
కుమారపురంలోని నాగబాబు పర్యటనలో టీడీపీ, జనసేన పోటాపోటీ నినాదాలు
పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజూ నాగబాబుకు నిరసన సెగ
వర్మ అనుచరుల ఆగ్రహావేశాలు
జనసేన వర్గాల మండిపాటు
టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేత, ఎమ్మెల్సీ కె.నాగబాబు రెండో రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమాలు రసాభాసగా జరిగాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గెలుపు టీడీపీ నేత వర్మ వల్లే అయ్యిందని, తన నియోజకవర్గాన్ని, తనకు రావాల్సిన సీటును త్యాగం చేసిన ఆయనే లేకపోతే పవన్‌కు పదవి ఎక్కడిదని టీడీపీ వర్గాలు బాహాటంగా విమర్శిస్తూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతల తీరును దుయ్యబడుతూ జనసేన వర్గాలూ పోటీగా నినాదాలు చేశాయి. టీడీపీ నేతలను బయటకు గెంటేసే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ, తాము అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు.

నినాదాలు... ప్రతి నినాదాల హోరు
పిఠాపురం మండలం కుమారపురంలో సీసీ రోడ్లు ప్రారంభించడానికి వచ్చిన నాగబాబు కాన్వాయ్‌ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. జై వర్మ అంటూ నినదిస్తూ నాగబాబుకు తమ నిరసన తెలిపేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ప్రతిగా జనసేన వర్గాలు నాగబాబుకు అండగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలూ నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దూసుకు వచ్చే ప్రయత్నం చేయడంతో కుమారపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా, గొల్లప్రోలు మండలంలో తమను అడ్డుకుని దౌర్జన్యానికి దిగారంటూ టీడీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు ఫొటో లేకుండా ఫ్లెక్సీలు, శిలాఫలకాలా?
కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు కొత్త మాయాపట్నంలో తమ పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో లేకుండా ఫ్లెక్సీలు, శిలాఫలకాలు పెట్టారంటూ టీడీపీ నేతలు నిరసన తెలిపి, నాగబాబును అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించారు. తమను కార్యక్రమాలకు ఆహా్వనించి అవమానించారంటూ టీడీపీ నేతలు జనసేన నేతలపై మండిపడ్డారు.
అయితే కార్యక్రమాలకు వచ్చిన వారు హుందాగా వ్యవహరించాలి తప్ప దౌర్జన్యాలు, నిరసనలకు దిగడం ఏమిటని జనసేన వర్గాలు ఎదురు దాడికి దిగాయి. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. పోలీసులు వారిని వారించి, టీడీపీ వర్గాలను దూరంగా తరిమేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నాగబాబు పర్యటనను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించి, అక్కడి నుంచి వెనుదిరిగారు.
మీ పార్టీయే ఎమ్మెల్సీ ఇవ్వలేదు... మాకేంటి సంబంధం: జనసేన వర్గాలు
వర్మకు అనుకూలంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంపై జనసేన వర్గాలు మండిపడుతూ.. ‘మీ పార్టీయే వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. దానితో జనసేనకు ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఇక్కడ వర్మకు జిందాబాద్ కొడితే ఉపయోగం ఏమిటి’ అని టీడీపీ నేతలను పలుచోట్ల ఎద్దేవా చేయడం గమనార్హం.