద గౌతమ్ రెడ్డి విగ్రహావిష్కరణలో వైఎస్ జగన్.. మేకపాటి కుటుంబ సభ్యులు
ఇక.. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణం కోసం నిరంతరం శ్రమించారు. ఆయన హఠాన్మరణం జిల్లావాసులను కలచివేసినా… గౌతంరెడ్డి పేరు చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యారేజ్‌కు ఆయనపేరు పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల నెల్లూరు వాసులు, రైతాంగం హర్షం వ్యక్తం చేశారు.
నేడు.. కక్షపూరితంగా ఆ పేరు తొలగించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పేరు చెరిపినా.. ప్రాజెక్టు కోసం ఎవరు నిజంగా కృషి చేశారనే చరిత్రను మాత్రం చెరపలేరని స్థానికులు అంటున్నారు.