కేరళ ట్రంప్‌ కార్డు మోహన్‌లాల్‌! | RSS pushes Mohanlal as BJP nominee | Sakshi
Sakshi News home page

కేరళ ట్రంప్‌ కార్డు మోహన్‌లాల్‌!

Published Wed, Sep 5 2018 1:10 AM | Last Updated on Wed, Sep 5 2018 1:10 AM

RSS pushes Mohanlal as BJP nominee - Sakshi

ప్రధాని మోదీతో మోహన్‌లాల్‌ కరచాలనం

న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేరళలో పట్టు సాధించాలని వ్యూహాలు పన్నుతున్న బీజేపీ మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ను ట్రంప్‌ కార్డులా ప్రయోగించాలని భావిస్తోందా? తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి శశి థరూర్‌కు వ్యతిరేకంగా పోటీకి నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తోందా ? పనిలో పనిగా మోహన్‌ లాల్‌ సినీ గ్లామర్‌ను ప్రచారానికి వాడుకోవాలని వ్యూహరచన చేస్తోందా? ఈ ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.

మోహన్‌ లాల్‌ సోమవారం ప్రధాని మోదీని కలుసుకోవడంతో ఆయన రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు పెరిగాయి. తాను నడుపుతున్న విశ్వశాంతి ఫౌండేషన్‌ సామాజిక కార్యకలాపాలను వివరించడానికే ప్రధానిని కలుసుకున్నానని మోహన్‌లాల్‌ చెబుతున్నా తెరవెనుక ఆయన రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైందనే వార్తలొచ్చాయి. కేరళ అసెంబ్లీలో బీజేపీకి ఒక్కరే సభ్యుడు ఉన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మరో నటుడు సురేష్‌ గోపి పన్ను ఎగవేత కేసుల్లో చిక్కుకోవడంతో రాష్ట్రంలో పార్టీకి జనాకర్షక నాయకుడు లేని పరిస్థితి తలెత్తింది.

మోదీతో సత్సంబంధాలు..
నోట్ల రద్దు సమయంలో మోహన్‌లాల్‌ బహిరంగంగానే మోదీకి మద్దతు పలికారు. అవినీతిని శాశ్వతంగా నిర్మూలించడం కోసం ప్రజలు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పడడంలో తప్పేమీ లేదన్నారు. మోహన్‌లాల్‌కి బీజేపీతో ఆ సాన్నిహిత్యం ఏమిటన్న ప్రశ్నలు  అప్పట్లోనే వినిపించాయి.

గత ఏడాది కూడా స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమంలో పాల్గొనాలని మోహన్‌లాల్‌కు మోదీ లేఖ రాశారు. దేశాన్ని పరిశుభ్రం చేసే ఈ మహాయజ్ఞంలో మోహన్‌లాల్‌ పాల్గొంటే లక్షలాది మంది ఆయన్ని అనుసరిస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు. మోదీ ఆహ్వానం మేరకు మోహన్‌లాల్‌ గాంధీ జయంతి నాడు చీపురు చేతపట్టి తిరువనంతపురంలో ఒక స్కూలుని శుభ్రం చేశారు.

సామాజిక సేవే రాజకీయ పునాది
58 ఏళ్ల మోహన్‌లాల్‌ 300కు పైగా సినిమాల్లో నటించి మలయాళీ ప్రజల్లో ప్రత్యేక స్థానం పొందారు. సినీ గ్లామరే కాదు ఆయనలోని సామాజిక సేవ ఎంతో మంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది. తల్లిదండ్రులు విశ్వనాథన్‌ నాయర్, శాంతకుమారిల జ్ఞాపకార్థం మోహన్‌లాల్‌ విశ్వశాంతి ఫౌండేషన్‌ నెలకొల్పి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వయనాడ్‌లో కేన్సర్‌ ఆసుపత్రి కట్టారు. నవ కేరళ ఆవిర్భావం కోసం మార్గాలను అన్వేషించడానికి గ్లోబల్‌ మలయాళీ రౌండ్‌ టేబుల్‌ సదస్సు ఏర్పాటు చేశారు.

కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రారంభోత్సవం, మలయాళీ సదస్సుకు ఆహ్వానించడానికే మోదీని కలుసుకున్నానని మోహన్‌లాల్‌ ట్వీట్‌చేశారు. మోహన్‌లాల్‌ సామాజిక సేవా గుణం ఎందరిలోనో స్ఫూర్తి నింపుతోందని మోదీ ట్వీట్‌చేశారు. ఈ పరిణామాలతో సామాజిక సేవ పునాదుల మీదే మోహన్‌లాల్‌ రాజకీయ ప్రవేశానికి బీజేపీ రంగం సిద్ధం చేస్తోందంటూ రాజకీయ వేడి మొదలైంది.

మరోవైపు, మోహన్‌లాల్‌ విశ్వశాంతి ఫౌండేషన్‌తో కలిసి ఆరెస్సెస్‌కు చెందిన రాష్ట్రీయ సేవాభారతి రాష్ట్రంలో పలుసేవా  కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేరళ వరదల సహాయ కార్యక్రమాల్లో కూడా ఈ రెండు సంస్థలు కలిసి పనిచేశాయి. మోహన్‌లాల్‌ను తిరువనంతపురం నుంచి లోక్‌సభ బరిలోకి దింపడానికి ఆరెస్సెస్‌ ప్రయత్నాలు చేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement