
పొద్దున్న లేచింది మొదలు రాత్రినిద్రపోయేంతవరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు జనం. బస్సుల్లో, బస్‌స్టాప్‌లో, రైళ్లలో, పార్క్‌ల్లో, ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు. పెద్దలు చెప్పినట్టు లేవగానే దేవుడి ముఖం చూస్తారో లేదో తెలియదు గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడని వారుమాత్రం ఉండరంటే అతిశయోక్తికాదు. అలా మారిపోయింది నేటి డిజిటల్ యుగం. కొంచెం టైం దొరికితే చాలు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా రీల్స్ (Reels), యూట్యూబ్ షార్ట్ వీడియోలు... అక్కడితో అయిపోదు.. టైం వేస్ట్ అవుతోందని తెలిసినా..మళ్లీ ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది గంటల తరబడి. ఇలా రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నవారికి ఒక హెచ్చరిక. ఈ అలవాటు అనేక మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా?
స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అనర్థాలపై ఇప్పటికే చాలా అధ్యయనాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పడుకునే సమయంలో షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూడటానికి గడిపే స్క్రీన్ సమయానికి , యువకులు మధ్య వయస్కులలో అధిక రక్తపోటుకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఒక అధ్యయనం గుర్తించింది. తాజాగా ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ ' సెలెండ్ ఎపిడమిక్ ఆఫ్ డిజిటల్ ఐ' అంటూ ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరించారు. "రీల్స్ తక్కువగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది" అని డాక్టర్ లాల్ హెచ్చరించారు.మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో మనుషులు అనేక సమస్యలు కొని తెచ్చుకోవడమేననీ, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్ ,యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్‌ను అతిగా చూడటం వల్ల అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా పిల్లలు , యువకుల్లో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ విపరీతంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని యశోభూమి- ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో మంగళవారం (ఏప్రిల్ 1) జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ, ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్ సొసైటీ సంయుక్త సమావేశంలో ఇందుకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ వల్ల పెద్దల్లో కూడాతరచుగా తలనొప్పి, మైగ్రేన్లు , నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది నయంకాని అంధత్వానికి అత్యంత సాధారణ కారణమైన మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.
చదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!
అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల డిజిటల్ కంటి ఒత్తిడి, మెల్లకన్ను,కంటి చూపు క్షీణించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు ,పని చేసే నిపుణులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక స్క్రీన్ సమయం వల్ల సామాజికంగా ఒంటరితనం, మానసిక అలసట,మతిమరపు లాంటి సామాజిక , మానసిక నష్టాన్ని కూడా వారు నొక్కి వక్కాణిస్తున్నారు.
చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో
ఏం చేయాలి. 20.20.20 రూల్
నియంత్రణలేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే ఐ బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్‌లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం,క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి డిజిటల్ డిటాక్స్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు కంటివైద్య నిపుణులు.
చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!