
సద్గుణ భూషణాలు
మానవుడిలో ఉండే సత్‌గుణాలే అతణ్ని ఒక మహనీయుడిగా చరిత్రపుటల్లో సుస్థిర స్థానాన్ని కలిగివుండే వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి.
మానవుడిలో ఉండే సత్‌గుణాలే అతణ్ని ఒక మహనీయుడిగా చరిత్రపుటల్లో సుస్థిర స్థానా న్ని కలిగివుండే వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. వివే కగుణసంపన్నుడైన మానవుడే తనలో దాగి ఉన్న బుద్ధి సంపదను గుర్తించి తన జన్మ సార్థకమయ్యేందుకు కావలసిన సద్గుణాలు అనే భూషణాలను ధరించగలుగుతాడు. శరీరానికి, గుణాలకు భేదం చాలా ఉన్నది. శరీరమేమో అశాశ్వతమైనది. యుగయుగాల వరకు శాశ్వతంగా చరిత్రలో నిలిచేవి సద్గుణాలే అనే విషయాన్ని శరీరస్య గుణానంచ దూరమత్యంత మంతరమ్
శరీరం క్షణవిధ్వంసి కల్పాంతస్థాయినో గుణాః॥
అనే శ్లోకం ధ్రువపరుస్తున్నది.
సద్గుణాలను అలవరచుకోవలసిన అవసరాన్ని పెద్దలు చెప్పా రు. అధిక విలువ కలిగిన మణి తల పైన, కంఠంలో, భుజాలకు దరించే అభరణాలలో, చివరకు పాదపీఠంపై కూడా ప్రకాశి స్తుంది. అట్లే సద్గుణవంతులు అన్ని చోట్ల పేరు ప్రతిష్టలను గౌర వాభిమా నాలను పొందగలుగుతారు అనే విషయం ‘‘సర్వత్ర గుణవానేవ చకాస్థి ప్రథితో నరః
మణిర్మూర్ధ్ని గలే బహౌ పాదపీఠే పి శోభతే॥
అనే సూక్తి ద్వారా వెల్లడవుతున్నది.
ఏ మనిషికైనా గుణాలను బట్టి గౌరవం, ఆత్మయత లభిస్తాయి. ఎత్తయిన ఆసనం మీద కూర్చోవడం వల్ల లభించవు. ఎత్తయిన భవన శిఖరంపైకి వెళ్లి వాలినంత మాత్రాన కాకి గరుత్మంతుడితో సమానమైన ప్రతిష్టను పొందజాలదు. ఉన్నతాస నంపై కూర్చోగానే నిర్గుణుడు గుణశేఖరుడు కాలేడని గుణాల వల్లనే ఒక వ్యక్తి మహోన్నతుడిగా పరిగణింపబడతాడని
‘‘గుణైరుత్తుంగతాం యాతి నోచ్చై రాసనసంస్థితః
ప్రాసాద శిఖరస్థోకపి కాకః గరుడాయతే॥
అనే శ్లోకం చెబుతోంది. అలాగే పుట్టుకనుబట్టి గొప్పతనం సిద్ధించదు.
ఒక ఎతైన పర్వతంపైకి పెద్ద బండరాయిని తీసుకపోవడం ఎట్లా కఠోరమైన పరిశ్రమతోనే సాధ్యమవుతుందో, అట్లే విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న గుణాలను అలవరచుకోవడం సులభ సాధ్యం కాదు. పెద్ద బండరాయిని కొండపై నుంచి క్రిందకు పడదోయడం ఎంత సులభమో దోషాలను అలవరచుకొనడం అంతసులభమైన పని అని తెలిపే ఈ సూక్తి సారాన్ని ఒంటబట్టించుకుందాం.
ఆరోప్యతే యథా శైలే యత్నేన మహతా శిలా
క్షిప్యతే చ క్షణేనైవ తథాత్మ గుణదోషయోః॥
మనలో ఉండే వివేకాన్ని తట్టి లేపుదాం. సువర్ణాభరణా లకన్న, రత్నహారాలకన్న మనిషిని ప్రకాశింపచేసే అసలు సిసలైన అభరణాలు సద్గుణాలే అనే విషయాన్ని గుర్తిద్దాం. సమున్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సోపానాలు సద్గుణా లేనని, సద్గుణాలే ప్రగతి కారకాలనే విషయాన్ని దృఢంగా విశ్వ సిద్దాం. సద్గుణ ప్రాప్తికై త్రికరణ శుద్ధితో సాధన చేద్దాం. సత్ఫలితాలను పొందుదాం.
- సముద్రాల శఠగోపాచార్యులు