
తాండూరు మైన్స్ ఏడీగా రాంచంద్రయ్య
గనుల శాఖ తాండూరు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా రాంచంద్రయ్య నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గనుల శాఖ ఏడీగా పని చేస్తున్నారు.
సెలవులో వెళ్లిన ఏడీ జయరాజ్
తాండూరు : గనుల శాఖ తాండూరు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా రాంచంద్రయ్య నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గనుల శాఖ ఏడీగా పని చేస్తున్నారు. యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ ఇసుక తవ్వకాల వ్యవహారంలో వివాదంగా మారిన నేపథ్యంలో తాండూరు ఏడీ జయరాజ్‌పై కలెక్టర్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జయరాజ్ సెలవుపై వెళ్లగా.. ఆయన స్థానంలో తాండూరు ఏడీగా రాంచంద్రయ్యకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గనుల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన రెండు రోజుల్లో ఆయన తాండూరు ఏడీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఆయన ఇక్కడ ఏడీ పని చేశారు.
ఇదిలా ఉండగా ‘గనులు లూటీ’ శీర్షికతో శనివారం సాక్షితో ప్రచురితమైన ప్రత్యేక కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఏడీ రాంచంద్రయ్యను ఉన్నతాధికారులు ఆదేశించారు. చెక్‌పోస్టు వద్ద నామమాత్రపు తనిఖీలు, పెద్దేముల్, తాండూరు మండలాల్లో అక్రమ మైనింగ్ వ్యవహారాలు, జరిమానాల వసూలు తదితర అంశాలపై ఏడీ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా ఫోన్‌లో ఆయన సాక్షితో మాట్లాడుతూ పెద్దేముల్‌లో సుద్ద, తాండూరు మండలాల్లో నాపరాతి అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యాలాలలో ఇసుక తవ్వకాల అనుమతులపై గనుల శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారన్నారు. టీఏ ఇచ్చిన నివేదికలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా? లేదా? అనేది విచారణలో తేలుతుంద చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యం మేరకు రాయల్టీ వచ్చిందన్నారు. సిబ్బంది కొరత వల్ల పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. చెక్‌పోస్టు వద్ద తనిఖీలు పటిష్టం చేస్తామన్నారు.