కాస్త సృజనాత్మకత.. ఇంకాస్త సరదా.. కలగలిపిన వీడియో ‘రీల్స్’ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న కొన్ని షార్ట్ వీడియోలు వినోదం పంచుతుంటే.. ఇంకొన్ని ప్రజల చెంతకు విజ్ఞానాన్ని చేరుస్తున్నాయి. సరదాగా చేసిన షార్ట్ వీడియో.. షార్ట్ టైమ్‌లో స్టార్‌లను చేస్తోంది.
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా సామాన్యులను సైతం కంటెంట్ సృష్టికర్తలుగా మార్చేస్తోంది. చిన్నచిన్న రీల్స్‌లో ‘రియల్ లైఫ్’ డైరెక్షన్ చేయిస్తోంది. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన ‘రీల్స్ ఫీచర్’ వినియోగంలో ప్రపంచంతో పోలిస్తే భారతదేశం అగ్రస్థానంలో స్ట్రీమ్ అవుతోంది.
ప్రస్తుతం దేశంలో 230.25 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉంటే.. ఇందులో ఏకంగా 200 మిలియన్ల ప్రజలు రోజుకు 45 నిమిషాల పాటు షార్ట్ ఫామ్ వీడియోల్లో గడుపుతున్నారు. ఈ సంఖ్య త్వరలో 600 మిలియన్లకు చేరుతుందని ఇన్‌స్టాగ్రామ్ తన సర్వేలో వెల్లడించింది.
కాదేదీ రీల్స్‌కు అనర్హం
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇతర వీడియో రీల్స్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే యువతకు ఎక్కువ శ్రమ, నైపుణ్యం అవసరం లేకుండా చిన్న వీడియోలను రూపొందించడానికి చక్కని వేదికగా మారింది. డబ్బింగ్, రీమిక్స్, సోషల్ ఛాలెంజెస్, షాపింగ్ ప్రమోషన్లు, ప్రతిభా ప్రదర్శనలు, రచులు, అభిరుచులు, డబ్‌స్మాష్‌లు, ఫ్యాషన్, మేకప్, ఆరోగ్య చిట్కాలు, వైద్యం, విద్య, ట్రావెలింగ్ ఇలా.. ఒకటేమిటి కాదేదీ రీల్స్‌కు అనర్హం అన్నట్టు మారిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా విశేషాలను పంచుకునే సమాచార, విజ్ఞాన వేదికగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గుర్తింపు పొందింది. ప్రతినెలా 200 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు రీల్స్‌లో మునిగితేలుతున్నారు. ఇది 2023 నాటికి 2.5 బిలియన్ యూజర్లకు చేరుకుంటుందని అంచనా. ఇన్‌స్టాగ్రామ్ ప్రేక్షకుల్లో ఎక్కువ మంది (31.5 శాతం) 25–34 ఏళ్ల మధ్య వయస్కులే ఉంటున్నారు.
అత్యధిక డౌన్‌లోడ్‌లలో రెండోది
2022లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌లలో ఇన్‌స్టాగ్రామ్ రెండో స్థానంలో నిలిచిందంటే రీల్స్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో 15 సెకన్ల నిడివి నుంచి ఇప్పుడు 90 సెకన్లు వరకు వీడియో రీల్స్ సమయం పెరిగింది. ఇటీవల 15 నిమిషాల్లోపు వీడియోలను కూడా రీల్స్‌గా ఇన్‌స్టాగ్రామ్ పరిగణిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో సాధారణ వీడియో పోస్టింగ్‌ల కంటే రీల్స్ 22 శాతం ఎక్కువగా ఉంటున్నాయి. రీల్స్ ప్రారంభం అయిన తర్వాత బ్రెజిల్‌లో ఇన్‌స్టాగ్రామ్ వినియోగం 4.3 శాతం పెరిగింది. 2020లో ప్రారంభమైన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రెండేళ్లలో బిలియన్ల ప్రజలను ఆకట్టుకోవడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా సగటున ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో 30–50 నిమిషాలు గడుపుతున్నారు. కేవలం రీల్స్ ద్వారా ప్రకటనలు 675.3 మిలియన్ల మందికి వేగంగా చేరుకోగలుగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సగటు వీడియో వీక్షణ రేటు 2.54 శాతం. ఇది సాధారణ వీడియో వీక్షణలతో పోలిస్తే 0.8 శాతం ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment