రైల్వే మౌలిక సౌకర్యాలు బలోపేతం
న్యూఢిల్లీ: రైల్వేల్లో మౌలిక సౌకర్యాల బలోపేతానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) దోహదపడతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆమె గురువారం మీడియాతో చెప్పారు. ‘రక్షణ, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపని రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
యాజమాన్యం, అజమాయిషీ, ముఖ్య కార్యకలాపాలన్నీ రైల్వేల చేతుల్లోనే ఉంటాయి. రైల్వేలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల పరిష్కారానికి నిధుల కొరత అవరోధంగా ఉంది. ఈ సమస్యలను ఎఫ్‌డీఐతో అధిగమించవచ్చని మేం భావించాం...’ అని ఆమె వివరించారు.
ఆర్థిక సంస్కరణల అమలుకు పట్టుదలతో ఉన్న కేంద్ర కేబినెట్ రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచే ప్రతిపాదనను బుధవారం ఆమోదించింది. హైస్పీడ్ ట్రెయిన్ల వంటి రైల్వే మౌలిక సౌకర్యాల్లో వంద శాతం ఎఫ్‌డీఐకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో రైల్వే మౌలిక సౌకర్యాలపై, ముఖ్యంగా చైనా పెట్టుబడుల ప్రతిపాదనలపై హోంశాఖ ఆందోళన వెలిబుచ్చింది. ఎఫ్‌డీఐ విధాన రూపకల్పన సమయంలో ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐని ప్రస్తావిస్తూ, ఈ రంగం భారతీయుల అదుపాజ్ఞల్లోనే ఉంటుందని చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ తెస్తామంటూ యాజమాన్య హక్కుల్లో వాటా కోరే ప్రతిపాదనలు వస్తే వాటిని కేబినెట్ సమగ్రంగా పరిశీలిస్తుందనీ, అయితే ఇలాంటి కేసులు అరుదుగా ఉంటాయనీ పేర్కొన్నారు.
కార్పొరేట్ల హర్షం..: రక్షణ, రైల్వే రంగాల్లో ఎఫ్‌డీఐలను కేంద్రం ఆమోదించడంపై దేశీయ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సంస్కరణల అమలుకు మోడీ సర్కార్ కట్టుబడి ఉందని దీంతో స్పష్టమవుతోందని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.రావత్ అన్నారు. ఉత్పత్తి, అభివృద్ధి రంగాల్లో భారత కంపెనీలతో కలసి పనిచేయడానికి బహుళజాతి సంస్థలను ప్రోత్సహించేలా ప్రభుత్వ నిర్ణయాలున్నాయని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు.