
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసిర్ హొసేన్ ఐసీసీ విధించిన రెండేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకుని తిరిగి బరిలోకి దిగాడు. నాసిర్ హొసేన్ 2020-21 అబుదాబీ టీ10 లీగ్ సందర్భంగా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన ఐసీసీ నాసిర్‌ను దోషిగా తేల్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు నాసిర్ అంగీకరించాడు. దీంతో హొసేన్‌ను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రెండేళ్ల పాటు (ఆరు నెలల సస్పెన్షన్‌తో కలుపుకుని) నిషేధించారు. ప్రస్తుతం హొసేన్ నిషేధానికి సంబంధించిన అన్ని ప్రమాణాలను పూర్తి చేసుకుని కెరీర్‌ను తిరిగి ప్రారంభించేందుకు అర్హత సాధించాడు. ఐసీసీ నాసిర్ హొసేన్‌ను క్లీన్ చిట్ ఇచ్చింది.
నాసిర్ హొసేన్‌పై నిషేధం ఎత్తి వేయడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా స్పందించింది. నాసిర్ తప్పనిసరి అవినీతి నిరోధక విద్యా సెషన్‌ను పూర్తి చేయడంతో పాటు అన్ని అవసరాలను తీర్చాడు. ఏప్రిల్ 7, 2025 నాటికి అధికారిక క్రికెట్‌లోకి తిరిగి ప్రవేశించేందుకు అతనికి మార్గం సుగమమైందని బీసీబీ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. నాసిర్ తనపై సస్పెన్షన్ ఎత్తివేసిన రోజునే ఢాకా ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు. ఈ టోర్నీ అతను రూప్‌ఘంజ్ టైగర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఘాజీ గ్రూప్ జట్టుతో తలపడ్డాడు.
33 ఏళ్ల నాసిర్ 2011లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 19 టెస్ట్‌లు, 85 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన నాసిర్ టెస్ట్‌ల్లో 1044 పరుగులు, 8 వికెట్లు.. వన్డేల్లో 1281 పరుగులు, 24 వికెట్లు.. టీ20ల్లో 370 పరుగులు 7 వికెట్లు తీశాడు. నాసిర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు. నాసిర్ బంగ్లాదేశ్ తరఫున 2018లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొంటూ వచ్చాడు.