
రోజుకు లక్షలమందిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తున్న ఇండియన్ రైల్వే గురించి దాదాపు అందరికీ తెలిసిందే. లెక్కకు మించిన ట్రైన్స్ దేశంలోని ప్రధాన భూభాగాలను కలుపుతూ ముందుకు సాగిపోతాయి. అయితే ఇంత పెద్ద నెట్‌వర్క్ కలిగిన భారతీయ రైల్వే రోజుకు ఎంత సంపాదిస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.
భారతీయ రైల్వే తమ సేవలను అప్డేట్ చేయడానికి మాత్రమే కాకుండా.. ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం.. రవాణా కోసం ప్రత్యేక కారిడార్ల నిర్మాణం చేపట్టడం వంటివి చేస్తోంది.
ఇండియన్ రైల్వే రోజుకు ఎంత ఆదాయం గడిస్తుంది అన్న ప్రశ్నకు.. రూ. 400 కోట్లు అని సమాధానం వస్తోంది. అంటే భారతీయ రైల్వే నెలకు రూ. 12వేల కోట్లు సంపాదిస్తున్నమాట. రైల్వేలు కేవలం ప్రజా రవాణాకు మాత్రమే కాకుండా.. సరుకు రవాణా చేయడానికి కూడా విరివిగా ఉపయోగపడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం సరుకును పంపించాలనుకునే కస్టమర్లు ట్రైన్ల ద్వారానే సరుకు రవాణా చేస్తారు.
ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం
సరుకు రవాణా రైళ్ల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, ప్యాసింజర్ రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా రైల్వేలకు చాలా ముఖ్యమైనది. రైల్వేలు ప్రతిరోజూ వేలాది ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నాయి. రైల్వేలు స్క్రాప్ అమ్మకాలు వంటి ఇతర వనరుల నుంచి కూడా ఆదాయాన్ని సంపాదిస్తాయి. పీఐబీ డేటా ప్రకారం, 22-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు సరుకు రవాణా ద్వారా రూ.1,60,158 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది.
భారతీయ రైల్వేలు ప్రపంచంలోని టాప్ 5 అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇండియన్ రైల్వే 7,308 కంటే ఎక్కువ స్టేషన్లను కలిగి.. రోజుకు 20 మిలియన్లకు పైగా ప్రయాణికులను తరలిస్తోంది. ప్రకటనలు, ప్లాట్‌ఫామ్ టికెట్స్ ద్వారా కూడా ఇండియన్ రైల్వే డబ్బు సంపాదిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది.