
చాలామంది ధనవంతులు పన్ను మినహాయింపులు కల్పించే దేశాలలో స్థిరపడటానికి మక్కువ చూపిస్తారు. ఇప్పటికే కొంతమంది బ్రిటన్‌లో స్థిరపడ్డారు. అయితే అక్కడి ప్రభుత్వం.. ఇప్పటి వరకు అమలులో ఉన్న 'నాన్-డోమ్' పన్ను విధానాన్ని రద్దు చేసే దిశగా ఆలోచిస్తోంది. ఇదే జరిగితే ప్రముఖ పారిశ్రామికవేత్త 'లక్ష్మీ మిత్తల్' (Lakshmi Mittal) యూకే వీడనున్నారు.
నాన్-డోమ్ పన్ను విధానం అమలులో ఉన్నంత వరకు.. ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ పన్ను విధానాన్ని రద్దు చేస్తే.. ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సుమారు రెండు శతాబ్దాలకంటే ఎక్కువ కాలంగా ఈ పన్ను విధానం బ్రిటన్‌లో అమలులో ఉంది. కానీ ఇప్పుడున్న అక్కడి ప్రభుత్వం ఈ పన్ను విధానానికి మంగళం పాడనుంది.
యూకేలో కొత్త పన్ను విధానం అమలులోకి వస్తే, ధనవంతులు.. పన్ను విధించని యూఏఈ, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలలో ఎదో ఒకదానికి వెళ్లే అవకాశం ఉంది.
లక్ష్మి మిత్తల్ విషయానికి వస్తే.. స్టీల్ టైకూన్‌గా ప్రసిద్ధి చెందిన ఈయన యూకేలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరు. గత సంవత్సరం సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో 14.9 బిలియన్ ఫౌండ్లతో ఏడవ స్థానంలో నిలిచారు. ఈయనకు లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్‌లో ఒక భవనం, స్విస్ రిసార్ట్ పట్టణం సెయింట్ మోరిట్జ్‌లో ఒక ఛాలెట్‌తో సహా యూరప్, యుఎస్, ఆసియా అంతటా విలువైన ఆస్తులు ఉన్నాయి. అంతే కాకుండా ఈయన దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.