రబీ సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం రైతులకు కరెంట్ షాక్ ఇస్తోంది. వ్యవసాయ రంగానికి 7 గంటల విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రబీ సీజన్ గట్టెక్కేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ రూరల్/కలెక్టరేట్, న్యూస్‌లైన్: రబీ సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం రైతులకు కరెంట్ షాక్ ఇస్తోంది. వ్యవసాయ రంగానికి 7 గంటల విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రబీ సీజన్ గట్టెక్కేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ చివరిలో భారీ వర్షాలు పడడంతో వేసిన పంటలు పూర్తిగా నష్టపోయాయి. సమృద్ధిగా నీరుండడంతో ఖరీఫ్ నష్టాన్ని, పెట్టుబడులను రబీ సీజన్‌లో వెళ్లదీసుకుందామని భావించిన రైతులు పత్తి చేలను తొలగించి వరిసాగుకు సన్నద్ధమయ్యారు. ముందుగా తుకాలు (వరినార్లు) పోసిన రైతులు వరినాట్లు వేస్తుండగా మరికొందరు పొలం మడులు దున్నుతున్నారు. జిల్లాకు సరఫరా అయ్యే విద్యుత్‌కంటే అధికంగా వాడుతుండడంతో అధికారులు కోతలు పెడుతున్నారు.
కలవర పెడుతున్న లోఓల్టేజీ సమస్య...
వచ్చే అరకొర కరెంట్‌కు తోడుగా రైతులను లోఓల్టేజీ సమస్య కలవరపెడుతోంది. మోటార్లు ఆగి ఆగి పోస్తుండడంతో పారిన మడే మళ్లీ పారుతోంది. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. పాడుబడిన బావుల్లోనూ నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు ఉన్న పొలా న్ని పూర్తిగా సాగు చేస్తున్నారు.
దీంతో కరెంట్ వినియోగం పెరగడంతో లోఓల్టేజీ సమస్య ఏర్పడుతోంది. ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటికి మించి మోటార్లు నడుస్తుండడంతో తరచు చెడిపోయి రైతులకు మరింత ఆర్థిక భారంగా మారుతున్నాయి. లోఓల్టేజీ కారణంగా కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు రోజూ నల్లగొండ ఎస్‌పీఎం షెడ్‌కు 12 నుంచి 15 వరకు వస్తున్నాయి. వీటిని రీపేరు చేసేందుకు 3 నుంచి 4 రోజుల సమయం పడుతుండడంతో పొలం మడుల్లో తడారిపోతుంది. కాగా, ఖరీఫ్ సీజన్‌లో నెలకు 20 ట్రాన్స్‌ఫార్మర్లు కూడా రిపేరు కోసం వచ్చేవి కావు.
అదనపు లోడుతో కాలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు...
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సమృద్ధిగా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ రబీలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. దశాబ్దకాలంగా పడావుపడిన బావులు, బోరులు ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో ట్రాన్స్‌కో అధికారుల లెక్కల ప్రకారం 3 లక్షల 25 వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అనధికారికంగా మరో 50 వేల దాకా ఉన్నాయి. దీంతో మన జిల్లాకు కేటాయిస్తున్న కోటా కంటే అదనంగా ఎక్కువ విద్యుత్ వినియోగమవుతోంది. అనధికార మోటార్ల వల్ల ట్రాన్స్‌ఫార్మర్ల మీద అదనపు లోడ్ పడి అవి తరచు కాలిపోతున్నాయి.
అధికారిక విద్యుత్ కోతలు ఇలా...
జిల్లా కేంద్రం.. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మున్సిపాలిటీలు.. ఉదయం 8 నుంచి 10, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మండల కేంద్రాలు.. ఉదయం 10 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు గ్రామాలు.. పగటి పూట వ్యవసాయానికి ఇచ్చే సమయంలో మాత్రమే ఉంటుంది. మిగతా సమయాల్లో కోతలు పొద్దస్తమానం అమలు చేస్తున్నారు.