‘ఇందిరమ్మ’కు ప్రైవేట్‌ ఇంజనీర్లు | 390 engineers to be hired for Telangana housing scheme | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’కు ప్రైవేట్‌ ఇంజనీర్లు

Published Sat, Apr 5 2025 5:52 AM | Last Updated on Sat, Apr 5 2025 5:52 AM

390 engineers to be hired for Telangana housing scheme

390 మంది నియామకానికి నోటిఫికేషన్‌ జారీ  

ఔట్‌సోర్సింగ్‌ ఇంజనీర్లతోనే నిర్మాణాలను తనిఖీ చేయించనున్న ప్రభుత్వం  

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్‌ ఇంజనీర్లకు అప్పగించబోతోంది. తొలుత 390 మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకునేందుకు మేన్‌పవర్‌ సప్లయర్స్‌కు బాధ్యత అప్పగించింది. అందుకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈనెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. 

ఇందులో ఎంపికైనవారు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది. మొదటగా ఒక సంవత్సరం కోసం వీరితో గృహనిర్మాణ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. మరో రెండుమూడు వారాల్లో ఈ ప్రైవేట్‌ ఇంజనీర్లు విధుల్లోకి రానున్నారు. వీరికి నెలకు రూ.33,800 చొప్పున చెల్లించనున్నట్టు తెలిసింది. 

ప్రభుత్వం నియామకాలు వద్దనే ? 
గతంలో గృహనిర్మాణ శాఖలో చాలినంతమంది ప్రభుత్వ ఇంజనీర్లు ఉండేవారు. డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి­గా ఉండగా, భారీ ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకా­రం చుట్టారు. ఆ సమయంలో సొంత సిబ్బంది సరిపోకపోవ­టంతో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కొందరి సేవలు తీసుకు­న్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వీరిని తొలగించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని కూడా రద్దు చేసింది. ఆ తర్వాత గృహనిర్మాణ శాఖ నిర్వీర్యమైంది. దాన్ని రోడ్లు భవనాల శాఖలో కలిపేశారు. 

గృహనిర్మాణ సంస్థలోని ఇంజినీర్లను వివిధ శాఖల ఇంజనీరింగ్‌ విభాగాలకు బదిలీ చేశారు. ఇప్పుడు మళ్లీ పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించటంతో, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఇంజనీర్లను తిరిగి గృహనిర్మాణ సంస్థకు రప్పించారు. అలా ప్రస్తుతం 125 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. గృహనిర్మాణ సంస్థలో 505 మంది అసిస్టెంట్‌ ఇంజ­నీర్లను వినియోగించుకునేలా పోస్టులకు అనుమతి ఉంది. ప్ర­స్తుతం 125 మందే ఉన్నందున, మిగతావారిని పబ్లిక్‌సర్విస్‌ కమిషన్‌ ద్వారా నియమించుకోవాల్సి ఉంది.

 కానీ, ఇటీవలి పబ్లిస్‌ సర్విస్‌ కమిషన్‌ నియామక ప్రక్రియలో గృహనిర్మాణ శాఖ ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో, ఆ వివరాలు ఇవ్వలేదు. దీంతో ఇటీవలి గ్రూప్‌ పరీక్షల్లో వీటిని చేర్చలేదు. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకునే వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ నియామకాల్లో చూపలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఔట్‌సోర్సింగ్‌ ఇంజనీర్ల సేవలు వినియోగించుకొని తదుపరి నియామక ప్రక్రియలో తీసుకునే అవకాశం ఉందని అధికారులంటున్నారు.  

తనిఖీ చేసేది వీరే.. 
తొలివిడతలో ప్రభుత్వం 72 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. వారిలో 12 వేల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అందులో 500 మంది బేస్‌మెంట్‌ స్థాయి వరకు పనులు పూర్తి చేశారు. బేస్‌మెంట్‌ స్థాయి ముగిసిన వెంటనే తొలి విడత రూ.లక్ష నిధులు వారి ఖాతాల్లో డిపాజిట్‌ కావాల్సి ఉంటుంది. అది జరగాలంటే అసిస్టెంట్‌ ఇంజనీర్లు తనిఖీ చేసి సర్టిఫై చేయాలి. ఇప్పుడు ఈ పనిని ఉన్న 125 మంది ఇంజనీర్లు సహా కొత్తగా తీసుకోబోయే ఔట్‌సోర్సింగ్‌ ఇంజనీర్లు చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement