
కూలిపోయిన పాఠశాల ప్రహరీ
అనంతపురం, పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలో చిత్రావతి రోడ్డులోని గంగమ్మ గుడిపక్కనున్న మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోవడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం రేడియో పాఠం వినిపించేందుకుగానూ ఉపాధ్యాయులు మూడో తరగతి పిల్లలను గదుల్లోంచి బయటకు పిలిపించి ప్రహరీకి కాస్త దగ్గరలో కూర్చోబెట్టారు. ఆ సమయంలో ఆ పాఠశాల పక్కన భవనం నిర్మిస్తున్న కాంట్రాక్టరు సుబ్బరాజు జేసీబీతో మట్టి తీయిస్తున్నారు.
అయితే ఆ జేసీబీ పొరపాటున ప్రహరీకి తగలడంతో గోడ కూలిపోయింది. ఆ రాళ్లు పడి పాఠశాల లోపల గోడ పక్కన కూర్చుని ఉన్న లావణ్య, మణికంఠ, పవన్, విష్ణు గాయపడ్డారు. ఉపాధ్యాయులు వెంటనే స్థానికుల సహాయంతో వారిని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుసత్రికి తరలించారు. విష్ణు తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఈ దుర్ఘటనపై ఉపాధ్యాయురాలు సునందాబాయ్ అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.