ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు

Published Mon, May 6 2024 8:05 AM

ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు

గుంటూరు వెస్ట్‌: ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్‌, 7 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లోని మీడియా సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ తుషార్‌ డూడీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల, ప్రజల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 17,91,543 మంది ఓటర్లున్నారన్నారు. వీరిలో ఇప్పటికే 9.50 లక్షల మందికి ఓటరు స్లిప్పులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశామన్నారు. 3.50 లక్షల ఓటర్లకు ఇప్పటికే ఎపిక్‌ కార్డులు కూడా అందజేశామని తెలిపారు. త్వరలో అందరికీ ఓటరు స్లిప్పులు అందుతాయని చెప్పారు. జిల్లాలోని పార్లమెంట్‌, 7 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు. హోం ఓటింగ్‌కు సంబంధించి 85 ఏళ్లు పైబడిన వారు 12,611 మంది, దివ్యాంగులు 17,357 మొత్తం 29,968 మంది ఉన్నారన్నారు. వీరంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొని ఆదర్శంగా నిలిచారన్నారు. వీరి ఓటరు స్లిప్పులు రిటర్నింగ్‌ అధికారులు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రంగా ఉన్నాయన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆందోళన వద్దు...

కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ఈ నెల 5 నుంచి 8 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌లో పాల్గొనే అవకాశం కల్పించామన్నారు. పీఓ, ఏపీఓ, ఓపిఓలు, మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోనే ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సోమవారం సాయంత్రం వరకు వారు అక్కడే పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోవచ్చన్నారు. మన జిల్లాలో పనిచేసేవారు ఇక్కడే పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకుంటారని, ఇక్కడ పనిచేస్తూ ఇతర జిల్లాలో ఓటు ఉన్న వారికి ఆయా జిల్లా కలెక్టర్ల వద్ద నుంచి ఫామ్‌–12ను తెప్పిస్తున్నామని, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి ఇక్కడ ఓటు ఉంటే వారికి కూడా ఫామ్‌–12ను ఆయా జిల్లాలకు పంపిస్తున్నామన్నారు. దీనివల్ల ఎవరూ ఓటు హక్కును కోల్పోనవసరం ఉండదన్నారు. ఇప్పటివరకు 5860 ఫామ్‌–12 దరఖాస్తులు ఇతర జిల్లాలకు పంపగా, మనం ఇతర జిల్లాల నుంచి 5092 తీసుకొచ్చామని చెప్పారు. వారంతా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉపయోగించుకుంటారన్నారు.

అదనంగా ఈవీఎంలు..

జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఇతర జిల్లాల నుంచి అదనంగా ఈవీఎంలను తెప్పించామని కలెక్టర్‌ తెలిపారు. పార్లమెంట్‌కు 2239, అసెంబ్లీలకు 1020 తెప్పించామని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచే ఈవీఎం డిస్ట్రిబ్యూషన్‌ జరుగుతుందన్నారు. 1309 పోలింగ్‌ కేంద్రాలకు వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. 372 పోలింగ్‌ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వివరించారు.

ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోండి ఇప్పటికే 9.50 లక్షల ఓటర్‌ స్లిప్పులు అందజేశాం ఓటు ఉన్న ప్రతి ఒక్కరికీ స్లిప్పు అందుతుంది పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆందోళన వద్దు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి

ఇబ్బందులు పడవద్దు: ఎస్పీ

సమావేశంలో ఎస్పీ తుషార్‌ డూడీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎటువంటి విధ్వంసకర సంఘటనలు జరగలేదన్నారు. తనిఖీ బృందాలతోపాటు పోలీస్‌ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. కొన్ని గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశముందని వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.

Advertisement
Advertisement