RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. మరో సెంచరీ | IPL 2025 RCB Vs RR: Virat Kohli Completes Century Of Half Centuries In T20s, Check Record Details Inside | Sakshi
Sakshi News home page

RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. మరో సెంచరీ

Published Sun, Apr 13 2025 7:21 PM | Last Updated on Mon, Apr 14 2025 9:59 AM

IPL 2025 RCB VS RR: Virat Kohli Completes Century Of Half Centuries In T20s

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన విరాట్‌.. టీ20ల్లో 100 హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసిన తొలి భారత్‌ మరియు ఆసియా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా చూసినా డేవిడ్‌ వార్నర్‌ మాత్రమే విరాట్‌ కంటే ముందు టీ20ల్లో 100 హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 

వార్నర్‌ 400 టీ20 మ్యాచ్‌ల్లో 108 హాఫ్‌ సెంచరీలు చేయగా.. విరాట్‌ తన 388వ టీ20 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో విరాట్‌ 388 ఇన్నింగ్స్‌లు ఆడి 9 సెంచరీలు, 100 హాఫ్‌ సెంచరీల సాయంతో 13100 పైచిలుకు పరుగులు చేశాడు.

టీ20ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన టాప్‌-5 ప్లేయర్లు
వార్నర్‌- 108
విరాట్‌- 100
బాబర్‌ ఆజమ్‌- 90
గేల్‌- 88
బట్లర్‌- 86

కాగా, రాయల్స్‌తో మ్యాచ్‌లో విరాట్‌ రికార్డు హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజ​స్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 

రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్‌ జురెల్‌ (35 నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్‌ 9, నితీశ్‌ రాణా 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌, హాజిల్‌వుడ్‌, కృనాల్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 17.3 ఓవర్లలో ఫిల్‌ సాల్ట్‌ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్‌ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్‌ (28 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. 

విరాట్‌ హాఫ్‌ సెంచరీల సెంచరీని విరాట్‌ సిక్సర్‌తో అందుకోవడం విశేషం. ప్రస్తుత సీజన్‌లో విరాట్‌కు ఇది మూడో హాఫ్‌ సెంచరీ. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ సీజన్‌లో విరాట్‌ 6 మ్యాచ్‌ల్లో 62 సగటున, 143.35 స్ట్రయిక్‌ రేట్‌తో 248 పరుగులు చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 349 పరుగులు చేసిన పూరన్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement