
కమల్‌నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని తన సొంత జిల్లా చింద్వాడాలో కాంగ్రెస్ అత్యధిక ఆధిక్యంతో గెలుపొందిన నియోజకవర్గం నుంచి తాను త్వరలో పోటీ చేస్తానని మధ్యప్రదేశ్ కాబోయే సీఎం కమల్‌నాథ్ చెప్పారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో కమల్‌నాథ్ పోటీ చేయకపోయినప్పటికీ ఆయనను మధ్యప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం సీఎం పదవిలో ఆయన కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కావడం తప్పనిసరి.
ఇక చింద్వాడా జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో నాలుగు ఎస్సీ/ఎస్టీ రిజర్వ్‌డు స్థానాలు. దీంతో మిగిలిన మూడు స్థానాలైన చింద్వాడా, చౌరాయ్, సౌన్సర్‌లలో ఏదో ఓ చోటు నుంచి కమల్ చేయొచ్చు. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా, ఈ మూడింటిలో అత్యధిక ఆధిక్యం కాంగ్రెస్‌కు చింద్వాడాలోనే లభించింది. కమల్ ఇల్లు, ఓటరు జాబితాలో పేరు చింద్వాడాలో ఉన్నాయి. దీంతో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి శాసనసభకు ఎన్నికవుతారని సమాచారం. చింద్వాడాలో కాంగ్రెస్ తరఫున శాసనసభకు ఎన్నికైన దీపక్ సక్సేనా తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయక తప్పని పరిస్థితి.
ప్రమాణానికి రాహుల్, మమత
కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్స్‌న్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులకు కూడా కమల్‌నాథ్ ఆహ్వానాలు పంపారని సమాచారం.