
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఏకపక్ష విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.
కాగా, ఈ మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లఘించినందుకు గానూ గుజరాత్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మకు భారీ జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత పెట్టారు. అలాగే ఓ డీ మెరిట్ పాయింట్ కూడా కేటాయించారు.
ఈ మ్యాచ్‌లో ఇషాంత్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు. ఈ నిబంధన మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ పరికరాల దుర్వినియోగంతో వ్యవహరిస్తుంది. ఓ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా వికెట్లను లేదా ప్రకటన బోర్డులను లేదా సరిహద్దు కంచెలను లేదా డ్రెస్సింగ్ రూమ్ సామాగ్రికి నష్టం కలిగిస్తే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘించినట్లు లెక్క.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్ ఇషాంత్ శర్మకు అంత కలిసి రాలేదు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇషాంత్ ఇచ్చిన పరుగులు సన్‌రైజర్స్ స్కోర్‌లో 30 శాతం. ఈ సీజన్ మొత్తంలో కూడా ఇషాంత్ ఇంతే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. సహచర పేసర్లు సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ రాణిస్తున్నా ఇషాంత్ చెత్త బౌలింగ్‌తో విసుగుతెప్పించాడు. ఈ సీజన్‌లో ఇషాంత్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇందులో 8 ఓవర్లు వేసి 107 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ సీజన్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడిన ఐదో క్రికెటర్ ఇషాంత్. అతనికి ముందు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, లక్నో బౌలర్ దిగ్వేశ్ రతీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. వీరిలో కెప్టెన్లు స్లో ఓవర్ రేట్‌కు బాధ్యులు కాగా.. దిగ్వేశ్ రతీ తన నోట్ బుక్ సెలబ్రేషన్స్‌కు గానూ జరిమానా ఎదుర్కొన్నాడు.