
వైఎస్సార్‌సీపీ పోరుబాటపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. వేల కోట్లు దండుకుంటున్న కూటమి సర్కార్‌పై నిరసన స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతోంది. దీంతో వైఎస్సార్‌సీపీ పోరుబాటపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది.
విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రేపు(శుక్రవారం) వైఎస్సార్‌సీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుండగా.. పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి సహా వైఎస్సార్ సీపీ నేతలను పీఎస్‌కు పోలీసులు పిలిపించారు.
వైఎస్సార్ సీపీ పోరుబాటకు వెళ్లకుండా బైండోవర్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరును వైఎస్సార్‌సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. వైఎస్సార్‌సీపీ పోరుబాటకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజల తరుపున నిరసన తెలిపి, కరెంటు చార్జీలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి: కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే!