
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కనెక్టివిటీ లేని అన్ని గ్రామాలకు 2024 కల్లా 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ చెప్పారు. ‘4జీ విస్తరణ ప్రాజెక్టు గురించి మాట్లాడితే.. దాదాపు 38,000 - 40,000 గ్రామాలకు సిగ్నల్స్ లేవు. ప్రతి ఇంటికీ చేరే దిశగా.. 2024 నాటికల్లా 4జీ పూర్తి స్థాయిలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ’మన్ కీ బాత్’ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ప్రసారం సందర్భంగా చౌహాన్ మాట్లాడారు.
ప్రభుత్వ ప్రాజెక్టులు, సేవలను మరింతగా ప్రజలందరి వద్దకు చేర్చేలా ప్రధాని ప్రోత్సహిస్తారని ఆయన పేర్కొన్నారు. కనెక్టివిటీ లేని గ్రామాలకు కూడా 4జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం వల్ల సామాజిక - ఆర్థిక పరివర్తన సాధ్యపడుతుందని, డిజిటల్ అసమానతలను తొలగించవచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఎంత మేర జవాబుదారీతనంతో వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు.
కవరేజీ లేని గ్రామాలన్నింటిలోనూ 4జీ మొబైల్ సర్వీసులను విస్తరించే ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ 2022 జూలైలో ఆమోదించింది. దీని మొత్తం వ్యయం రూ. 26,316 కోట్లు. దీనితో చేరుకోవడం కష్టతరంగా ఉండే 24,680 పైచిలుకు మారుమూల గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తేనున్నారు.