
శాలిగౌరారం: నాకేపాపం తెలియదు.. ప్రశ్నాపత్రం లీకేజీలో నా పాత్రలేదు.. పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన ఉన్న నన్ను కిటికీలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి నా ముందున్న ప్రశ్నాపత్రాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు. నన్ను అన్యాయంగా డిబార్ చేశారు. నా డిబార్‌ను రద్దు చేసి పరీక్షలకు అనుమతించాలి అని నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని బల్లెం ఝాన్సీలక్ష్మి బుధవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం రాత్రి ‘సాక్షి’కి వెల్లడించారు.
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నల్లగొండ జిల్లా విద్యాధికారి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ సెక్రటరీ, నకిరేకల్‌లోని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్‌లను ప్రతివాదులుగా పేర్కొంటూ న్యాయవాది కర్ణాకర్‌రెడ్డి ద్వారా లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశామని ఝాన్సీలక్ష్మి తల్లిదండ్రులు చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తమ పిటిషన్‌ను విచారించి ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఈ నెల 21న ఎస్సెస్సీ పరీక్ష ప్రారంభం కాగా పరీక్షలు ప్రారంభమైన పావుగంటకే నకిరేకల్‌లోని సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నాపత్రం లీకై నకిరేకల్, శాలిగౌరారం మండలాలలోని యువకుల వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టిన విషయం విదితమే.
ప్రశ్నాపత్రం లీకై న సంఘటనను సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ అధికారులు బాధ్యులను గుర్తించి నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రశ్నాపత్రం క్రమసంఖ్య నెంబర్ ఆధారంగా విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని గుర్తించిన అధికారులు.. ఆమెను పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీలో పాల్గొన్న యువకులపై పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు కొందరిని రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే.