
సిబిల్ స్కోరు నివేదిక చూసి, ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి ఒక అంచనాకు రావచ్చు. బ్యాంకులూ కొత్తగా అప్పు ఇచ్చేటప్పుడు దీన్ని నిశితంగా పరిశీలిస్తాయి. సిబిల్ స్కోరు 750 పాయింట్లకు మించి ఉందంటే ఆర్థిక క్రమశిక్షణ బాగుందని అర్థం. చాలా వెబ్‌సైట్లు, యాప్‌లు సిబిల్ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అందులో ఒకటి చాలా మంది తరచుగా ఉపయోగించే గూగుల్ పే ద్వారా ఈ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత్‌లో కోట్లాది మంది గూగుల్ పే యాప్‌ను వివిధ రకాల చెల్లింపుల కోసం వాడుతున్నారు. తొలుత దీంట్లో కేవలం నగదు బదిలీకి మాత్రమే అవకాశం ఉండేది. దశలవారీగా అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లకూ దీన్ని విస్తరించారు. ఇటీవల సిబిల్ స్కోర్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు.
ఎలా చెక్ చేసుకోవాలంటే..
- గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి
- ‘మేనేజ్ యువర్ మనీ’ సెక్షన్ వచ్చే వరకు స్క్రోల్ చేయాలి.
- అక్కడ కనిపించే ‘చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ‘Your CIBIL score does not decrease after you check it. Google Pay does not share credit report data with any 3rd party’ అనే పాప్‌అప్ కనిపిస్తుంది. దాని కింద సబ్మిట్ బటన్ వస్తుంది. అది క్లిక్ చేయాలి.
- క్షణాల్లో మీ సిబిల్ స్కోర్ తెరపై కింద కనిపిస్తుంది.
ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.100 కోట్లు సంపాదించొచ్చా..?
సిబిల్ స్కోర్ అంటే..
సిబిల్ అంటే ‘క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్’. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ హిస్టరీను అందించే సంస్థ. ఇది ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలోని క్రెడిట్ ఏజెన్సీ. సిబిల్.. వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ రుణ చరిత్ర నివేదిక, సిబిల్ స్కోర్‌ను తయారుచేస్తుంది. సిబిల్ స్కోర్ 300-900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్ సిబిల్ స్కోర్’గా పరిగణిస్తారు. అలాంటి వారికి రుణం ఇవ్వడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని అర్థం. 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు.