
న్యాయ నిపుణుల బృందంలో ఉత్సాహం నింపుతా
నీటి కేసుల్లో ఎలాంటి పురోగతి ఉన్నా నాకు తెలపాలి
కృష్ణా ట్రిబ్యునల్ తెలంగాణ న్యాయవాదుల బృందంతో సమీక్షలో మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వాటాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్వహిస్తున్న విచారణకు స్వయంగా హాజరై రాష్ట్రం తరఫున మరింత బలంగా వాదనలు వినిపించేలా న్యాయవాదుల్లో ఉత్సాహం నింపుతానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ నేతృత్వంలో కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట రాష్ట్రం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల బృందంతో ఆదివారం ఆయన జలసౌధలో సమావేశమయ్యారు.
న్యాయవాదుల బృందానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. డేటా కలెక్షన్, క్షేత్ర స్థాయి సమాచారం, పిటిషన్ల రూపకల్పనలో పూర్తి సహకారం అందించాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. న్యాయవాదులకు అవసరమైన రవాణా, బస సదుపాయాలను కల్పించాలని కోరారు.
ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై న్యాయ నిపుణులతో చర్చించి, పలు సూచనలు చేశారు. తెలంగాణ వాదనలు కేవలం గణాంకాలకు సంబంధించినవి కాదని, న్యాయం కోసం జరిపే పోరాటమని తెలిపారు. నీటి కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సరిచేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టంచేశారు.
పూర్తి సన్నద్ధతతో ఉన్నాం: న్యాయ బృందం
ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ ఎదుట వినిపించిన వాదనలను సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ మంత్రికి వివరించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న విచారణ కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి న్యాయమైన నీటి కేటాయింపుల కోసం చేస్తున్న వాదనను బలపరిచే వివిధ రకాల సమాచారాన్ని ట్రిబ్యునల్‌కు అందజేసినట్టు తెలియజేశారు.
తెలంగాణ భూభాగంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంతోపాటు రాష్ట్ర జనాభా, సాగునీటి సరఫరా సామర్థ్యం వంటి అంశాలను గమనంలోకి తీసుకుని కేటాయింపులు జరపాలని ట్రిబ్యునల్ ఎదుట వాదిస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా, గోదావరి జల వివాదాల విషయంలో న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు రాష్ట్రం దాఖలు చేసిన అప్పీళ్ల తాజా స్థితిగతులను మంత్రి ఉత్తమ్ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పురోగతి ఉన్నా తక్షణమే తనకు తెలియజేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు.