
సాక్షి, తిరువనంతపురం : కేరళను ముంచెత్తిన వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. వరద తాకిడికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోజికోడ్, కన్నూర్‌లలో వరద తాకిడికి తొమ్మిదేళ్ల బాలిక మరణించగా, మరో పది మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం జాతీయ విపత్తు నిర్వహణ బలగాలకు చెందిన బృందాలు, రాష్ట్ర బృందాలు కోజికోడ్‌లో గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు.
ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 22,918 ఎకరాల పంట ధ్వంసమైంది. పంప, మణిమాల, కకత్తార్ నదులు పొంగిపొర్లుతున్నాయని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు తోడు పెనుగాలులు వీస్తుండటంతో చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోజికోడ్‌లో కుండపోత కారణంగా వీధుల్లో మోకాలిలోతు నీళ్లు చేరాయి. కాగా, భారీ వర్షాలతో కేరళలో మరణాల సంఖ్య ఇప్పటివరకూ 25కు చేరింది.