తోడేళ్ళను తరిమే రోజు! | Sakshi
Sakshi News home page

తోడేళ్ళను తరిమే రోజు!

Published Sun, May 5 2024 3:38 AM

Sakshi Editorial On Andhra Pradesh Politics by Vardhelli Murali

జనతంత్రం

ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్‌ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!

ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్‌ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. 

ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్‌ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.

అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. 

కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.

ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. 

నాటి ‘ఆంధ్రపత్రిక’,  ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్‌’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. 

ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.

ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్‌ కార్పొరేట్‌ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. 

పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్‌ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్‌ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.

వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్‌ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. 

ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్‌ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.

ఐదేళ్ల  కింద ఆంధ్రప్రదేశ్‌లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్‌మోహన్‌రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. 

పెత్తందార్ల కూటమి జగన్‌ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్‌ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.

ఈ అయిదేళ్ల కాలంలో జగన్‌ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ  బద్దలు కొట్టింది. గోబెల్స్‌ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్‌ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. 

అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్‌ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. 

ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. 

దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లిస్తే చార్మినార్‌కు కూడా సేల్‌ డీడ్‌ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? 

ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్‌బుక్‌ ఇవ్వడం జరుగుతుంది. 

వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్‌బుక్‌ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్‌బుక్‌పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.

అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్‌’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. 

అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?

ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.

అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్‌ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!

ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్‌లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్‌లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్‌లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. 

ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్‌ రిజిస్టర్‌లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ దగ్గర క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్‌ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ అనే పోస్ట్‌ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్‌ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!

పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్‌ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. 

దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఈసీ సూచనల మేరకు ఏప్రిల్‌లో విలేజ్‌ సెక్రటేరియట్‌లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. 

వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్‌ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్‌మోహన్‌రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.

ఇంకో వారం రోజుల్లో పోలింగ్‌ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. 

బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement

తప్పక చదవండి

Advertisement