సీఎం గారూ.. అపాయింట్మెంట్ ఎప్పుడిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో తక్షణమే తెలియజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ, నాలుగు కోట్ల మంది ప్రజలను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
బంగారు తెలంగాణ అంటే అన్ని వర్గాల నేతలు, ప్రజలు, పార్టీలను సమ్మెల దాకా తీసుకెళ్లేలా చేయడమా అని ప్రశ్నించారు. అధికారులతో సమీక్షల మీద సమీక్షలు చేయడమే పరిపాలన కాదని హితవు పలికారు. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ అందేలా చేయాలని, తొలగించిన పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని అమరవీరుల స్తూపం వద్ద వినతిపత్రం ఉంచామన్నారు.
దివంగత సీఎం వైఎస్సార్ తన పదవీ కాలంలో ప్రజల కోసం ఏకంగా క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ ఎక్కడుంటారో ఎవరికీ అంతుబట్టదన్నారు. లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన సీఎం.. పారిశుధ్య కార్మికులను తొలగించడమేంటనీ ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్ రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఆదం విజయ్ కుమార్, జి.సురేష్ రెడ్డి, మైనార్టీ నేతలు ముజ్తబ అహ్మద్, హర్షద్, యువజన-ఐటీ విభాగం అధ్యక్షులు బీష్వ రవీందర్, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.