ట్రాక్టర్‌ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి.. | Three Women Farm Labourers Die In Road Accident In Peddapalli, Details Inside | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..

Published Mon, May 6 2024 8:19 AM

Three women farm labourers die in road accident in Peddapalli

సుల్తానాబాద్‌రూరల్‌: డ్రైవర్‌ సీటు కింది స్ప్రింగ్‌ ఊడిపోవడంతో ట్రాక్టర్‌ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడడంతో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్, మృతుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం..సుల్తానాబాద్‌ మండలం చిన్న కూర్‌ గ్రామానికి చెందిన డ్రైవర్‌ మల్యాల వెంకటేశ్‌ మియాపూర్‌ గ్రామ పరిధిలో చేను కౌలుకు తీసుకొని మొక్కజొ న్న సాగు చేశాడు.

 పంట చేతికి రావడంతో తన భార్య మల్యాల వైష్ణవి(35)తోపాటు పోచంపల్లి రాజమ్మ(61), బేతి లక్ష్మి(50), పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మి ని ట్రాక్టర్‌లో తీసుకొని ఆదివారం ఉదయం 7గంటల సమయంలో చేను వద్దకు వెళ్లాడు. మొక్కజొన్న కంకులు కోసి ట్రాక్టర్‌లో లోడ్‌ చేసుకున్నాడు. తిరుగుప్రయాణంలో వారిని ట్రాక్టర్‌ ట్రాలీ పై ఎక్కించుకొని కాలువ వెంట ఉన్న దారి నుంచి వస్తున్నాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో డ్రైవర్‌ సీటు కింద ఉన్న స్ప్రింగ్‌ ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్‌ కుప్పకూలిపోయాడు. స్టీరింగ్‌ చేజారి ట్రాక్టర్‌ అదుపు తప్పింది. వేగంగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో ట్రాలీ కింద మహిళా కూలీలు నలిగిపోయారు. 

ఇందులో మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ, బేతి లక్ష్మి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మికి తీవ్ర గాయాలు సమీపంలోని రైతులు వెంటనే కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ వెంకటేశ్‌కు స్వల్ప గాయాలు కావడంతో సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు ఎస్సై కేసు నమోదు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement