తాగుబోతు రేంజర్‌.. ఫారెస్టుకే డేంజర్‌.. | drunken forest range officer hulchul in khammam | Sakshi
Sakshi News home page

తాగుబోతు రేంజర్‌.. ఫారెస్టుకే డేంజర్‌..

Published Thu, Jan 18 2018 8:20 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

drunken forest range officer hulchul in khammam - Sakshi

అదొక అటవీ కార్యాలయం.. ఆ తాగుబోతుకు నిలయం..
అక్కడొక రేంజర్‌.. అతడొక డేంజర్‌..
డ్యూటీకి వచ్చాడు.. బాటిల్‌ తెరిచాడు..
పీకలదాకా తాగాడు.. పడిపోయేలా తూలాడు..
నోట్లో కుక్కేసాడు.. భళ్లున కక్కేసాడు..
సిగ్గూఎగ్గూ ఒగ్గేసాడు.. మూత్రం వదిలేసాడు..
వద్దంటే వినడు.. ‘పంచాంగం’ విప్పాడు..
ఊరుకోమంటే ఊరుకోడు.. సారొస్తున్నారంటే ఉరికాడు..

కారేపల్లి: కారేపల్లిలలోని ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయాన్ని అక్కడి రేంజర్‌.. మద్యం దుకాణంగా మార్చేశాడు. డ్యూటీకని రావడం.. అక్కడే పీకలదాకా మద్యం పుచ్చుకోవడం.. తినడం.. తలకు మద్యం మత్తు ఎక్కాక తాగుబోతులా మారడం.. ఎవరినిపడితే వారిపై అంతెత్తున లేవడం.. బూతుల పంచాంగం వినిపించడం.. తానేం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఎక్కడపడితే అక్కడ మూత్రం విసర్జించడం.. ‘సారూ, ఇదేమి తీరు’ అంటూ సున్నితంగా వారించబోయిన సిబ్బందిపై నోరు జారడం.. తూగుతూ–తూలుతూ పడిపోవడం.. చివరికిలా అలసిసొలసి, సిబ్బంది

