
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ఈనెల 10న ప్రధాని మోదీ పర్యటించనున్నారని సీఎం పినరయి విజయన్ చెప్పారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి వందలాదిమంది చనిపోవడం తెల్సిందే. బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటిస్తారని విజయన్ వివరించారు. ఈ దుర్ఘటనలో బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని సీఎం విజయన్ చెప్పారు.
తమ వినతి మేరకు 9 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ అంగీకరించిందన్నారు. ఈ కమిటీ విపత్తు తీవ్రతను అంచనా వేసి, నివేదిక ఇస్తుందన్నారు. ఈ దుర్ఘటనలో 131 మంది వరకు గల్లంతైనట్లు గుర్తించామన్నారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ ప్రధాని మోదీ వయనాడ్‌లో పర్యటనకు రానుండటం గమనార్హం.