
ఇప్పుడే అనుకూలం
రబీలో ప్రధాన lపంటగా పప్పుశనగ సాగుకు అక్టోబర్ నెలంతా అనుకూలమని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు.
→ సమగ్ర యాజమాన్య పద్ధతులపై దష్టి సారించాలి
→ డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్
అనంతపురం అగ్రికల్చర్ : రబీలో ప్రధాన lపంటగా పప్పుశనగ సాగుకు అక్టోబర్ నెలంతా అనుకూలమని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, రాయదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్లు, నల్లరేగడి భూములున్న ఇతర ప్రాంతాల్లో కూడా పంట వేసుకోవచ్చన్నారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు.
పప్పుశనగ సాగు గురించి :
జిల్లాలో ఉన్న నల్లరేగడి నేలలు తక్కువ లోతు, నీటిని నిలుపుకునే శక్తి తక్కువగా ఉన్నాయి. మంచి పదునులో విత్తుకోవాలి. ఒక వేళ బెట్ట పరిస్థితులు ఏర్పడితే 30 నుంచి 35 రోజుల సమయంలోనూ, 55 నుంచి 60 రోజుల సమయంలో అవకాశం ఉంటే నీటి తడులు ఇచ్చుకుంటే పంట దిగుబడులకు ఢోకా ఉండదు. స్వల్పకాలిక పంటలను ఎంపిక చేసుకోవాలి. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు విత్తుకోవాలి. ఆలస్యంగా వేస్తే చివరి దశలో బెట్ట ఏర్పడటం లేదా అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. జేజీ–11, నంద్యాల శనగ–1, ఎన్‌బీఈజీ–47, 49 విత్తన రకాలు అనువైనవి. చౌడు, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు.
యాజమాన్యం :
ఎకరాకు గింజలు మధ్యస్థంగా ఉంటే 30 నుంచి 35 కిలోలు, లావుగా ఉంటే 45 నుంచి 50 కిలోలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 1.5 గ్రాములు టిబుకొనజోల్‌తో తప్పనిసరిగా విత్తనశుద్ధి పాటించాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 18 కిలోలు యూరియా, 125 కిలోలు సింగిల్ సూపర్‌పాస్ఫేట్ వేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి.