పట్టాలపై విమానం!
న్యూఢిల్లీ: భారత రైల్వేలో తేజస్ రైళ్లు అత్యాధునిక సదుపాయాలతో సిద్ధంకానున్నాయి. శతాబ్ది రైళ్ల కంటే 20 నుంచి 30 శాతం చార్జీలు అధికంగా వసూలు చేయాలని భావిస్తున్న ఈ ట్రైన్లలో ప్రయాణం ఓ దివ్యానుభూతిని పంచుతుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపుదిద్దుకుంటున్న ఈ రైళ్లలో వాణిజ్య విమానాల తరహాలో అటెండెంట్లతో సహా సకల సదుపాయాలు ఉంటాయి. వైఫై సదుపాయం, మనకు నచ్చే వంటకాలు, డ్రింక్ వెండింగ్ మెషీన్లు, సీసీటీవీలు ఉంటాయి.
కోచ్‌లలో అద్భుతమైన ఇంటీరియర్ డెకరేషన్ ఉంటుంది. ఢిల్లీ-లక్నో మార్గంలో పగటిపూట ప్రయాణం కోసం ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఈ తేజస్ రైళ్లలో ఎగ్జిక్యూటివ్ క్లాస్, చైర్‌కార్లు ఉంటాయి. రైల్వేల్లో రెండు భారీ సంస్కర ణలు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. రైలు చార్జీల నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడంతోపాటు రైల్వేల్లో మౌలిక వసతుల అభివృద్ధి నిధిని త్వరలో ప్రారంభించనున్నారు.