
ఫలితాలను ‘ఎక్స్’లో విడుదల చేసిన మంత్రి లోకేశ్
10,17,102 మంది హాజరవ్వగా 9,09,325 మంది పాస్
మొదటి ఏడాది 70 శాతం.. రెండో ఏడాది 83 శాతం మంది ఉత్తీర్ణత
బాలికల ఉత్తీర్ణత మొదటి ఏడాది 75 శాతం.. రెండో ఏడాది 86 శాతం
బాలుర ఉత్తీర్ణత ఫస్ట్ ఇయర్ 66 శాతం, రెండో ఏడాది 80 శాతం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10,58,893 మంది విద్యార్థులకు గాను 10,17,102 మంది హాజరవ్వగా 9,09,325 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,91,254 మందికి గాను 4,22,030 మంది (83 శాతం).. మొదటి ఏడాదిలో 5,25,848 మందికి గాను 4,87,295 మంది (70 శాతం) పాసయ్యారు.
2024–25 విద్యా సంవత్సరం ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ఇంటి నుంచి ‘ఎక్స్’లో విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఎప్పటిలాగే ఇంటర్ విద్య ఫలితాల్లో బాలికలే అత్యధిక శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 86 శాతం, మొదటి ఏడాది 75 శాతం.. బాలురు రెండో ఏడాది 80 శాతం, మొదటి సంవత్సరంలో 66 శాతం పాసయ్యారు.
టాప్‌లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు
ఈ విద్యా సంవత్సరం ఇంటర్ (మొదటి, ద్వితీయ) ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ మొదటి ఏడాదిలో కృష్ణా 85 శాతం, గుంటూరు 82 శాతం, ఎన్టీఆర్ జిల్లా 81 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రెండో ఏడాది కూడా ఇవే జిల్లాలు టాప్‌లో నిలవడం గమనార్హం. కృష్ణా 93 శాతం, గుంటూరు 91 శాతం, ఎన్టీఆర్ జిల్లా 89 శాతంతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ రెండో ఏడాది 54 శాతంతో చిత్తూరు చివరి స్థానంలో, మొదటి సంవత్సరం ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 73 శాతంతో చివరిలో నిలిచింది. అనకాపల్లి జిల్లా సైతం ఇదే శాతం సాధించడం గమనార్హం.
ఒకేషనల్‌లోనూ బాలికల హవా
ఇంటర్ ఒకేషనల్ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి ఏడాది 71 శాతం, రెండో ఏడాది 84 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు మొదటి ఏడాది 50 శాతం, రెండో ఏడాది 67 శాతం మంది విజయం సాధించారు. ఒకేషనల్ విభాగంలో మొదటి సంవత్సరం 38,553 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 23,991 మంది (62 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం 33,289 మంది హాజరవ్వగా 25,707 మంది (77 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఈనెల 20 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం
ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్మిడియట్ బోర్డుకు తెలియజేయాలని కమిషనర్ కృతికా శుక్లా తెలిపారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందన్నారు. ఫెయిలైన విద్యార్థులకు మే 12 నుంచి 20 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం శనివారం విడుదల చేశారు. మే 28 నుంచి జూన్ 19 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి 22 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పిస్తారు.
హెచ్‌ఈసీలో చాతుర్యకు 980 మార్కులు
కంభం: ప్రకాశం జిల్లా కంభంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన తమ్మినేని చాతుర్య హెచ్‌ఈసీ గ్రూపులో వెయ్యికిగాను 980 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విద్యార్థిని కళాశాలలో చేరే సమయంలో సైన్స్ గ్రూపు తీసుకోమని లెక్చరర్లు సూచించినా, తాను సివిల్స్, గ్రూప్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని.. అందుకోసమే హెచ్‌ఈసీ గ్రూపు తీసుకున్నానని తెలిపింది.
పేదింట మార్కుల పంట
జియ్యమ్మవలస: మన్యం జిల్లా జియ్మమ్మవలస మండలంలోని కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బర్ల లలిత సీనియర్ ఇంటర్ బైపీసీలో వెయ్యికి 989 మార్కులు సాధించి ప్రతిభ చాటుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థిని తల్లిదండ్రులు సంగమేష్, సుశీల రోజువారీ కూలీలు. నెల్లిమర్ల బాలికల వసతి గృహంలో ఉంటూ అక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది.