ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపేశారు..!
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు వైఫల్యం చెందడంపై బాలింతల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
► కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స పూర్తి చేయకుండానే పంపించేసిన వైద్యుడు
► ఆగ్రహం వ్యక్తం చేసిన బాలింత కుటుంబసభ్యులు
► ఎచ్చెర్ల పీహెచ్‌సీలో ఘటన
ఎచ్చెర్ల(ఒడిశా): ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు వైఫల్యం చెందడంపై బాలింతల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యుడైన వైద్యుని తీరుపై బాధితులు మండిపడ్డారు. ఆపరేషన్ చేయడం చేతకాదని ముందే చెబితే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే వారమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఎచ్చెర్ల పీహెచ్‌సీలో కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు నిర్వహించారు. కుశాలపురం గ్రామానికి చెందిన బొడ్డేపల్లి అనూషను శస్త్రచికిత్స కోసం తీసుకొచ్చారు. ఆమెకు ప్లాట్ ఎక్కువగా ఉందని, శస్త్రచికిత్స కష్టంగా ఉంటుందని చెబుతూనే వైద్యుడు శ్రీనివాసరావు ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. అరగంట సేపు వైద్యం చేసి ఆపరేషన్‌కు వీలు కావటం లేదని చెప్పి కుట్లు వేసేశారు. వారం తర్వాత రిమ్స్‌లో ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి బెడ్‌పైకి పంపించేశారు.
దీంతో అనూష తల్లిదండ్రులు పద్మ, కృష్ణతో పాటు కుటుంబసభ్యులు వైద్యునిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చేతకాకపోతే ముందే చెప్పాలని, ఇలా ఆపరేషన్ మధ్యలో తమవల్ల కాదని వదిలేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. పేషెంట్‌కు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని మండిపడ్డారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తామని చెప్పారు. ఈమె కంటే ముందు సర్జరీకి వెళ్లిన నందిగాం గ్రామానికి చెందిన పట్నాన నాగమ్మ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈమెకు కూడా ఆపరేషన్ మధ్యలో నిలిపివేసి బెడ్‌మీద పడేశారు. నాగమ్మకు బ్లీడింగ్ ఆగకపోవడం వల్లే ఆపరేషన్ చేయడం వీలుకాలేదని వైద్యులు చెప్పారు. బుధవారం కూడా ఇక్కడ ఇదే పరిస్థితి చోటుచేసుకుందని రోగులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. బుధవారం చేసిన శస్త్ర చికిత్సల్లో రెండు కేసులను ఇలా మధ్యలోనే నిలిపివేసి ఇంటికి పంపించేశారని అంటున్నారు.
ఈ విషయమై వైద్యుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇక్కడ మత్తు ఇంజక్షన్ డోస్ తక్కువగా ఉందని తెలిపారు. ప్లాట్ ఉన్నవారికి ఆపరేషన్ చేస్తే వారికి నొప్పి వస్తుందని చెప్పారు. అనూష అనే పేషెంట్ నొప్పి భరించలేకపోవటంతో ఆపరేషన్‌ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. బుధవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి వల్ల శస్త్రచికిత్సలను నిలిపివేశామని స్పష్టం చేశారు.