చేతి సాయంతో జీపెక్కడం.. ఇంటికెళ్లడం..!
‘ఇదంతా ఏమిటి?’ అనుకుంటున్నారా..? కారేపల్లిలోని ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయంలో తరచూ జరిగే తంతు. బుధవారం కూడా ఇక్కడ ఇదే దృశ్యం కనిపించింది.
ఆయన పేరు శ్రీహరి ప్రసాద్‌. ఫారెస్ట్‌ రేంజర్‌. కారేపల్లిలోని అటవీశాఖ రేంజ్‌ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఈయనకు మద్యం అలవాటు ఉంది. ఇంటి వద్దనో, మరెక్కడో తాగితే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ, ఆయన ఏకంగా తన అధికారిక కార్యాలయాన్నే ‘మద్యం దుకాణం’గా మార్చేశాడు. మందు బాటిళ్లు తెచ్చుకోవడం, తాగడం, తిండి తినడం, తందనాలాడడం (సిబ్బందిపై, చుట్టుపక్కల దుకాణాల నిర్వాహకులపై నోరు జారడం) అలవాటుగా మారింది.
బుధవారం కూడా ఇలాగే చేశాడు. పీకలదాకా మద్యం పట్టించాడు. మత్తులో తూలుతూ బయటికొచ్చాడు. రేంజ్‌ కార్యాలయ ఆవరణలోగల ఓ సెక్షన్‌ ఆఫీసర్‌కు చెందిన ద్విచక్ర వాహనం వద్దకు వెళ్లాడు. అప్పటికే విచక్షణాజ్ఞానం కోల్పోయాడేమో...! సిబ్బంది, చుట్టుపక్కల దుకాణాలవారు, జనం.. ఇలా అందరూ చూస్తుండగానే ఆ వాహనంపై మూత్రం విసర్జించాడు. అక్కడే భళ్లున వాంతులు చేసుకున్నాడు. ఇదంతా చూసిన కొందరు.. ‘ఛీఛీ’ అని చీదరించుకున్నారు. విలేకరులకు సమాచారమిచ్చారు.
స్థానిక విలేకరులు అక్కడకు చేరుకునేసరికి ఆ ఆఫీసర్‌ తన కార్యాలయంలోని సీట్లో కూర్చుని ఉన్నాడు. మద్యం మత్తు దిగలేదేమో... కళ్లు మూసి తెరుస్తూ నిద్ర మత్తులో ఉన్నట్టుగా తూగుతున్నాడు. ఆ దృశ్యాన్ని విలేకరులు ఫొటో తీస్తున్నారు.
ఆ హడావుడితో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తన ముందున్నది విలేకరులని, ఫొటోలు తీస్తున్నారని గ్రహించాడు. అసలే మద్యం మత్తులో ఉన్నాడు. ఫొటోలు తీస్తుండేసరికి చిర్రెత్తుకొచ్చింది. ఒక్క ఉదుటున లేచేందుకు ప్రయత్నించాడు, పాపం.. లేవలేకపోయాడు. తిట్ల దండకం అందుకున్నాడు. విలేకరులు వెంటనే డీఎఫ్‌ఓ (డిస్ట్రిక్ట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌)కు ఫోన్‌ చేసి చెబుతుండగా విన్నట్టున్నాడు. అతి కష్టంగా లేచి, అక్కడి నుంచి ఉడాయించాడు.
పోతూ పోతూ.. తాను తెచ్చుకున్న మద్యం బాటిల్‌ను తన చాంబర్‌ బీరువాలో నుంచి తీసుకెళ్లడం మరిచిపోయాడు.
డీఎఫ్‌ఓ సునీల్‌ హెరామత్‌ ఆదేశాలతో ఎఫ్‌డీఓ (ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌) సిహెచ్‌.ప్రకాశ్‌రావు వెంటనే వచ్చారు. రేంజర్‌ చాంబర్‌ను తనిఖీ చేశారు. బీరువాలోగల మద్యం బాటిల్‌ను స్వాధీనపర్చుకున్నారు. రేంజర్‌ శ్రీహరి ప్రసాద్‌ వ్యవహారంపై విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులైన అక్కడి ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, బీట్‌ ఆఫీసర్లు, సిబ్బంది నుంచి వివరాలను లిఖితపూర్వకంగా సేకరించారు.  
 ‘‘రేంజర్‌ సారు ఆల్కహాల్‌ తీసుకున్నారు. రిపోర్టర్లపై తిరగబడ్డారు’’ అని అక్కడి అధికారులు. సిబ్బంది తాము చూసింది చూసినట్టుగా చెప్పారు.   
విలేకరులతో ఎఫ్‌డీఓ సిహెచ్‌.ప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి రేంజర్‌పై తక్షణ చర్యలు ఉంటాయి. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తాను’’ అని చెప్పారు.

గత ఏడాది నవంబర్‌ 1న ఇలాగే...
ఈ రేంజర్‌ సారు గత ఏడాది నవంబర్‌ 1వ తేదీన కూడా ఇలాగే ప్రవర్తించారు. ఫుల్‌గా తొగి ఆఫీసుకొచ్చారు. ఆ తరువాత ఆఫీస్‌లో మరో ‘రౌండ్‌’ వేశారు. మద్యం మత్తులో ఆఫీస్‌లోని బెంచ్‌పై కాసేపు బొర్లారు. ఆ తరువాత ఆఫీస్‌ మెట్లు దిగలేక.. దిగలేక.. సిబ్బంది సహాయంతో అతి కష్టంగా దిగి, జీపు వరకు వెళ్లారు. అందులో ఎక్కేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా అప్పుడు పత్రికల్లో సచిత్రంగా ప్రచురితమైంది. అయినప్పటికీ అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించలేదు. ఈయన గారి తీరు కూడా మారలేదు. ‘‘ఈ తాగుబోతు రేంజర్‌.. ‘ఫారెస్టు’కే డేంజర్‌ అనే వాస్తవాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు ఎందుకు గుర్తించడం లేదు? తమ శాఖ పరువును బజారున బట్టబయలు చేస్తున్న ఈ తాగుబోతు రేంజర్‌ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు..?’’ అనే ప్రశ్నలు ఇక్కడి ప్రజల్లో తలెత్తుతున్నాయి. వీటికి సమాధానాల కోసం వారు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement