Ramadan 2025
-
గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
రంజాన్ పండుగతో పాటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల ఉపవాస దీక్షలు ముగిసినా గాజాలో మాత్రం పాలస్తీనియన్లకు నిత్య ఉపవాసాలే కొనసాగుతున్నాయి. తినడానికి ఏమీ లేక ఖాళీ జనం డొక్కలెండుతున్నాయి. గాజాకు మానవతా సాయాన్ని, ఆహార సరఫరాను ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకోవడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజం భారీ పరిమాణంలో పంపిన ఆహార నిల్వలన్నీ సరిహద్దుల వద్దే కుళ్లిపోతున్నాయి. గాజా ఏమో నిస్సహాయ స్థితిలో ఆకలితో యుద్ధం చేస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా కూడా కనీసం రొట్టెముక్కయినా దొరకని కుటుంబాలెన్నో...! ఇది చాలదన్నట్టు పిండి నిల్వలు కూడా పూర్తిగా నిండుకోవడంతో తాజాగా గాజాలో బేకరీలన్నీ మూతబడ్డాయి!!ఈద్. పవిత్ర రంజాన్ మాసానికి ముగింపు. సాధారణంగా అయితే గాజావాసులకూ వేడుకే. కుటుంబాలన్నీ కలిసి ఆనందంగా పండుగ జరుపుకొంటాయి. కానీ గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అక్కడ ఈద్ పాలస్తీనావాసుల ఆకలి కేకలు, ఇజ్రాయిల్ బాంబు దాడుల నడుమే ముగిసింది. యుద్ధం దెబ్బకు గాజా ఆహారోత్పత్తి సామర్థ్యం పూర్తిగా పడకేసింది. దాంతో తిండికి కూడా అంతర్జాతీయ సాయంపైనే ఆధారపడుతోంది. ఇజ్రాయెల్ మాత్రం తమ బందీల విడుదల కోసం హమాస్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నుంచే గాజాకు ఆహారం, మానవతా సాయం సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. దాంతో సహాయక ట్రక్కులు గాజాలో అడుగు పెట్టి మూడు వారాలు దాటింది. 18 నెలల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచీ గాజాకు ఇంతకాలం పాటు ఎలాంటి ఆహార సరఫరాలూ అందకపోవడం ఇదే తొలిసారి. దాంతో ఇంధనం తదితరాల కొరత తారస్థాయికి చేరింది. అంతేకాదు, కనీసం పిండి నిల్వలు కూడా లేని పరిస్థితి! దాంతో బుధవారం గాజాలోని బేకరీలన్నీ మూతబడ్డాయి. స్థానిక బేకరీ యజమానుల సంఘం చీఫ్ అబ్దెల్ నాసర్ అల్–అజ్రామి ఈ మేరకు ప్రకటించారు. ‘‘గిడ్డంగుల్లో పిండి పూర్తిగా అయిపోయినట్టు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) మాకు తెలిపింది. ఇజ్రాయిల్ రఫా క్రాసింగ్ తదితరాలను తెరిచి సహాయక సామగ్రి, మానవతా సాయాలను తిరిగి గాజాలోకి అనుమతించేదాకా బేకరీలు పనిచేయబోవు’’అని వెల్లడించారు. అబద్ధాలతో నిద్రపుచ్చుతూ... పాలస్తీనియన్ల ఆకలిని తీరుస్తున్న ప్రధాన వనరు రొట్టె మాత్రమే. చికెన్, మాంసం, కూరగాయలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. అందుబాటులో ఉన్న ఇతర ఆహార పదార్థాలను రొట్టెను తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ‘‘పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉంది. నా కుటుంబసభ్యులకు బ్రెడ్ కోసం ఉదయం 8 గంటల నుంచీ వెతుకుతున్నాను. డెయిర్ అల్–బలాహ్లోని అన్ని బేకరీల చుట్టూ తిరిగా. ఒక్కటి కూడా పనిచేయడం లేదు. పిండి లేదు. కట్టె లేదు. ఏమీ లేవు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఇంత దారుణం చూస్తామని ఎన్నడూ అనుకోలేదు’’అని ఇబ్రహీం అల్ కుర్ద్ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘పిల్లలు రాత్రి భోజనం చేయకుండానే పడుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి, ఉదయాన్నే పిండి తెచ్చుకుందామని వారికి అబద్ధాలు చెబుతూ నిద్రపుచ్చుతున్నాం’’అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. రఫా తదితర క్రాసింగ్లను తిరిగి తెరిచేలా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఆయన వేడుకుంటున్నాడు. చుక్కల్లో పిండి ధరలు... రొట్టెతో పాటు గాజావాసులకు వంట కోసం గ్యాస్‌ను కూడా బేకరీలే అందించేవి. అవి మూతబడటంతో తిండి వండుకోవడానికి కలపనే ఆశ్రయిస్తున్నారు. కానీ దానికీ తీవ్ర కొరతే ఉంది. కలపను బ్లాక్ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారు. దాంతో అదీ జనానికి అందుబాటులో లేకుండా పోయింది. నూనె, ఈస్ట్ వంటి బేకింగ్ పదార్థాలు కూడా కొనలేని పరిస్థితి! బేకరీలు మూతబడటంతో పిండి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఒక్క సంచీ ఏకంగా 400 షెకెల్స్ (115 డాలర్ల)కు అమ్ముతున్నారు. యుద్ధానికి ముందు 25 షెకెల్స్ ఉండేది. గత జనవరిలో స్వల్పకాలిక కాల్పుల విరమణ సందర్భంగా కూడా 35 షెకెల్స్కు దొరికేది. ‘‘ప్రజలు ఇప్పుడు యుద్ధ భయాన్ని, బాంబు దాడులను, వలస కష్టాలను, అన్నింటినీ మర్చిపోయారు. వారి ఆలోచనలన్నీ ఏ పూటకు ఆ పూట పిండి ఎలా దొరుకుతుందా అన్నదాని మీదే ఉన్నాయి’’అని ఉత్తర గాజాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ డ్రెమ్లీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధం మొదలైనప్పుడు ప్రజలు ఆరోగ్యంగా, దేన్నయినా తట్టుకునే సామర్థ్యంతో ఉన్నారు. ఇప్పుడంతా మారిపోయింది. రొట్టెకు కూడా దిక్కు లేదు! దాంతో జనం ఏది దొరికినా తిని కడుపు నింపుకుంటున్నారు. కానీ కొద్ది రోజులుగా చాలామందికి తినేందుకు ఏమీ దొరకడం లేదు. బియ్యం కొనడానికి అప్పు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. చాలామంది పాలస్తీనియన్లు రద్దీగా ఉన్న గుడారాల్లో బతుకీడుస్తున్నారు. కొందరైతే వీధుల్లోనే నిద్రపోతున్నారు. తిండి వండుకునే పరిస్థితులు కూడా లేవు’’అంటూ గాజాలోని దైన్యాన్ని ఆయన వివరించారు. దారుణ సంక్షోభం: ఐరాస ‘‘కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల్లో సహాయక సామగ్రి వచ్చేది. ఇప్పుడన్నీ ఆగిపోయాయి. కాల్పుల విరమణ ముగిసి యుద్ధం తిరిగి మొదలైనప్పటినుంచీ ఘోరమైన మానవతా సంక్షోభం నెలకొంది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆపేసింది. ముఖ్యంగా బేకరీల మూతతో ఆహారం కోసం కేవలం వాటిపైనే ఆధారపడ్డ లక్షలాది మంది అల్లాడుతున్నారు. దిగ్బంధాన్ని తక్షణం ఎత్తేయకపోతే గాజాలో త్వరలోనే మరణమృదంగం తప్పదు’’అని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారి హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రేమను పంచే శుభదినం ఈద్
ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ పర్వదినం ప్రపంచంలోని ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన, ఆనందకరమైన వేడుక. అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా వారు ఈవేడుకను జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘ఈద్’ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ను అనుసరించి రంజాన్ నెల ముగిసిన మరునాడు దీన్ని జరుపుకుంటారు.రంజాన్, ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ముస్లింలు ప్రత్యేకంగా ఉపవాసం (సియామ్) పాటిస్తారు, అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు భోజనం, పానీయాలు, ఇతర శరీర సంబంధిత అవసరాలన్నీ త్యజిస్తారు. ఉపవాసం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక శుద్ధి ప్రక్రియగా భావించ బడుతుంది, ఇది స్వీయ నియంత్రణ, ప్రేమ, దయ, జాలి, క్షమ, సహనం, పరోపకారం, త్యాగం లాంటి అనేక సుగుణాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా వారు వారి దైనందిన సేవాకార్యక్రమాలను మరింత విస్తరించుకొని, నైతికంగా, ఆధ్యాత్మికంగా తమ వ్యక్తిత్వాలను నిర్మించుకొని దేవుని కృపా కటాక్షాలు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, సమాజంలో పేదరికాన్ని తొలగించే ప్రయత్నం కూడా ఎంతోకొంత జరుగుతుంది. దాతృత్వం, సామాజిక సేవలకుప్రాధాన్యం ఇవ్వడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ తమ తోటి సోదరులకు సహకరిస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోడానికి ప్రయత్నిస్తారు. సదఖ, ఫిత్రా, జకాత్ ల ద్వారా అర్హులైన అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు.ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సమస్త మానవాళి, సర్వ సృష్టిరాశి సుఖ సంతోషాలను కాంక్షించే రోజు. ఆనందం, శాంతి, సంతోషం, సమానత్వం, క్షమ, దయ, జాలి, పరోపకారం, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించే ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం ఒక ఆథ్యాత్మిక క్రతువు కాదు. సమాజంలో ప్రేమ, సహకారం, పరస్పర మైత్రి, బాధ్యత, ఆనందాలను పంచుకునే వేడుక. రంజాన్ నెల రోజుల శిక్షణ ద్వారానూ, ఈద్ పండుగ ద్వారానూ సమాజం ఆధ్యాత్మికతను, మానవతా విలువలను పునరుద్ధరించుకుంటుంది.పండగ తర్వాత కూడా...ఈద్ తో రోజాలకు వీడ్కోలు పలికినప్పటికీ, నెలరోజులపాటు అది ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ తొణికిస లాడాలి. పవిత్ర రంజాన్ లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకునే గుణం, పరమత సహనం, సర్వ మానవ సమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి, తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలులేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమ సమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రంజాన్ ధ్యేయం.ఈ రోజు ముస్లింలు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రతను పొందుతారు. ఈద్ నమాజ్ /ప్రార్థన ఆచరించి కుటుంబంతో, స్నేహితులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా తీసుకుంటారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక, మానవీయ సుగుణాలను పునరుధ్ధరించే మహత్తరమైన రోజు. ఈ పండుగ రోజున ముస్లిం సమాజం జకాతుల్ ఫిత్ర్ అనే దానం కూడా ఇస్తారు. పేదసాదలను గుర్తించి వారికి ఫిత్రా దానాలు చెల్లించడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకోవడం కాకుండా తమ బాధ్యతను నెరవేర్చామని భావిస్తారు.రంజాన్ నెల ముగియగానే, షవ్వాల్ నెల మొదటి రోజు ముస్లిం సోదరులు ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం జరుపుకుంటారు. ‘ఫిత్ర్’ అంటే దానం, పవిత్రత లేదా శుద్ధి అని కూడా అంటారు. ఇది ఉపవాసం,ప్రార్థనల ధార్మిక విధిని పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూప సందర్భం.– మదీహా అర్జుమంద్ -
ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్లొన్నారు. ‘‘ఈద్ ముబారక్’’ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. విజయవాడలో బుధవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ మంత్రులు అంజాద్ బాషా, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, పార్టీ నేతలు పూనూరు గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపం వద్ద జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఉప్పొంగిన అభిమానంవిజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్‌కు ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఎన్ఏసీ కళ్యాణ మండపం ఉండే గురునానక్ కాలనీ రోడ్డు, వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. వైఎస్ జగన్ అభివాదం చేయగానే సీఎం, సీఎం నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై జగన్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. -
చార్మినార్‌కు వెళుతున్నారా.. పార్కింగ్ ప్రాంతాలు ఇవే..
చార్మినార్: రంజాన్ మాసం చివరి దశకు చేరుకోవడంతో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీలో ముందస్తు చర్యలు చేపట్టారు. మార్కెట్లకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా చార్మినార్ (Charminar) యునానీ ఆసుపత్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం 7 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. నగరం నుంచే కాకుండా శివారు జిల్లాల ప్రజలు కూడా పాతబస్తీలోని మార్కెట్లకు వస్తుండడంతో క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతోంది.వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మండలం ట్రాఫిక్ పోలీసులు చార్మినార్ పరిసరాల్లో వాహనదారులకు పార్కింగ్ (Parking) సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు మక్కా మసీదులో నమాజ్‌లకు ముస్లింలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారి వాహనాలు పార్క్ చేసేందుకు పంచమొహల్లాలో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. అలాగే కూలగొట్టిన చార్మినార్ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని శుభ్రం చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు రంజాన్ నేపథ్యంలో పాతబస్తీకి సందర్శకులతో పాటు వినియోగదారుల సందడి అధికంగా ఉంటోంది. దీంతో వాహనదారుల సౌకర్యార్థ్యం పంచమొహాల్లాలో అతి పెద్ద ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం ఏర్పాటు చేశాం. అలాగే ఖిల్వత్ గ్రౌండ్, కుడా స్టేడియం, చౌక్‌మైదాన్ ఖాన్‌లోని ముఫిదుల్లా నాం ఖాళీ స్థలాలతో పాటు యునానీ ఆసుపత్రి ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా అక్రమంగా పార్కింగ్‌ల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఆర్.వెంకటేశ్వర్లు, నగర ట్రాఫిక్ డీసీపీ–3చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు! -
Ramadan 2025 హైదరాబాదీ..ప్యార్ కా తోఫా..!
గోల్కొండ: రంజాన్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఉపవాస దీక్ష.. ఉదయం నుంచి కఠిన ఉపవాసం చేసి సాయంత్రం పూట ఇఫ్తార్ విందులో రకరకాలైన పండ్లు ఆరగించి దీక్ష విరమిస్తారు. అందులో భాగంగా మార్కెట్లో పెద్దఎత్తున లభించే సీజనల్ ఫ్రూట్స్‌ను అందంగా ప్యాకింగ్ చేసి స్నేహితులు, బంధువులకు అందజేయడం హైదరాబాదీల ప్రత్యేకత.. కొత్తగా బంధుత్వాలు కలిసిన వారు తమ బంధుత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి వారి వారి స్థాయి మేరకు ఫ్రూట్స్ ప్యాక్స్‌ను అందజేస్తుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, స్నేహితులు ఇలా అందరూ పండ్లను అందజేసి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ మహా నగరంలో ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్ అందజేసే సంస్కృతి కొనసాగుతోంది. రంజాన్ మాసంలో కొంత మంది షాపుల యజమానులు ప్యాకింగ్ చేయడంలో సిద్ధహస్తులైన వారిని నియమించుకొని ప్యాకింగ్ చేయించుకుంటారు. గిఫ్ట్ ప్యాక్‌లో పెట్టడానికి వాడే పండ్ల రకాలను బట్టి ధరలు ఉంటాయని మెహిదీపట్నం ఎస్ఏ రాయల్ ఫ్రూట్ మార్ట్ వ్యాపారి అబ్దుల్ అజీజ్ అంటున్నారు. మొత్తం 23 రకాల పండ్లతో సుపీరియర్ గిఫ్ట్ ప్యాక్‌లను ప్రత్యేకంగా తయారు చేస్తామని అన్నారు. ఇందులో 23 రకాల పండ్లతో మొత్తం 19 కిలోల పండ్లు ఉంటాయి. అదే డీలక్స్ ఫ్రూట్ గిఫ్ట్ ప్యాక్‌లో 18 రకాల పండ్లు ఉండగా వీటిలో 14 కిలోల బరువు ఉంటుంది. అదేవిధంగా 11 రకాల పండ్లతో 10 కిలోల బరువు ఉండే ఫ్యాన్సీ గిఫ్ట్ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఏడు రకాల పండ్లు, ఆరు కిలోల గిఫ్ట్ ప్యాక్‌లు కూడా ఎక్కువగా అమ్ముడవుతాయి. నెంబర్ వన్ క్వాలిటీ ఖర్జూరా పండ్లు ఉపయోగిస్తామని ఆయన వివరించారు. వీటి ధరలు రూ.550 నుంచి రూ.18 వేల వరకు ఉంటాయని చెప్పారు. -
ప్రశాంతంగా ముగిసిన హోలీ, రంజాన్ ప్రార్థనలు
న్యూఢిల్లీ: దేశమంతటా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జనం రంగుల్లో మునిగితేలారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. హోలీ రంగులతో ఇళ్లు, వీధులు కొత్తరూపు సంతరించుకున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాలతో గడిపారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు రెండో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకేరోజు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల డ్రోన్లు సైతం మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో మసీదు కమిటీల పిలుపు మేరకు హోలీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో మొఘల్ పాలకుల కాలంనాటి షాహీ జామా మసీదులో గత ఏడాది నవంబర్‌లో సర్వే ప్రారంభించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రంజాన్ ప్రార్థనలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదు. సంభాల్‌లో సంప్రదాయ ‘చౌపాయ్ కా జులూస్’ శాంతియుతంగా జరిగింది. పోలీసుల చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు, రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఉపవాసాలు: స్విగ్గీ కొత్త అప్డేట్ చూశారా?
ప్రస్తుత రంజాన్ మాసంతో పాటు నవరాత్రి వంటి ఇతర ఉపవాస సమయాల్లో కస్టమర్లను నోటిఫికేషన్లతో ఇబ్బంది పెట్టకుండా ‘ఫాస్టింగ్ మోడ్’ అనే వినూత్న ఎంపికను ‘స్విగ్గీ’ ప్రారంభించింది. ఇది ఉపవాస సమయాల్లో వినియోగదారులు ఫుడ్ డెలివరీ నోటిఫికేషన్లను పాజ్ చేయడానికి అనుమతించే సరికొత్త ఫీచర్. ఈ ఫీచర్ ఉపవాస సమయాల్లో జోక్యం చేసుకోదు. వినియోగదారులకు అవసరమైనప్పుడు మాత్రం ఈ వేదిక సిద్ధంగా ఉంచుతుంది. వినియోగదారులు యాప్ నుంచి ఈ సెట్టింగ్‌ను సులభంగా ప్రారంభించ వచ్చు. అవసరం లేని సమయంలో నిలిపివేయవచ్చు. వినియోగదారులు స్విగ్గీ యాప్ నుండి ఎప్పుడైనా ఫాస్టింగ్ మోడ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. యాక్టివేట్ చేసిన తర్వాత.. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండే వినియోగదారులు అందరికీ సహర్ (తెల్లవారుజామున), సాయంత్రం 4 గంటల మధ్య ఫుడ్ నోటిఫికేషన్లు పాజ్ చేయబడతాయి. వినియోగదారుల ఉపవాస సమయం పూర్తయిన తరువాత నోటిఫికేషన్లు తిరిగి ప్రారంభమవుతాయి. మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. స్విగ్గీ ఆహార పదార్థాలపై 50 శాతం వరకూ తగ్గింపుతో రుచికరమైన వంటకాలు, ప్రత్యేక రంజాన్ భోజనాలను అందిస్తుందని యాజమాన్యం తెలిపింది. ఈ ఫీచర్‌ను సంస్థ సృజనాత్మక భాగస్వామి టాలెంటెడ్ రూపొందించింది. రోబోఆల్–ఇన్–వన్ కిచెన్ వండర్చెఫ్లోపద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ సంజీవ్ కపూర్దక్షిణ భారత్‌లో వండర్‌చెఫ్ ఔట్లెట్లను రెట్టింపు చేస్తామని పద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ సంజీవ్ కపూర్ తెలిపారు. కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్లో వండర్‌చెఫ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణాది మార్కెట్లో వంట గది వినూత్న పరిష్కారాలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. వండర్‌చెఫ్ బ్రాండ్ ఔట్లెట్లను రెట్టింపు చేస్తామని, ఇందులో హైదరాబాద్ మార్కెట్ ముఖ్యమైందని తెలిపారు. వండర్ చెఫ్ వినూత్న ఆవిష్కరణలతో హోమ్ చెఫ్‌లు ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేసుకునేందుకు వీలుంటుందన్నారు. అధునాతన మౌల్డింగ్ టెక్నాలజీలో కాస్ట్ ఐరన్ వంట సామగ్రి ‘ఫెర్రో’ని ప్రవేశపెట్టింది. కత్తిరించడం, ఆవిరి చేయడం, సాటింగ్, కలపడం, బ్లెండింగ్ చేసేందుకు ఆల్–ఇన్–వన్ కిచెన్ రోబోలా పనిచేస్తుంది. చెఫ్ సంజీవ్ కపూర్ స్వయంగా క్యురేట్ చేసిన 370కి పైగా వంటకాలతో కూడిన గైడ్ సహాయంతో స్క్రీన్లపై చూస్తూ హోమ్ చెఫ్‌లు వివిధ రకాల వంటలు చేసుకోవచ్చని తెలిపారు. -
Ramadan ఉపవాసాల అసలు లక్ష్యం
పవిత్ర రమజాన్ రాకడతో శుభాల పర్వం మొదలయింది. ముస్లింలు ఎంతో ఉత్సాహంతో ఉపవాస దీక్షలు ప్రారంభించారు. చిన్నపిల్లలు సైతం ‘రోజా’ పాటించడానికి ఉబలాట పడుతున్నారు. దీనికి కారణం ఏమిటి? అసలు ఉపవాసంఎందుకుండాలి? దీనికి స్వయంగా దైవమే, ‘ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’ అంటున్నాడు. భయ భక్తులంటే ఏమిటి? మానవుడి మనస్సు దుష్కర్మలపట్ల ఏవగింపును, అసహ్యాన్ని ప్రకటిస్తూ, సత్కర్మల పట్ల అధి కంగా మొగ్గుచూపే స్థితి. ఈ స్థితిని మానవ ఆంతర్యంలో జనింపజేయడమే ఉపవా సాల అసలు ఉద్దేశ్యం. అందుకని ఉపవాసం పాటించేవారు బాహ్య పరిశుభ్రతతోపాటు, అంతశ్శుద్ధిని కూడా పాటించాలి. నోటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మాట్లాడే అవసరం లేకపోతే మౌనం పాటించాలి. ఇతరులెవరైనా అకారణంగా రెచ్చగొట్టినా తాము ఉపవాస దీక్ష పాటిస్తున్నామన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఈ స్పృహ ఉన్నప్పుడే అన్నిరకాల చెడుల నుండి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉపవాస దీక్ష పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకడం, అసత్యాన్ని ఆచరించడం మానుకోనివారు నిజానికి వ్రతం పాటిస్తున్నట్లు కాదు. కేవలం పస్తులుండడంతో సమానం. ఉపవాసదీక్షల పేరుతో ఇలా ఆకలిదప్పు లతో పడి ఉండటం పట్ల దైవానికి ఏమాత్రం ఆసక్తిలేదు. మహ మ్మద్ ప్రవక్త(స) ఇలా చెప్పారు: ‘ఉపవాస దీక్ష పాటించే చాలా మందికి, తమ ఉపవాసాల ద్వారా ఆకలిదప్పుల బాధ తప్ప, మరెలాంటి ప్రయోజనమూ చేకూరదు’. ఉపవాస లక్ష్యం మనిషిని ఆకలిదప్పులతో మాడ్చిఉంచడం కాదు. దైవాదేశ పాలనలో మరింత రాటుదేలే విధంగా తీర్చిదిద్దడం. దైవ విధేయతా పరిధిని ఏమాత్రం అతిక్రమించకుండా, అన్నిరకాల చెడుల నుండి సురక్షితంగా ఉంచడం. పవిత్ర రమజాన్‌లో ఏ విధంగా అన్ని రకాల చెడులకు, అవలక్షణాలకు దూరంగా సత్కార్యాల్లో, దాన ధర్మాల్లో, దైవధ్యానంలో, సమాజ సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొంటారో... అలాగే మిగతా కాలమంతా సమాజంలోశాంతి, న్యాయం, ధర్మం పరిఢవిల్లుతూ జీవితం సాఫీగా గడిచిపోవాలని, పరలోక సాఫల్యం సిద్ధించాలన్నది అసలు ధ్యేయం.– యండి. ఉస్మాన్ ఖాన్ -
Ramadan: ప్రధాని మోదీ రంజాన్ సందేశం
రంజాన్ మాసం ఈరోజు(ఆదివారం) నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పవిత్ర రంజాన్ మాసం మన సమాజంలో శాంతి సామరస్యాలను తీసుకురావాలని’ ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ‘ఈ పవిత్ర మాసం.. కృతజ్ఞత, భక్తిప్రపత్తులను సూచిస్తుంది. కరుణ, దయ, సేవలకున్న విలువలను మనకు గుర్తు చేస్తుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. As the blessed month of Ramzan begins, may it bring peace and harmony in our society. This sacred month epitomises reflection, gratitude and devotion, also reminding us of the values of compassion, kindness and service. Ramzan Mubarak!— Narendra Modi (@narendramodi) March 2, 2025ఇస్లాంలో రంజాన్(Ramadan) మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటూ భగవంతుడిని ఆరాధిస్తారు. ఇస్లాంలోని ఐదు స్తంభాలలో రంజాన్‌ను ఒకటిగా పరిగణిస్తారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరణ కూడా ఈ నెలలో ఒక రోజు రాత్రి వేళ జరిగిందని చెబుతారు. రంజాన్ ముగిసిన తర్వాత, ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ పండుగను జరుపుకుంటారు. ముస్లింలు ఈ నెలను ఆరాధన మాసంగా భావిస్తారు. ఇది కూడా చదవండి: నేడు తొలి విశ్వశాంతి కేంద్రం ప్రారంభం