
కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు వరద ముప్పు
విశాఖ, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కరువు ప్రమాదం
గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెను మార్పులు
ఐఐటీ గౌహతి, ఐఐటీ మండీ, బెంగళూరు సీఎస్‌టీఈపీ అధ్యయనం
గ్లోబల్ వార్మింగ్‌పై దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సర్వే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రానున్న కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా ప్రాంతాల వారీగా తీవ్రతను బట్టి వరదలు, కరువు వంటి పరిస్థితులు ఎదురు కానున్నాయి.
ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు తీవ్ర కరువును, మరికొన్ని తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నాయి. ఈమేరకు ఐఐటీ గువహటి, ఐఐటీ మండీ, బెంగళూరుకు చెందిన సీఎస్‌టీఈపీ (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ) సంస్థలు తాజాగా చేసిన సంయుక్త అధ్యయనంలో పేర్కొన్నాయి.
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వాతావరణంలో మార్పులు, వరదలొచ్చే అవకాశాలు, కరువులు వంటివాటిపై అధ్యయనం చేశారు. దీని ప్రకారం ఏపీలోని మూడు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నట్టు వెల్లడించారు.
కరువు కోరల్లో విశాఖ, కర్నూలు
రాష్ట్రంలోనే ప్రధాన నగరంగా ఉన్న విశాఖపట్నం జిల్లాలో కరువు సమస్య పొంచివున్నట్టు అధ్యయనంలో తేలింది. దీంతోపాటు కర్నూలు, ప్రకాశం జిల్లాలు కూడా తీవ్ర కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని ఐఐటీ నిపుణులు తేల్చారు.
గతంతో పోలిస్తే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్
(భూ ఉపరితల ఉష్ణోగ్రత) 1 డిగ్రీ సెల్సియస్ నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. ఎక్కువ ఉష్ణోగ్రతల ఒత్తిడి కారణంగా కొండచరియలు విరిగి పడటం వంటి ప్రమాదాలూ ఉండవచ్చునని పేర్కొన్నారు. వరదల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది. ఇదిలా ఉండగా.. వరద ముప్పుతో పాటు గుంటూరుకు కరువు ప్రమాదం కూడా ఉందని తేల్చారు.
శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు వరద ముప్పు చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరద ప్రమాదాన్ని, 118 జిల్లాలు అధిక వరద ముప్పును ఎదుర్కోనున్నట్టు తేలింది. మరో 91 జిల్లాలు అత్యధిక కరువు ప్రమాదం, 188 జిల్లాలు అధిక కరువు ప్రమాదం ఉన్న కేటగిరీలో చేర్చారు.
వరద ముప్పులో ‘ఆ మూడు’
రాష్ట్రంలో రానున్న సంవత్సరాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నట్లు అధ్యయనంలో తేల్చారు. వాతావరణంలో మార్పులు, తుపానులు, ఉష్ణోగ్రతల కారణంగా ఈ మూడు జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల వరదల కారణంగా విజయవాడ నీట మునిగిన విషయం తెలిసిందే.